కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ హింగల్‌గంజ్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రేఖా పాత్రా పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఐసీయూలో వెంటిలేటర్‌పై అత్యవసర చికిత్స పొందుతున్నారు.
శనివారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో హింగల్‌గంజ్‌లోని తన నివాసంలో ఉన్న పాత్ర అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. ఆమె పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఆరోగ్యం పరిస్థితి మరింత దిగజారడంతో వైద్యులు ఆమెను బసిర్‌హత్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు.
బసిర్‌హత్ ఆసుపత్రిలో ఆమెను క్రిటికల్ కేర్ యూనిట్‌లో చేర్చారు. సుమారు నాలుగు గంటల చికిత్స తర్వాత కూడా ఆమె ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి గణనీయమైన మార్పు లేకపోవడంతో ఆమెను కోల్‌కతాకు తీసుకువచ్చారు. ఆ రాత్రి ఆలస్యంగా, హింగల్‌గంజ్ ఎమ్మెల్యేను నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె డాక్టర్ యుధాజిత్ సేన్‌గుప్తా పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
ఆమె ఆరోగ్యంపై సమాచారం అందుకున్న రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శరద్వత్ ముఖోపాధ్యాయ ఆసుపత్రికి వెళ్లి రేఖా పాత్రా ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ఆరోగ్యం గురించి సీఎం సువేందు అధికారికి వివరించాం. ఆయన ఎమ్మెల్యే ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. ఎమ్మెల్యేపై విష ప్రయోగం జరిగిందనే వైద్యుల నివేదికను ఖండించారు. ఆమెకు ఫుడ్ పాయిజన్ అయిందని స్పష్టం చేశారు.
రేఖా పాత్ర పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ ప్రాంతానికి చెందిన సామాన్య గృహిణి,సామాజిక కార్యకర్త. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున బసిర్హత్ నియోజకవర్గం నుండి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. 2024 ప్రారంభంలో సందేశ్‌ఖాలీలో తృణమూల్ కాంగ్రెస్ స్థానిక నాయకుడు షాజహాన్ షేక్, అతని అనుచరుల భూకబ్జాలు, మహిళలపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో రేఖా పాత్ర ముందుండి పోరాడారు.
నిందితులపై ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు మొదటి ఫిర్యాదు చేసిన బాధితుల్లో ఆమె ఒకరు. దీంతో ఆమె స్థానిక మహిళల ఆందోళనలకు ప్రధాన ముఖచిత్రంగా మారారు. ఆమె పోరాటాన్ని గుర్తించిన బీజేపీ, 2024 సార్వత్రిక ఎన్నికల్లో సందేశ్‌ఖాలీ ప్రాంతం పరిధిలోకి వచ్చే బసిర్హత్ లోక్‌సభ స్థానం నుండి ఆమెకు టికెట్ కేటాయించింది. ఆ ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత, ఈ ఏడాది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో హింగల్‌గంజ్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించి ఎమ్మెల్యే అయ్యారు.
సామాన్య గృహిణి నేరుగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. ఎన్నికల ప్రచార సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రేఖా పాత్రతో ఫోన్‌లో మాట్లాడి, ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటూ ఆమెను శక్తి స్వరూప అని అభివర్ణించారు.
ఇటీవల, రేఖా పాత్ర పార్టీ జిల్లా నాయకత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆమె తన రాజకీయ వైఖరి గురించి,బీజేపీ అంతర్గత సమస్యల గురించి బహిరంగంగానే మాట్లాడారు.


