చివరి శుభలేఖ ఇచ్చి వస్తానని
బనశంకరి: నాలుగు రోజుల్లో పెళ్లి చేసుకుని నూతన జీవితంలోకి అడుగుపెట్టాల్సిన యువతిని రోడ్డు ప్రమాదం కబళించింది. సిలికాన్ సిటీలో యాక్సిడెంట్లు జీవితాలను ఎలా ఛిన్నాభిన్నం చేస్తున్నాయో ఈ ఉదంతం చాటుతోంది. ఈ దుర్ఘటన మైసూరు రోడ్డులో బ్యాటరాయనపుర పోలీస్‌స్టేషన్ పరిధిలో సంభవించింది. వివరాలు.. సింధుశ్రీ (29)కి ఈ నెల 16వ తేదీ పెళ్లి జరగనుంది. ఆదివారం ఘనంగా రిసెప్షన్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహాలక్ష్మీ లేఔట్‌లో నివాసం ఉంటున్న సింధుశ్రీ ప్రైవేటు కంపెనీలో టెక్కీగా పనిచేస్తోంది.
క్షణాల్లో మృత్యుఒడికి..
బుధవారంనాడు అత్త కూతురు విద్యా (21)తో కలిసి పెళ్లిపత్రికలు పంచేందుకు స్కూటర్‌లో వెళ్తోంది. మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో మైసూరురోడ్డు దీపాంజలినగర మెట్రోస్టేషన్ వద్ద వెళుతుండగా వెనుకనుంచి వేగంగా వచ్చిన భారీ ట్రక్ ఆమె స్కూటర్‌ను ఢీకొట్టింది. సింధు, విద్యా రోడ్డుపై పడగా ట్రక్ వారిపై నుంచి దూసుకెళ్లడంతో తీవ్రగాయాలై అక్కడే ప్రాణాలు కోల్పోయారు. వెంటనే డ్రైవరు ట్రక్‌ను వదిలిపెట్టి పారిపోయాడు.
ఆమె అత్త కుమార్తె కూడా
చివరి పెళ్లిపత్రిక ఇచ్చేందుకు
వెళ్తుండగా ఢీకొని దూసుకెళ్లిన ట్రక్కు
బెంగళూరులో విషాద సంఘటన
పెళ్లిపీటలు ఎక్కాల్సిన సింధు, విద్యా మృతితో ఆ కుటుంబాల్లో తీవ్రవిషాదం నెలకొంది. సింధు ఏకై క సంతానం కావడంతో వైభవంగా పెళ్లి చేయాలని తల్లిదండ్రులు తలిచారు. సింధు తండ్రి నంజుండప్ప చిరుద్యోగి అని తెలిసింది. చివరిగా ఒక పెళ్లి కార్డు ఇచ్చి వస్తానని స్కూటర్‌లో వెళ్లారని, ఇంత ఘోరం చోటుచేసుకుందని ఆయన కన్నీరుపెట్టారు. గురువారం పసుపు శాస్త్రం, శుక్రవారం గాజుల శాస్త్రం చేసుకుని, శనివారం కళ్యాణ మండపానికి వెళ్లాల్సి ఉందని తెలిపారు. తన కూతురితో పాటు చెల్లెలి బిడ్డ కూడా చనిపోయిందని విలపించారు. మృతదేహాలకు గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. బ్యాటరాయనపుర ట్రాఫిక్ పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేసి మృతదేహాలకు విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. ట్రక్ డ్రైవరు కోసం పోలీసులు గాలిస్తున్నారు.


