ఒడిశాలోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో వికేంద్రీకృత పునరుత్పాదక ఇంధనం విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. ఒకవైపు అన్నదాతల సాగునీటి కష్టాలను, డీజిల్ ఖర్చులను దూరం చేస్తూ దిగుబడులను పెంచుతుండగా... మరోవైపు మహిళా సంఘాల ఆహార ప్రాసెసింగ్‌కు ఊతమిస్తూ ఆర్థిక స్వావలంబనను అందిస్తోంది.
కోరాపుట్ జిల్లా నందాపూర్ బ్లాక్‌లోని బైరాగిపుట్ గ్రామంలో ‘ప్రదాన్’ సంస్థ సహకారంతో కొండలపై నుంచి జాలువారే ఊట, వర్షపు నీటిని ఒడిసిపట్టి 5 హెచ్‌పీ సోలార్ పంపుసెట్‌ను ఏర్పాటు చేశారు. గతంలో పంటలకు నీరందించేందుకు గంటల తరబడి డీజిల్ ఇంజిన్లపై ఆధారపడి వేల రూపాయలు వెచ్చించిన రైతులు, ఇప్పుడు ఉచిత సౌర విద్యుత్‌తో నిశ్చింతగా సాగు చేసుకుంటున్నారు. మదన్ బురుద్ అనే రైతు డీజిల్ ఖర్చులు మిగలడంతో అల్లం ద్వారా వచ్చే ఆదాయాన్ని రూ. 40,000 నుంచి రూ. 70,000కు పెంచుకోగా, గోపీనాథ్ సాహా అనే మరో రైతు ఇంధనం రూపంలో ఏడాదికి దాదాపు రూ. 1 లక్ష వరకు ఆదా చేసుకుంటున్నారు.
సోలార్ డ్రయ్యర్లతో అధికాదాయం
మరోవైపు, నందాపూర్ ప్రాంతంలో మహిళా స్వయం సహాయక సంఘాలు సోలార్ డ్రయ్యర్లను వినియోగిస్తూ పంట నష్టాలను నివారిస్తున్నాయి. గతంలో కేజీ పచ్చి సాధారణ రకం అల్లం రూ. 8–10, మేలైన రకం అల్లం రూ. 20–30 మాత్రమే పలికేది. సోలార్ డ్రయ్యర్ల ద్వారా ప్రాసెస్ చేసి ఆరబెట్టిన తర్వాత వాటి కిలో ధరలు రూ. 40 నుంచి రూ. 140 వరకు పలుకుతున్నాయి.
కిరంగొళ్ల గ్రామంలోని ‘పానీ రాణి మహిళా సంఘం’ రోజూ టన్ను వరకు పచ్చి అల్లం, పసుపును ప్రాసెస్ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ‘మిషన్ శక్తి’ కింద ఏర్పాటైన ఈ యూనిట్లు కేవలం 3–4 గంటల్లోనే 50 కేజీల అల్లం బ్యాచ్‌ను ఆరబెడుతున్నాయి.
పిండి మరలుకలహండి జిల్లా గుణుపూర్ గ్రామంలోని ‘జై దుర్గా’ మహిళా సంఘం సోలార్ ప్యానెళ్లు, బ్యాటరీ వ్యవస్థతో పేలాల తయారీ యూనిట్‌ను నడుపుతోంది. విద్యుత్ కోతలు అధికంగా ఉండే ఈ కొండ ప్రాంతంలో 24 గంటల సౌర విద్యుత్ అందుబాటులోకి రావడంతో, ఈ బృందం 8 అంగన్‌వాడీ కేంద్రాలకు పేలాలు, రాగి పిండి, వేయించిన శనగలతో కూడిన పోషకాహారాన్ని నిరంతరాయంగా సరఫరా చేస్తోంది.
ముడిసరుకుల కోసం 45 కిలోమీటర్ల దూరం వెళ్లే ప్రయాణ భారం, రవాణా ఖర్చులు తప్పటంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ఉత్పాదకతను పెంచటంలో సౌరశక్తి సరికొత్త భరోసాగా నిలుస్తోంది.
ఇదీ చదవండి: పంట తెగుళ్ల నుంచి పశు వ్యాధుల వరకూ!


