రూ.65,000 కోట్ల మహా జాతర: బెంగాల్ దుర్గమ్మ సంబరం! | 65,000 Crore How Durga Puja Puts Bengal to Work | Sakshi
Sakshi News home page

రూ.65,000 కోట్ల మహా జాతర: బెంగాల్ దుర్గమ్మ సంబరం!

Oct 15 2026 12:49 PM | Updated on Oct 15 2026 12:49 PM

65,000 Crore How Durga Puja Puts Bengal to Work

కోల్‌కతా: బెంగాల్‌లో దుర్గా పూజ అంటే కేవలం కొన్ని రోజుల సందడి మాత్రమే కాదు. నెలల తరబడి సాగే ఒక మహా ఉత్పాదక యజ్ఞం. కుమారతులి మట్టి కళాకారుల ప్రతిమల నుంచి మొదలై వెదురు బొంగులు, విద్యుత్ దీపాలు, రవాణా, పందిళ్ల నిర్మాణం వరకు లక్షలాది చేతులు కలసికట్టుగా పనిచేస్తేనే ఈ శారదీయ వైభవం సాకారమవుతుంది.

రూ. 65 వేల కోట్ల మహా మార్కెట్
ఈ పండుగ చుట్టూ తిరిగే ఆర్థిక వ్యవస్థ విలువ దాదాపు రూ. 65,000 కోట్లకు చేరినట్లు తాజా అంచనాలు చెబుతుండగా, అందులో కోల్‌కతా నగర వాటానే ఏకంగా 65 నుంచి 70 శాతంగా ఉంది. విగ్రహాల అలంకరణ ఖర్చులు మాత్రమే కాకుండా రిటైల్ దుస్తులు, పాదరక్షలు, ఎలక్ట్రానిక్స్, హోటళ్లు, రవాణా రంగాలు పండుగ వేళ బ్రహ్మాండమైన ఆదరణ పొందుతాయి.

మెరుపుల వెనుక..
పండుగ సంపద అంతా సమానంగా అందరికీ చేరడం లేదు. పెద్ద మాల్స్, ఆన్‌లైన్ వేదికలు, కార్పొరేట్ స్పాన్సర్‌షిప్‌లు వందల కోట్ల లాభాలు కొల్లగొడుతుంటే, వీధి వ్యాపారులు, చిన్న దుకాణదారులు మాత్రం ఆశించినంత ప్రయోజనం పొందలేకపోతున్నారు. విగ్రహాలు చెక్కే శిల్పులకు భారీ ఆర్డర్లు వస్తున్నప్పటికీ ముడిసరుకుల ధరలు, కూలీల ఖర్చులు పెరిగిపోవడంతో చేతిలో మిగిలేది అంతంత మాత్రమే అవుతోంది.

ఎల్లలు దాటిన ఖ్యాతి
కోల్‌కతా దుర్గా పూజకు యునెస్కో వారసత్వ గుర్తింపు లభించడంతో దీనికి అంతర్జాతీయ సాంస్కృతిక వేదిక దక్కింది. అయితే ఈ పండుగ ఆధారిత ఆర్థిక పురోగతి నిజమైన రూపశిల్పులైన కార్మికులకు, కళాకారులకు స్థిరమైన జీవనోపాధిగా మారినప్పుడే దానికి నిజమైన అర్థం లభిస్తుందంటున్నారు విశ్లేషకులు. 

ఇదీ చదవండి: మతం మారితే రిజర్వేషన్‌ ఉండదు: సుప్రీంకోర్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement