జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కేవలం రూ. 500 అప్పుకోసం రగిలిన వివాదంలో 41 ఏళ్ల మహిళను కొట్టి చంపిన ఘటన కలకలం రేపింది. నవంబర్ 11 రాత్రి హదిమారా గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు.
చక్రధర్‌పూర్ సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (SDPO) సయ్యద్ ముస్తఫా హష్మీ తెలిపిన వివరాల ప్రకారం, ఇటీవల భర్తను కోల్పోయిన రీనా గోపే అనే మహిళ ఇంటి బయట నిందితులు మంట వేసుకుని కూర్చున్నారు. అంత్యక్రియల తర్వాత నిర్వహించే 'మార్ఖి' అనే ఆచారం ముగిసిన అనంతరం వీరంతా అక్కడ సమావేశమయ్యారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన బాధిత జింగీ బంకిరా అనే మహిళ, వారిని దూషించడం మొదలుపెట్టింది. బతికి ఉన్న సమయంలో పాండు గోపే (రీనా భర్త) తన దగ్గర తీసుకున్న రూ. 500 తిరిగి ఇవ్వకుండానే చనిపోయాడు అంటూ జింగీ వాదనకు దిగింది. ఇదికాస్తా తీవ్రరూపం దాల్చడంతో, నిందితులు ఆమెపై దాడికి పాల్పడ్డారు.
పోలీసుల కథనం ప్రకారం, మహిళను జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి కర్రలతో దాడి చేశారు. జింగీ బంకిరా వారి నుంచి తప్పించుకుని పారిపోయి తన ఇంటి వెనుక తోటలో దాక్కుంది. అయినా నిందితులు వదల్లేదు. వెంబడించి మరీ పట్టుకున్నారు. జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ తిరిగి రోడ్డుపైకి తీసుకువచ్చారు. కర్రలతో, పిడికిళ్లతో తీవ్రంగా కొట్టారు. నిందితుల్లో ఒకడైన కృష్ణ గోపే, ఆమె నేలపై పడిపోయిన తర్వాత కూడా కర్రతో ఆమె తలపై ఆరు నుండి ఏడుసార్లు బలంగా కొట్టాడు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన జింగీ బంకిరా అక్కడికక్కడే మరణించిందని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: రూ. 900 కోట్లు ఢమాల్ : ఎన్విడియా మాజీ సీఈఓకు భారీ షాక్, కానీ
బాధితురాలి కుమారుడు ప్రేమ్ సింగ్ బంకిరా ఇచ్చిన ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేశారు. ఈ హత్యపై దర్యాప్తు చేయడానికి, నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. పోలీసులు సూరజ్ గోపే (25), రఘు గోపే (19), గుకుల్ గోపే అలియాస్ లాంగ్రు (26), రీనా గోపే (32), మధు గోపే అలియాస్ కోచే, కృష్ణ గోపేలను అరెస్టు చేశారు. వీరిలో కృష్ణ గోప్ మనోహర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందినవాడు కాగా, మిగిలిన ఐదుగురు హడిమారా గ్రామ నివాసితులు. విచారణ సందర్భంగా, దాడిలో ఉపయోగించినట్లు అనుమానిస్తున్న రక్తపు మరకలున్న కర్రలు, నేరం జరిగిన ప్రదేశంలో రక్తపు మరకలున్న మట్టి, గాజు ముక్క లు, రఘు గోపేకి చెందిన రక్తపు మరకలున్న జీన్స్ ప్యాంటును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: మహిళ దారుణ హత్య, వంట పాత్రలో బాడీ పార్ట్స్ : తిన్నాడా?


