అధికారం కోసం హామీలు.. వయోపరిమితి ఆశలపై నీళ్లు! | Unemployed youth deeply concerned over age limit for Group 2 posts | Sakshi
Sakshi News home page

అధికారం కోసం హామీలు.. వయోపరిమితి ఆశలపై నీళ్లు!

Nov 22 2026 5:45 AM | Updated on Nov 22 2026 5:45 AM

Unemployed youth deeply concerned over age limit for Group 2 posts

గ్రూప్‌–2 పోస్టులకు వయోపరిమితిపై నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళన

వయో పరిమితి 47 ఏళ్లకు పెంచాలని డిమాండ్‌ 

ఎన్నికల్లో నిరుద్యోగులకు హామీలు గుప్పించిన మంత్రి లోకేశ్‌..

అధికారంలోకి వచ్చాక 44 ఏళ్లకే పరిమితం చేస్తూ టీడీపీ సర్కారు నిర్ణయం

వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద అవకాశం ఇవ్వాలని అభ్యర్థుల వేడుకోలు

44 ఏళ్లకు పరిమితం చేయడంతో వేలాది మందికి తీరని అన్యాయం

గుంటూరు, ఎడ్యుకేషన్‌: చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగుల్లో ఆశలు పెంచకపోగా, తీవ్ర నిరాశను నింపుతోంది. వయోపరిమితి కేవలం రెండేళ్లకు పరిమితి చేయడంతో లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యే అవకాశాన్ని కోల్పోతున్నారు. యూపీఎస్సీ మాదిరిగా రాష్ట్రంలో ఏపీపీఎస్సీ రెగ్యులర్‌గా నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడంతో పాటు నోటిఫికేషన్ల విడుదలకు మధ్య మూడు, నాలుగేళ్ల వ్యవధి ఉంటున్న దృష్ట్యా ఒక్కసారి పరీక్షలు రాసి ఉద్యోగాన్ని పొందలేకపోయిన అభ్యర్థులకు మరోసారి దరఖాస్తు చేసుకునే సమయానికి వయసు మీరిపోతోంది. గ్రూప్‌–1 పోస్టులకు దరఖాస్తు గడువు ముగియగా, గ్రూప్‌–2 పోస్టులకూ డిసెంబర్‌ 11న గడువు ముగుస్తుండటంతో కనీసం గ్రూప్‌–2 పోస్టులకైనా వయో పరిమితి 47 ఏళ్లకు పెంచాలని నిరుద్యోగార్థులు కోరుతున్నారు.

నోటిఫికేషన్లు లేక.. ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాసి..
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు కళ్లుకాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఏటా జాబ్‌ కేలండర్‌ ఇచ్చి ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన టీడీపీ రెండున్నరేళ్లలో గ్రూప్‌–1, గ్రూప్‌–2లకు సంబంధించిన ఒక్క నోటిఫికేషన్‌ విడుదల చేయలేదు. దీంతో నిరుద్యోగులు వయసు మీరిపోయి ఉద్యోగాలకు అర్హత కోల్పోతున్నారు. తమపై ఆశలు పెట్టుకున్న కుటుంబాలకు న్యాయం చేయలేకపోతున్నామని వారంతా ఆవేదన చెందుతున్నారు. ఏపీలో 42 ఏళ్లుగా ఉన్న జనరల్‌ అభ్యర్థుల వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచారు. 

కానీ, పొరుగున ఉన్న తెలంగాణలో 46 ఏళ్లకు పెంచారు. పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల్లో వయో పరిమితి నిబంధన లేదు. రాష్ట్ర ప్రభుత్వాలకు వయోపరిమితి సడలింపు కొత్తేమీ కాదు. రెగ్యులర్‌ నోటిఫికేషన్‌ లేనందున వయోపరిమితిని సడలింపు ఇస్తూ రావడం సహజమే. సడలింపు విషయంలో ప్రభుత్వానికి అధికారాలు ఉన్నప్పటికీ వయోపరిమితి కేవలం రెండేళ్లకు పెంచడం దుర్మార్గమని అభ్యర్థులు మండిపడుతున్నారు. నిరుద్యోగులకు ఇష్టారాజ్యంగా హామీలు గుప్పించిన మంత్రి లోకేశ్‌ అధికారంలోకి వచ్చాక హామీలను విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వయోపరిమితి 47 ఏళ్లకు పెంచుతూ ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. 

వన్‌టైం సెటిల్‌మెంట్‌ అవకాశం ఇవ్వాలి..
గ్రూప్‌–1, గ్రూప్‌–2, డీఎస్సీ అభ్యర్థుల దీర్ఘకాలిక సమస్యను దృష్టిలో ఉంచుకుని, రెగ్యులర్‌ నోటిఫికేషన్లు లేని ప్రత్యేక పరిస్థితుల రీత్యా వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచి ‘వన్‌ టైం సెటిల్‌మెంట్‌’ కింద అవకాశం కల్పించాలి. వేలాది నిరుద్యోగ అభ్యర్థుల భవిష్యత్తును కాపాడాలి. – వై.శేషయ్య, నెల్లూరు

ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం..
ఏపీపీఎస్సీ నుంచి గ్రూప్‌–2 నోటిఫికేషన్‌ కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం. రెగ్యులర్‌గా నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడంతో వయసు దాటిపోతోంది. మా కలలు, కష్టాలు వయోపరిమితి దగ్గర ఆగిపోయాయి. గ్రూప్స్, డీఎస్సీ నోటిఫికేషన్లకు వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచి, మాలాంటి వారికి అవకాశం ఇవ్వాలి.  – గీత, వైఎస్సార్‌ కడప

రెగ్యులర్‌ నోటిఫికేషన్లు లేక వయసు మీరిపోతోంది
రెగ్యులర్‌ నోటిఫికేషన్లు లేకపోవడంతో వయసు దాటిపోయి, ఏళ్ల తరబడి సన్నద్దమవుతున్న నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలి. – ఆర్‌. శ్రీనివాసరావు, గుంటూరు

ఏళ్ల తరబడి ఎదురుచూపులు
గ్రూప్‌–1, గ్రూప్‌–2 నోటిఫికేషన్లు వస్తాయని ఏళ్ల తరబడి ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. వయోపరిమితి దాటిపోయిన తరువాత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చినా ప్రయోజనం లేదు. 44 ఏళ్లకే పరిమితి విధించడం వల్ల వేలాది మంది ఆశలపై నీళ్లు చల్లినట్లే అవుతుంది. వయో పరిమితిపై ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలి.  – షేక్‌ ఖయ్యూం, నెల్లూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement