పంట తెగుళ్ల నుంచి పశు వ్యాధుల వరకూ! | Sagubadi: Artificial Intelligence Transforming Indian Agriculture | Sakshi
Sakshi News home page

పంట తెగుళ్ల నుంచి పశు వ్యాధుల వరకూ!

Nov 6 2026 5:51 PM | Updated on Nov 6 2026 6:08 PM

Sagubadi: Artificial Intelligence Transforming Indian Agriculture

తనకేం బాధ కలుగుతోందో మూగజీవం చెప్పలేదు.. చీడపీడల దాడికి దిగుబడి దెబ్బతింటే రైతు తట్టుకోలేడు. నిన్నటిదాకా నిపుణుడి రాక కోసం ఎదురుచూపులు, ఫీజుల భారం లేదా సరైన సమయానికి సలహా అందక పశువులో, పంటో చేజారిపోయే పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు భారతీయ వ్యవసాయ ముఖచిత్రాన్ని సరికొత్త కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత సమూలంగా మారుస్తోంది. క్షేత్రస్థాయి రైతుల సందేహాలకు వారి సొంత మాతృభాషల్లోనే క్షణాల్లో సరైన సమాధానాలు ఇస్తూ ఆధునిక డిజిటల్‌ సారథిగా నిలుస్తోంది.‘మహావిస్తార్‌’తో మారిన సాగు పద్ధతులు

మహారాష్ట్రకు చెందిన మహిళా రైతు దీపాలి కల్భోర్‌ ప్రయాణమే ఇందుకు నిదర్శనం. గతంలో నష్టాలు చవిచూసిన ఆమె, తేనెటీగల పెంపకంతో నిలదొక్కుకున్నారు. ప్రస్తుతం ‘మహావిస్తార్‌’ అనే ఏఐ వేదికను రోజూ వినియోగిస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మలచుకుంటున్నారు. ఇందులోని ఎరువుల కాలిక్యులేటర్‌ ద్వారా అనవసర వ్యయాన్ని అరికట్టి, ఎరువుల వాడకాన్ని దాదాపు 15 శాతం తగ్గించుకోగలిగారు. 

దీపాలి కల్భోర్‌ కోళ్ల పెంపకం వ్యాపారం విఫలమైన తర్వాత, తేనెటీగల పెంపకం ద్వారా తన జీవనోపాధిని తిరిగి నిర్మించుకున్నారు. 30 తేనెటీగల పెట్టెల నుంచి నేడు 1,000కి పైగా పెట్టెలకు విస్తరించారు. రైతుకు బలగంతో పాటు సరైన సమాచారం కూడా అవసరమనేది  తాను నేర్చుకున్న అతిపెద్ద పాఠాల్లో ఒకటని కల్భోర్‌ తెలిపారు. ఆమె ఒక వ్యవసాయ శిక్షణా కార్యక్రమంలో మహావిస్తార్‌ గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు దానిని పంట ధరలు, వాతావరణం, తెగుళ్ల నివారణ, ప్రభుత్వ పథకాల కోసం ఉపయోగిస్తున్నారు. 

స్థానిక పంటల ధరలను తెలుసుకోవడానికి, వ్యవసాయ అధికారులతో సంప్రదించడానికి కూడా ఆమె ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తారు. దీన్ని తాను రోజుకు కనీసం రెండు లేదా మూడు సార్లు ఉపయోగిస్తున్నారు. రైతుకు బలగంతో పాటు సరైన సమాచారం కూడా అవసరమనేది తాను నేర్చుకున్న అతిపెద్ద పాఠాల్లో ఒకటని కల్భోర్‌ తెలిపారు. మహావిస్తార్‌ ఆప్‌ను తాను రోజుకు కనీసం రెండు లేదా మూడు సార్లు ఉపయోగిస్తున్నానన్నారు.

పాడి రైతులకు ‘సర్లాబెన్‌’ భరోసా గుజరాత్‌లో ప్రముఖ పాల సహకార సంస్థ ‘అముల్‌’ ప్రవేశపెట్టిన ‘సర్లాబెన్‌’ అనే వాయిస్‌ ఏఐ అసిస్టెంట్‌ పాడి రైతులకు వరంగా మారింది. గుజరాతీ భాషలో అనర్గళంగా మాట్లాడే ఈ  ‘సర్లాబెన్‌’ పశువుల ఆరోగ్యం, వ్యాక్సినేషన్, దాణా, చూడి కట్టే సమయాలపై ఖచ్చితమైన సమాచారం ఇస్తోంది.

అజర్‌పురా గ్రామానికి చెందిన గాయత్రీబెన్‌ గేదె పదేపదే చెట్టుకు తల బాదుకుంటూ ఉందేది. ఆమె ‘సర్లాబెన్‌’ సలహా అడిగితే.. అది కొమ్ముల దురద కావచ్చని.. నూనె, పసుపు రాయాలని సూచించింది. ఆ పని చెయ్యటంతో సమస్య పరిష్కారమైంది.

ప్రసవ నొప్పులతో ఉన్న ఆవుకు తీవ్ర సమస్య ఎదురైనప్పుడు మీనాబెన్‌ అనే మహిళా పాడి రైతు ‘సర్లాబెన్‌’ అందించిన సమాచారం ద్వారానే పరిస్థితి తీవ్రతను గ్రహించి, తక్షణమే పశువైద్యుడిని రప్పించగలిగారు.

కేవలం ఫోన్‌ నంబర్‌ ఆధారంగా రైతు వద్ద ఉన్న పశువుల వివరాలు, వైద్య చరిత్రను అనుసంధానిస్తూ వ్యక్తిగతీకరించిన సలహాలను ఈ ‘సర్లాబెన్‌’ వ్యవస్థ అందిస్తోంది. ‘మా గేదెల్లో ఒకటి చెట్టుకు అదేపనిగా తల బాదుకుంటూ ఉంటే సర్లాబెన్‌ సాయం తీసుకున్నాను. ఇంతకుముందు, నేను సహకార సంఘం ద్వారా పశువైద్యుడి దగ్గరకు తీసుకెళ్లటానికి రూ.150 చెల్లించి, ఆ సమస్య పరిష్కారమయ్యే వరకు వేచి ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు, నేను సర్లాబె¯Œ కు ఫోన్‌ చేస్తే చాలు..’ అని గాయత్రీబెన్‌ చెప్పారు. 

నిపుణుల జోక్యం ఎప్పుడు అవసరమో గాయత్రీబెన్‌ వంటి రైతులకు అర్థమయ్యేలా సార్లాబెన్‌ ఏఐ సహాయపడుతోంది. ‘ఆవులు నా కుటుంబం లాంటివి. కానీ ఇంట్లో, నా పిల్లలు ‘అమ్మా, నా కడుపు నొప్పిగా ఉంది’ అని చెప్పగలరు. కానీ, నా ఆవులు వాటికి ఏమైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు నాతో చెప్పలేవు కదా?’ అంటారు మరో పాడి రైతు చార్మిబెన్‌. కాబట్టి తనకు ఏదైనా సందేహం వచ్చినప్పుడు సర్లాబెన్‌ను అడిగి తెలుసుకుంటున్నాను అనారామె. 

‘నేను మొదటిసారి సర్లాబెన్‌తో మాట్లాడినప్పుడు, ఆమె నిజమైన మనిషి అనుకున్నాను. ఆమె గుజరాతీ నాకంటే బాగా మాట్లాడింది. నేను ఏఐతో మాట్లాడుతున్నానని నమ్మలేకపోయాను!‘ అని గాయత్రీబెన్‌ అంటారు.

గేట్స్‌ ఫౌండేషన్‌ విడుదల చేసిన ‘గోల్‌కీపర్స్‌ నివేదిక 2026’ ప్రకారం.. ఏఐ విప్లవం గ్రామీణ ప్రాంతాలకు చేరాలంటే భాష, స్థానిక నేపథ్యం అత్యంత కీలకం. గతంలో ఏఐ మోడళ్ల శిక్షణకు 90% ఆంగ్ల గణాంకాలను మాత్రమే వాడారు. అయితే వందలాది భాషలు, మాండలికాలు ఉన్న భారత్‌ వంటి దేశాల్లో అది సరిపోదని నివేదిక స్పష్టం చేసింది. 

ఐఐటీ బాంబే ప్రొఫెసర్, ‘భారత్‌జెన్‌’ ప్రధాన పరిశోధకుడు గణేష్‌ రామకృష్ణన్‌ పేర్కొన్నట్లుగా.. సాంకేతికతను ఎక్కడో తయారుచేసి తర్వాత అనువదించటం కంటే, స్థానిక అవసరాలకు అనుగుణంగా ఇక్కడే రూపొందించాలి. ఒక చిన్న తప్పుడు సలహా విత్తనం నుంచి పురుగుమందుల వాడకం వరకు రైతుకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. అందుకే రైతుల భాషను క్షుణ్ణంగా అర్థం చేసుకునే సమ్మిళిత ఏఐ సాధనాలు అందుబాటులోకి వచ్చినప్పుడే గ్రామీణ జీవనోపాధి మరింత మెరుగుపడుతుందనటంలో సందేహం లేదు. 

నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి, డెస్క్‌ 

ఇదీ చదవండి: బియ్యం కడిగిన నీటితో ‘లాబ్‌’ ద్రావణం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement