సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2026 టోర్నీని కర్ణాటక జట్టు విజయంతో ప్రారంభించింది. గ్రూప్ 'ఎ'లో భాగంగా శనివారం వాంఖడే స్టేడియం వేదికగా బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక 19 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక నిర్ణీత 20 ఓవర్లలో 184 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
ఓపెనర్లు లవ్‌నీత్ సిసోడియా (12 బంతుల్లో 27; 4 ఫోర్లు, 1 సిక్స్), మనీష్ పాండే (23 బంతుల్లో 29; 5 ఫోర్లు) జట్టుకు శుభారంభాన్ని అందించారు. అనంతరం కరుణ్ నాయర్ (35 బంతుల్లో 53; 7 ఫోర్లు) అద్భుత హాఫ్ సెంచరీతో ఇన్నింగ్స్‌ను నడిపించాడు.
చివర్లో ప్రవీణ్ దూబే (15 బంతుల్లో 30 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులు మెరిపించాడు. బెంగాల్ బౌలర్లలో సయాన్ ఘోష్ నాలుగు వికెట్లు పడగొట్టగా, ప్రదీప్త ప్రామాణిక్ , ముఖేష్ కుమార్ తలో రెండు వికెట్లు తీశారు. బెంగాల్ వెటరన్ పేసర్ మహ్మద్ షమీ మాత్రం విఫలమయ్యాడు. షమీ తన నాలుగు ఓవర్ల కోటాలో 56 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగాల్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. బెంగాల్ బ్యాటర్లలో సుదీప్ కుమార్ ఘరామి (42 బంతుల్లో 65; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), షాబాజ్ అహ్మద్ (37 బంతుల్లో 56; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. కర్ణాటక పేసర్ అభిలాష్ శెట్టి నాలుగు వికెట్లతో కర్ణాటకను దెబ్బతీశాడు.


