చేమంతి చేసే మేలెంతో తెలుసా? | Sagubadi: Chrysanthemum: Health Benefits Side Effects Uses | Sakshi
Sakshi News home page

చేమంతి చేసే మేలెంతో తెలుసా?

Nov 13 2026 5:15 PM | Updated on Nov 13 2026 5:15 PM

Sagubadi: Chrysanthemum: Health Benefits Side Effects Uses

మిద్దె/పెరటి తోటల్లో చేమంతి మొక్కలు, పువ్వులను పెంచటం వల్ల అందంతో పాటు అనేక పర్యావరణ, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి తోటలోని ఇతర కూరగాయల మొక్కల ఎదుగుదలకు కూడా ఎంతగానో సహాయపడతాయి.

1. చేమంతి పువ్వుల్లో ‘పైరెత్రిమ్‌’ అనే సహజ రసాయనం ఉంటుంది. ఇది దోమలు, పేనుబంక, ఈగలు, నల్లి లాంటి హానికర కీటకాలను తోట నుంచి దూరంగా ఉంచుతుంది.

2. ఒక లీటరు నీటిలో సుమారు 100 గ్రాముల ఎండిన చేమంతి పువ్వులను లేదా పూల పొడిని వేసి 20 నిమిషాల పాటు అంటే లీటర్‌ నీరు అర లీటర్‌ అయ్యే వరకు మరిగించాలి. మరిగించిన తర్వాత ఆ నీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన ద్రావణాన్ని ఒక పల్చటి గుడ్డ లేదా వడపోత జల్లెడ సహాయంతో వడకట్టి, స్ప్రే బాటిల్‌లో పోసుకోవాలి. ఈ ద్రావణాన్ని చీకటిగా, చల్లగా ఉండే ప్రదేశంలో ఉంచితే 2 నెలల వరకు వాడుకోవచ్చు. ఎక్కువ రోజులు నిల్వ ఉన్నప్పుడు వాసన వస్తే వాడకూడదు.

3. తాజా చేమంతి పువ్వులను చిన్న ముక్కలుగా కోసి లేదా కొద్దిగా నలిపి, ఒక గిన్నెలో వేసి గోరువెచ్చని నీరు పోయాలి. ఈ మిశ్రమాన్ని 3 నుంచి 4 గంటల పాటు అలాగే నాననివ్వాలి. ఆ తర్వాత బాగా పిండి, నీటిని వడకట్టాలి. ఈ పద్ధతిలో చేసిన ద్రావణాన్ని 24 గంటల లోపే వాడేయాలి. ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. 

4. ఈ ద్రావణం స్ప్రే చేసే ముందు ఒక టీస్పూన్‌ సహజమైన లిక్విడ్‌ సోప్‌ లేదా షాంపూ కలిపితే, ద్రావణం ఆకులకు బాగా అంటుకుని పురుగులపై గట్టిగా పనిచేస్తుంది. ఇంకా ఎక్కువ ఫలితం కోసం దీనికి కొద్దిగా వేప నూనె కూడా కలిపి స్ప్రే చేయవచ్చు.

5. ఏ ద్రావణాన్నయినా ఎప్పుడూ సాయంత్రం వేళల్లోనే మొక్కలపై పిచికారీ చేయాలి. ఎండలో స్ప్రే చేస్తే ఇందులోని ఔషధ గుణాలు త్వరగా నశిస్తాయి.

6. ఇది కేవలం హానికర పురుగులనే కాక తేనెటీగలను కూడా దెబ్బతీస్తుంది. కాబట్టి తేనెటీగలు లేని సాయంత్రం సమయంలో మాత్రమే వాడటం మంచిది.

7. చేమంతి పూల ఆకుల వెనుక భాగంలో చేరి రసాన్ని పీల్చే ఆకుపచ్చ లేదా నల్లటి చిన్న పురుగులను ఇది త్వరగా నివారిస్తుంది. తామర పురుగులు, ఆకులు ముడుచుకు΄ోయేలా చేసే నల్లటి సూక్ష్మ పురుగులపై ఇది అద్భుతంగా పనిచేస్తుంది. కూరగాయల మొక్కలను ఆశించే తెల్లటి చిన్న ఈగలను తోట నుంచి తరిమికొడుతుంది. మొక్కల కాండాలపై తెల్లటి పత్తిలా పేరుకు΄ోయే పిండినల్లి ఉధృతిని తగ్గిస్తుంది.

