బెదిరింపు.. ఆదిరింది గురూ ! | Blackmail Politics In Jammalamadugu MLA Adinarayana Reddy | Sakshi
Sakshi News home page

బెదిరింపు.. ఆదిరింది గురూ !

Nov 22 2026 7:52 AM | Updated on Nov 22 2026 7:52 AM

Blackmail Politics In Jammalamadugu MLA Adinarayana Reddy

సాక్షి ప్రతినిధి, కడప: జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాల్లో ఆరితేరారు. ‘ఆది’ మాటలకు అర్థాలే వేరులేనని మరోమారు నిరూపించారు. తాజాగా ‘జెడ్పీ ఛైర్మన్‌’ సీటు పేరిట హంగామా చేయడంతో ఆయన తీరు మరోసారి జిల్లాలో చర్చనీయాంశమైంది. జెడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియలోనే నిష్క్రమించి, తాజాగా వివాదం సృష్టించడం వెనుక వ్యక్తిగత స్వప్రయోజనం, కుటుంబంలో పైచేయి సాధించడమే అసలు లక్ష్యం దాగిందని జమ్మలమడుగు వాసులు వెల్లడిస్తున్నారు.  

ఒకసారి కాదు...రెండుసార్లు కాదు.. ఆయన అక్రమార్జనకు, పదవులకు ఎవరైనా అడ్డంకి వస్తే ఎన్నిసార్లైనా రాజీనామా అ్రస్తాన్ని బయటకు తీస్తాడు. సొంత వారినైనా, కూటమిలో ఇతర పార్టీలపైనైనా బ్లాక్‌ మెయిల్‌ చేసి పబ్బం గడుపుకోవడంలో ఆయనది అందెవేసిన చేయిగా విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. తాజాగా కడప జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పీఠం బీజేపీకి కేటాయించాలని  ఎమ్మెల్యే ఆది చేసిన రాద్ధాంతం వెనుక అసలు కథ వేరే ఉందనేది పరిశీలకుల అభిప్రాయం. బీజేపీ నుంచి తన సోదరుని కుమారుడు రాజేష్‌ జమ్మలమడుగు జెడ్పీటీసీగా దౌర్జన్యాలు చేసి మరీ ఏకగ్రీవం చేసుకున్నాడు. కానీ జెడ్పీటీసీ నామినేషన్ల రోజున జెడ్పీ పీఠం టీడీపీకేనని స్పష్టంగా వినిపించింది. ఒక్కరోజు నామినేషన్లు సెంటర్‌లో హల్‌చల్‌ చేసినా ఆ తర్వాత ఎక్కడా కానరాలేదని విశ్లేషకులు వివరిస్తున్నారు.  

టీడీపీకే అత్యధిక స్థానాలు 
వాస్తవానికి జిల్లాలో 39 జెడ్పీటీసీల్లో 32 స్థానాల్లో టీడీపీ తమ దౌర్జన్యకాండతో ఏకగ్రీవం చేసుకుంది. అత్యధిక స్థానాలు గెలిచిన టీడీపీకే ఛైర్మన్‌ పీఠం వెళుతుందనేది సుస్పష్టం. కూటమి నేతలకు ముఖ్యంగా ఆదినారాయణరెడ్డికి కూడా ఈ విషయం తెలుసు. అయినా ఓ ప్రయత్నం చేశా రు. ఆ ప్రయత్నానికి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ మద్దతుగా నిలవడం.. ఆపై మంత్రి సత్యకుమార్, మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు అండ లభించడంతో  ‘జెడ్పీ పీఠం మనదే’ అనే సంకేతాన్ని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి బాహాటంగా చెప్పుకొచ్చారు. దాంతో చుట్టూ ఉన్న అనుచరులు రెచ్చిపోయారు. పందేలు కాశారు. తీరా టీడీపీకే చైర్మన్‌ గిరీ ప్రకటించడంతో ఒక్కమారుగా అవాక్కయ్యారని విశ్లేషకులు వివరిస్తున్నారు. 

స్వప్రయోజనాలే అసలు లక్ష్యం... 
ఇదొక్కటే కాదు..ఆయన స్వప్రయోజనాలకు భంగం కలిగిన ప్రతిసారీ ఆదినారాయణరెడ్డి రాజీనామా అ్రస్తాన్ని బయటకు తీయడం పరిపాటిగా మారిందని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. గతంలో తిరుపతి కేంద్రంగా కూటమి పాలన ‘కమ్మ’గా ఉందంటూ అంటూ విమర్శలు చేసి తన పనులు చక్కబెట్టుకున్నారు. గండికోట పర్యాటక ప్రదేశంలో కేంద్రం మంజూరు చేసిన రూ.70 కోట్ల పనులు సీఎం రమేష్‌కు కట్టబెట్టిన సందర్భంలోనూ రాజీనామా డ్రామా అడారు. కొండాపురంలో నిబంధనలు లేకపోయినా ముంపు పరిహారం పేరుతో నిధులు కాజేసేందుకు కూడా ఆయన రాజీనామా అ్రస్తాన్ని బయటకు తీశారు. ఇలా తన పనులు చక్కబెట్టుకోవడానికి ఆదినారాయణరెడ్డి బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలకు దిగడం కొత్తేమీ కాదని రాజకీయ వర్గాలు వివరిస్తున్నాయి. తాజా గా మరోసారి  రాజీనామా అ్రస్తాన్ని బయటకు తీశారు. మరి తాజా అస్త్రంతోనైనా మంత్రి పదవి దక్కుతుందా లేదా అనేది వేచిచూడాల్సిందే.    

మరో అవకాశం కోసం ఎత్తుగడ... 
ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి హైడ్రామా వెనుక మరో అవకాశం దక్కుతోందనే భావనే అధికంగా ఉన్నట్లు పరిశీలకుల మాట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటిపోయింది. ఇక మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలున్నాయి. అదే జరిగితే ఆ విస్తరణలో మంత్రి పదవి కోసం ఆదినారాయణరెడ్డి తనదైన శైలిలో అటు బీజేపీలో ఇటు సీఎం చంద్రబాబు వద్ద పట్టు సాధించడానికి సరికొత్త ఎత్తుగడ వేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. జెడ్పీ పీఠం ఎటుపోయింది, భవిష్యత్‌ను అనుకూలంగా మల్చుకునే క్రమంలో భాగంగా రాజధాని విజయవాడ కేంద్రంగా చురుగ్గా పావులు కదుపుతున్నట్లు సమాచారం. మరో వైపు మంత్రి పదవి కోసం కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల తన భర్తకు రాజ్యసభ సీటు ఇవ్వకపోవడం, మాధవిరెడ్డి అలకబూని రాద్ధాంతం చేయడం తెలిసిందే. టీడీపీ నుంచి మాధవిరెడ్డి కూడా మంత్రి పదవి కోసం తీవ్రమైన ఒత్తిడి తెస్తారని ఆదినారాయణరెడ్డి తెలుసు. అందుకే జెడ్పీ ఛైర్మన్‌ పీఠం పేరుతో ఇప్పుడు ఆయన నడిపిస్తున్న రాజీనామా డ్రామా వెనుక పెద్ద స్కెచ్చే ఉందంటూ సీనియర్లు చెవులు కొరుక్కుంటున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement