కలెక్టర్ చాంబర్ వద్ద మోహిత్‌రెడ్డి తొమ్మిది గంటల నిరాహార దీక్ష
అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని స్పష్టీకరణ
రాత్రి 7 గంటలకు బలవంతంగా అరెస్టు చేసిన పోలీసులు
తిరుపతి రూరల్: చంద్రగిరి నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల తిరస్కరణ వ్యవహారం తీవ్ర రాజకీయ ఉద్రిక్తతకు దారితీసింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లను ఉద్దేశపూర్వకంగా తిరస్కరిస్తున్నారంటూ ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి తిరుపతిలోని జిల్లా కలెక్టర్ చాంబర్ ముందు నిరాహార దీక్ష చేపట్టారు. తిరస్కరణకు గురైన నామినేషన్లను పునఃపరిశీలించి, అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఉదయం 10 గంటల నుంచి నిరాహార దీక్షకు దిగారు. కలెక్టరేట్‌లోని జిల్లా కలెక్టర్ చాంబర్ ఎదుట బైఠాయించిన ఆయనను రాత్రి 7 గంటలకు పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి తరలించారు.
ఈ సందర్భంగా మోహిత్‌రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గమైన చంద్రగిరిలో ఓటమి భయంతోనే వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరిస్తున్నారని ఆరోపించారు. పరిశీలన పేరుతో అధికారులే నామినేషన్లను చించేసి తిరస్కరిస్తున్నారని పేర్కొన్నారు. వాస్తవాలు ఇలా వుంటే.. నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నామని కలెక్టర్ చెప్పడం సరికాదన్నారు. తిరస్కరణల తరువాత ఆర్డీవో వద్ద అప్పీలుకు వెళ్లినా తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని వ్యాఖ్యానించారు.
చంద్రగిరి నియోజకవర్గంలోని మూడు జెడ్పీటీసీ స్థానాలను రాజీనామా చేస్తామని, మీరు రాజీనామాచేసి ఎన్నికలకు వస్తారా..? అని ఎమ్మెల్యే పులివర్తి నానికి మోహిత్ రెడ్డి సవాల్ విసిరారు. అదే జరిగితే 50వేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలుస్తామన్నారు. ప్రజాబలం వైఎస్సార్‌సీపీకి ఉందని తెలుసుకున్న తరువాత ఇలాంటి దొంగచాటు ఏకగ్రీవాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.