8. ఆకులకు రంధ్రాలు చేస్తూ, మొగ్గలను తినేసే గొంగళి పురుగులను ఈ ద్రావణాలు వెంటనే అదుపు చేస్తాయి.  ఆకులపై తెల్లటి గీతలు పడేలా చేసే ఆకు తొలిచే పురుగు నివారణకు సహాయపడతాయి. ఆకులను నమిలే చిన్న పెంకు పురుగులను నివారిస్తుంది.

9. మిద్దె తోట చుట్టుపక్కల దోమలు, ఈగలు చేరకుండా ఇది సహజ రిపెల్లెంట్‌గా పనిచేస్తుంది. కుండీలలో చీమల బెడదను తగ్గించడానికి కూడా ఈ ద్రావణాన్ని మట్టిపై చల్లవచ్చు.

10. విత్తనం నుంచి ఇప్పుడే మొలిచిన చిన్న లేత మొక్కలపై దీన్ని స్ప్రే చేయకూడదు.

11.. ద్రావణాన్ని తోట అంతా చల్లే ముందు, ఏదైనా ఒక మొక్కలోని ఒకే ఒక్క ఆకుపై చల్లి 24 గంటలు గమనించాలి. ఆకు మాడిపోకపోతే, మిగిలిన మొక్కలన్నింటికీ వాడుకోవచ్చు. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు చల్లితే ఆకులు మాడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎల్లప్పుడూ సాయంత్రం 5 గంటల తర్వాతే స్ప్రే చేయాలి.

12. కూరగాయల మొక్కలకు పేనుబంక, తెల్లదోమ బెడద నివారణకు దీన్ని వాడవచ్చు. టమోటా, వంగ, మిరప పూత రాలకుండా, ఆకు ముడుత తెగులు రాకుండా చూస్తుంది. బెండ, దొండ, బీర, సొర, కాకర, గుమ్మడి,  పాలకూర, తోటకూర, గోంగూర, కొత్తిమీర, పుదీనా, మెంతికూర లాంటి మొక్కల ఆకులు రంధ్రాలు చేసే పురుగులను ఇది అదుపు చేస్తుంది. ఆకుకూరలపై స్ప్రే చేసినప్పుడు, అవి కోసే ముందు బాగా కడగాలి. 

13. గులాబీ, మల్లె, మందార, నందివర్ధనం లాంటి పూల మొక్కలు మొగ్గలు కుళ్ళి΄ోకుండా, పురుగులు ఆశించకుండా రక్షిస్తుంది. కుండీల్లో పెంచే చిన్న సైజు పండ్ల చెట్లకు వచ్చే పిండినల్లి నివారణకు ఇది బాగా పనిచేస్తుంది.

14. కూరగాయల మొక్కల మధ్య చేమంతి మొక్కలు పెంచడం వల్ల పంటకు సహజ రక్షణ లభిస్తుంది. చేమంతి రంగురంగుల పువ్వులు తేనెటీగలు, సీతాకోకచిలుకలను ఆకర్షిస్తాయి. ఇవి తోటలోని టమోటా, వంగ, బీర వంటి కూరగాయల మొక్కల్లో పరాగసంపర్కానికి సహాయపడి, దిగుబడిని పెంచుతాయి.

15. చేమంతిలోని ‘పైరెత్రిన్‌’ అనే కీటకనాశిని మూలకం వెలుతురు లేదా ఎండ తగిలితే త్వరగా శక్తిని కోల్పోతుంది. అందువల్ల దీన్ని ఎల్లప్పుడూ రంగు సీసాల్లో లేదా పారదర్శకంగా లేని డబ్బాలలో పోసి, చీకటి ప్రదేశంలో దాచాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement