కర్ణాటక : నిత్యం మద్యం తాగి గొడవపడుతున్న భర్త ప్రవర్తనతో విసిగిపోయిన భార్య చాకుతో పొడిచి అతన్ని హత్యచేసింది. ఈ ఘటన బెంగళూరు కెంపేగౌడనగర పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి జరిగింది. వివరాలు.. మాలాశ్రీ (39), రాజశేఖర్ (43) దంపతులు కెంపేగౌడ నగర లక్ష్మీపుర 1వ క్రాస్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి సంతానం లేదు. రాజశేఖర్ ఓ ప్రైవేటు బ్యాంక్‌లో లోన్ విభాగంలో పనిచేస్తున్నాడు. ఉదయం బాగానే ఉండి, రాత్రి ఆఫీసు నుంచి రాగానే మద్యం మత్తులో గొడవపడి, నీకు పిల్లలు పుట్టలేదని దూషించేవాడు.
వంట చేయలేదని..
యథాప్రకారం రాత్రి 10 గంటలకు ఇంటికి వచ్చి చూడగా భార్య వంట చేయలేదని రగడకు దిగాడు. మాలాశ్రీ సహనం కోల్పోయి వంటింట్లో నుంచి కత్తి తీసుకుని భర్తను ఎద, కడుపులో పొడిచింది. అతడు రక్తపుమడుగులో కుప్పకూలిపోయాడు. ఇరుగుపొరుగు అంబులెన్స్‌ను పిలిపించి విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చనిపోయాడని వైద్యులు తెలిపారు. కెంపేగౌడనగర పోలీసులు చేరుకుని పరిశీలించారు. హతుని సోదరుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మాలాశ్రీని అదుపులోకి తీసుకున్నారు.


