పెషావర్: పాకిస్తాన్లోని పెషావర్లో గురువారం పెను విషాదం చోటుచేసుకుంది. అఫ్రిది అబాద్ ప్రాంతంలోని ‘అల్ ఖైర్’ ప్రైవేట్ పాఠశాలలో తరగతులు జరుగుతున్న సమయంలో భవనం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఒక మహిళా ఉపాధ్యాయురాలితో పాటు 21 మంది చిన్నారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ప్రమాదంలో మరణించిన విద్యార్థులలో 18 మంది బాలురు, ఇద్దరు బాలికలు ఉన్నారని, వారి వయస్సు 7 నుంచి 12 సంవత్సరాల మధ్య ఉంటుందని పెషావర్లోని లేడీ రీడింగ్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. తరగతి గదుల్లో పాఠాలు వింటున్న చిన్నారులపై ఒక్కసారిగా కాంక్రీట్ స్లాబ్ పడటంతో పిల్లలు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది.
గాయపడిన 21 మంది విద్యార్థులను చికిత్స నిమిత్తం సమీపంలోని లేడీ రీడింగ్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో, బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆసుపత్రి యంత్రాంగం వెంటనే ఎమర్జెన్సీని ప్రకటించింది. ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు శిథిలాలను తొలగించి సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. పెషావర్ డిప్యూటీ కమిషనర్ ఆఫాక్ వజీర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారేమోనని గాలింపు చర్యలను కొనసాగిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు.
ఇదీ చదవండి: రూ.65,000 కోట్ల మహా జాతర: బెంగాల్ దుర్గమ్మ సంబరం!


