ఏడేళ్ల కిందట హత్య.. మళ్లీ ప్రాణాలతో వచ్చింది | Married Woman Incident In Karnataka | Sakshi
Sakshi News home page

ఏడేళ్ల కిందట హత్య.. మళ్లీ ప్రాణాలతో వచ్చింది

Nov 13 2026 8:17 AM | Updated on Nov 13 2026 8:17 AM

Married Woman Incident In Karnataka

కర్ణాటక: హత్యకు గురైన మహిళ తిరిగి వచ్చింది, కానీ హత్య చేశాడని అరెస్టయిన వ్యక్తి రెండున్నరేళ్ల పాటు జైలులో గడపడంతో అతని జీవితం నాశనమైంది. ఈ విడ్డూరం  మండ్య జిల్లాలోని పాండవపుర తాలూకా మైగనహళ్లి గ్రామంలో జరిగింది. ఇది ఏ సస్పెన్స్‌–థ్రిల్లర్‌ సినిమా కథ కాదు, నిజజీవిత గాథ.   

ఏం జరిగిందంటే..  
వివరాలు ఇలా ఉన్నాయి.. 2019లో పాండవపుర పట్టణం నుంచి మంజు అనే వివాహిత ఆకస్మాత్తుగా అదృశ్యమైంది. భర్త ఇంటి నుంచి పుట్టింటికి వస్తూ ఆమె మిస్సయింది. ఆమె తండ్రి నాగరాజు పాండవపుర పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు రెండేళ్లపాటు ఛేదించలేకపోయారు. చివరకు, 2021లో రాగిముద్దనహళ్లికి చెందిన రాజేష్‌ అనే యువకున్ని అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేసి అతడే హత్య చేసినట్లు ఒప్పించారు. కావేరి నదిలోకి తన కుమార్తెను తోసి హత్య చేశాడని ఆరోపిస్తూ మహిళ తండ్రి నాగరాజు 2021లో పోలీసులకు మళ్లీ ఫిర్యాదు చేయడమే దీనికి కారణం. నిందితుడు రాజేష్‌ అని ప్రకటించిన పోలీసులు విచారణ జరిపి చార్జిషిటు దాఖలుచేశారు. ఇందుకోసం రెండున్నర సంవత్సరాలుగా జైలులో ఉన్న రాజేష్‌ తరువాత బెయిల్‌పై విడుదలయ్యాడు.   

తమిళనాడులో ఉన్నా: మహిళ  
ఇంతలో మంజు రెండురోజుల కిందట గ్రామానికి రావడంతో అందరూ తీవ్ర ఆశ్చర్యానికి లోనయ్యారు. చనిపోయిన తరువాత ఎలా తిరిగి వచ్చిందా అని ఆరా తీశారు. ఆమె మాట్లాడుతూ చామరాజనగర్‌కు చెందిన నాగేంద్రను ప్రేమించాను, అతన్ని పెళ్లి చేసుకుని కొన్ని సంవత్సరాలు తమిళనాడులో నివసించాను, ఇప్పుడూ చూసిపోదామని ఊరికి వచ్చాను, నాకు ఈ కేసులేవీ తెలియదు అని తెలిపింది. 
 
కరెంటు షాకిచ్చి హింసించారు: రాజేష్‌   
నేను నిరపరాధినని స్పష్టమైంది, నేనే హత్య చేశానని ఒప్పుకునేలా చేయడానికి పోలీసులు చెప్పులతో కొట్టి, విద్యుత్‌ షాక్‌లు ఇచ్చి హింసించారు. ఒప్పుకోకపోతే నా కుటుంబాన్ని అరెస్టు చేస్తామని బెదిరించారు. పోలీసుల చిత్రహింసలను తట్టుకోలేక సరే అన్నాను అని బాధితుడు రాజేష్‌ ఆవేదన చెందాడు. ఆమె ఎవరికో ఫోన్‌చేయాలని నా ఫోన్‌ తీసుకుని మాట్లాడింది, అంతకుమించి నాకేం తెలియదు, నాకు న్యాయం చేయాలని న్యాయపోరాటం చేస్తానన్నారు. కాగా, పోలీసులు కేసును రీఓపెన్‌చేసి మహిళను మహిళా సహాయక కేంద్రానికి తరలించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement