మండ్య: మండ్య జిల్లాలోని పాండవపుర తాలూకాలోని మహదేశ్వరపుర గ్రామం మహదేశ్వర ఆలయంలో దీపావళి ఉత్సవాల సందర్భంగా మహదేశ్వర జాతర ఘనంగా జరిగింది.
బృహత్ పులి వాహన ఊరేగింపు కనులపండువగా సాగింది. పులి వాహనాన్ని రంగురంగుల పూలు, పండ్లతో అలంకరించారు. ఉత్సవ విగ్రహాన్ని రూ. 50 నోట్లతో చేసిన దండతో అలంకరించారు.
ఊరేగింపు కోలాహలం
ముందుగా గ్రామ నాయకులు, యువకులు, మహిళలు పులి వాహనానికి పూజలు చేసి, మధ్యాహ్నం తరువాత ఊరేగింపును ప్రారంభించారు. యువకులు ఉఘే ఉఘే ఉఘే మాదప్ప అని నినాదాలు చేశారు. పులి వాహనం ముందు బాలికలు, ముత్తైదు మహిళలు నడిచారు. బొమ్మల నృత్యం, ఆంజనేయ, గొరిల్లా, ఎలుగుబంటి, శివ పార్వతి, గారడీ, పులి వేషధారుల తదితర కళాకారుల ప్రదర్శనలు గ్రామవాసులను మంత్రముగ్ధుల్ని చేశాయి. గ్రామం గుండా సాగి మహాదేశ్వరస్వామి ఆలయానికి చేరుకుని మూడుసార్లు ప్రదక్షిణ చేయడంతో సమాప్తమైంది. మేలుకోట పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.
మహదేశ్వరపురలో ఆధ్యాత్మిక పరిమళం


