బనశంకరి: ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సిలికాన్ సిటీ బెంగళూరు, ప్యాలెస్ సిటీ మైసూరులో పర్యటిస్తారు. రూ.15,600 కోట్లపైగా విలువైన వివిధ అభివృద్ధి పథకాలను ప్రారంభిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. బెంగళూరులో రవాణా, రైల్వే, విద్యుత్, పెట్రోలియం, చెత్త నిర్వహణతో పాటు అనేక రంగాల్లో పథకాలు ఇందులో ఉన్నాయి.
తొలుత ప్రశాంతి కుటీరానికి..
ప్రధాని మోదీ ఉదయం 10:45 గంటలకు బెంగళూరు ప్రశాంతి కుటీరంలో నిర్వహించే స్వామి వివేకానంద యోగా సంస్థ సువర్ణ మహోత్సవంలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12:45 గంటలకు తావరెకెరె నుంచి ఐఐఎం–బీ మధ్య మెట్రో పింక్ లైన్ మార్గం ప్రారంభించి అదే రైలులో ఐఐఎం వరకూ ప్రయాణిస్తారు. మధ్యాహ్నం 1:15 గంటలకు వివిధ పథకాలకు ప్రారంభం, శంకుస్థాపనలు చేస్తారు. గవర్నరు సుధాయాదవ్, సీఎం డీకే శివకుమార్, పలువురు కేంద్రమంత్రులు, ప్రముఖులు పాల్గొంటారు. కరువు సహాయం, నీటి ప్రాజెక్టులు, బెంగళూరు అంశాల గురించి ప్రధానితో సీఎం డీకే చర్చించే అవకాశముంది.
విద్యుత్ పథకాలు అధికం
కొప్పళ–ఐఐ , గదగ–ఐఐ పేర్లతో రూ.4,450 కోట్ల విద్యుత్ ప్రసరణ ప్రాజెక్టును ప్రధాని ప్రారంభిస్తారు. దావణగెరె–చిత్రదుర్గ, బళ్లారి ఆధునిక విద్యుత్ ఇంధన వలయాలకు శంకుస్థాపన చేస్తారు. దావణగెరె–బళ్లారిలో అదనంగా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను సరఫరాకు ఇది ఉపయోగపడుతుంది. బెంగళూరు హరళుకుంటెలో చెత్తతో నడిచే బయోగ్యాస్ కేంద్రానికి ఽశంకుస్థాపన చేస్తారు. ప్రతిరోజు సుమారు 300 టన్నులు పొడి చెత్తతో 12.6 టన్నుల బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేస్తారు.
అమృత్ భారత్ కింద కొత్త హంగులు అద్దిన చామరాజనగర, చిక్కమగళూరు, సకలేశపుర, సుబ్రహ్మణ్య రోడ్డు రైల్వేస్టేషన్లను ప్రారంభిస్తారు.
మైసూరులో హెలికాప్టర్‌తో రిహార్సల్స్
మెట్రో పింక్ లైన్ సహా పలు ప్రాజెక్టుల ప్రారంభం
పాల్గొననున్న గవర్నరు, ముఖ్యమంత్రి
మధ్యాహ్నం నుంచి మైసూరులో టూర్
మైసూరు పర్యటన ఇలా..
తరువాత ప్రధాని మధ్యాహ్నం 2:30 గంటలకు హెలికాప్టర్‌లో మైసూరుకు బయలుదేరుతారు.
3:30 గంటలకు మైసూరు కేసీ లేఔట్ పార్కులో భారత్ వన అనే పట్టణ అరణ్య కార్యక్రమంలో పాల్గొని మొక్కలను నాటుతారు. 4 గంటలకు మైసూరు కాస్మాస్, ప్లానెటోరియంను ప్రారంభిస్తారు. సాయంత్రం 6:05 గంటలకు మైసూరు నుంచి ఢిల్లీకి ప్రయాణమవుతారు. ప్రధాని టూర్ నేపథ్యంలో బెంగళూరు, మైసూరులో వేలాది మంది పోలీసు బలగాలతో భద్రత ఏర్పాటైంది. భారీ సభా వేదికలు నిర్మాణమయ్యాయి. బెంగళూరుతో పాటు మైసూరులో ప్రధాని రోడ్‌షోలో జరుగుతాయి. మైసూరులో పలు కూడళ్లలో మోదీ మీద పుష్పవర్షం కురిపించనున్నారు.


