School
-
ఈ నేరగాళ్లను గుర్తుంచుకోండి
టెహ్రాన్: అమెరికా దాడుల్లో ఓ ప్రాథమిక పాఠశాలలో 168 చిన్నారుల మరణాలకు కారకులైన ఆ దేశ అధికారుల ఫొటోలను ఇరాన్ ఆదివారం విడుదలచేసింది. ‘‘ఈ నేరగాళ్లను గుర్తించుకోండి. వీరి పేర్లు యూఎస్ఎస్ స్ప్రుయన్స్ యుద్ధనౌక కమాండర్ లీగ్ ఆర్ టేట్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జెఫ్రీ ఇ.యార్క్. పాఠశాలపై తోమహాక్ క్షిపణులు ప్రయోగానికి ఆదేశాలిచ్చింది వీళ్లే’’ అంటూ భారత్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం ఆదివారం ఎక్స్‌లో పోస్ట్ పెట్టింది. ‘‘ఇంతటి దారుణానికి పాల్పడ్డాక కూడా వాళ్లు ప్రశాంతంగా ఎలా నిద్రపోయారో.బాధితుల కళ్లలోకి సూటిగా చూసే ధైర్యం వారికుందా?’’ అని నైజీరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయం ప్రశ్నించింది. మినాబ్‌లోని షజారాహ్ తయ్యబే స్కూల్‌పై జరిగిన ఆ దాడితో తమకు సంబంధం లేదని అమెరికా బుకాయించినా తర్వాత తన తప్పిదాన్ని ఒప్పుకుంది. ‘‘ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) స్థావరంపై దాడి చేయాలనుకున్నాం. కాలం చెల్లిన నిఘా మ్యాప్‌ల వల్ల పాఠశాల భవనాన్ని సైనిక స్థావరంగా భావించి పొరపాటున బాంబులేశాం’’ అంటూ తీరిగ్గా చింతించింది! -
ప్రకృతి ఒడిలో... చెట్టు బడి నీడలో!
ఏడంతస్తుల మేడల్లో, ఏసీ గదుల్లో, అత్యాధునిక సాంకేతికత మధ్య పిల్లలు పాఠాలు నేర్చుకోవడం మాట ఎలా ఉన్నా, చాలామంది పిల్లలు పాఠాలకే పరిమితం అవుతూ ప్రకృతికి దూరం అవుతున్నారు. ఈ తరం పిల్లలకు ప్రకృతి ఒడిలో పాఠాలు చెబుతూ చెట్లు, పర్యావరణం గురించి తెలుసుకునేలా దిల్లీలో ‘స్కూల్ ఆఫ్ ట్రీస్’ను స్థాపించారు రోహిత్, గీతాంజలి దంపతులు... దిల్లీలోని కిద్వాయ్నగర్లోని ఒక ప్రశాంతమైన మధ్యాహ్నం కొంతమంది పిల్లలు ఒక చెట్టు చుట్టూ అర్ధవలయాకారంలో నిలబడి ఉన్నారు. ఐఆర్ఎస్ అధికారి రోహిత్మెహ్రా చెట్టు బెరడుపై తన వేళ్లను సున్నితంగా ఆడిస్తూ ‘ఇది చెట్టు మాత్రమే కాదు. ఇక్కడ జీవం మొదలవుతుంది’ అని చెప్పారు.పిల్లలు ఆయన చెప్పేది శ్రద్ధగా వింటున్నారు.చెట్టు ఎలా శ్వాసిస్తుంది? కిరణజన్య సంయోగక్రియ ఎందుకు ముఖ్యమైనది?... పిల్లలు అడిగే ఇలాంటి ప్రశ్నలకు ఆయన ఓపికగా, వారికి అర్థమయ్యేట్లు సమాధానం ఇచ్చారు. అది ప్రకృతియే తరగతి గదిగా, గురువుగా ఉండే వినూత్నమైన పాఠశాల...స్కూల్ ఆఫ్ ట్రీస్.ట్రీ హాస్పిటల్‘గత పన్నెండు సంవత్సరాలుగా నిరాడంబరంగా జీవిస్తున్నాం. మా సెలవులను. ఖాళీ సమయాన్ని పిల్లలతో గడపడంలో సంతోషంగా ఉంటున్నాం’ అంటున్నారు రోహిత్, గీతాంజలి దంపతులు. నిజానికి ‘స్కూల్ ఆఫ్ ట్రీస్’కు ముందే ఈ దంపతులు పర్యావరణ సంరక్షణ తమ దైనందిన అలవాటుగా చేసుకున్నారు. వ్యాధిగ్రస్తమైన చెట్లకు చికిత్స అందించడానికి కొన్ని సంవత్సరాల క్రితం అమృత్‌సర్‌లో భారతదేశంలోనే తొలిసారిగా ‘ట్రీ హాస్పిటల్’ స్థాపించారు.పర్యావరణ జీవనవిధానంపర్యావరణ స్పృహ అనేది కేవలం కార్యాచరణగా కాకుండా జీవనవిధానంగా ఉండాలనేది వారి సిద్ధాంతం. ఉదయాన్నే పిల్లలను బయటకు తీసుకువెళ్లి రకరకాల చెట్లను చూపిస్తూ వాటి గురించి వివరంగా చెబుతుండేవారు. వాళ్లచేతనే మొక్కలు నాటించేవారు. ఇవి చిన్న పనులే అయినా వారి లేత మనసులలో ‘పర్యావరణ పరిరక్షణ’ అనే భావనను గట్టిగా నాటాయి.పట్టణాల్లో ఉండే పిల్లలను గమనించినప్పుడు ప్రకృతి ప్రపంచానికి వారు చాలా దూరంగా ఉన్నారనే విషయం అర్థమైంది. ‘నేటితరం పిల్లలకు కార్ల బ్రాండ్లు, సినిమా ట్రెండ్ల గురించి బాగా తెలుసు. అలాంటి పిల్లలకు చెట్లు, పర్యావరణం పట్ల అదే ఉత్సుకతను ఎందుకు పెంపొందించలేము? అనే కోణంలో ఆలోచించాం. పిల్లలకు ప్రకృతిపై అవగాహన లోపం మాత్రమే సమస్య కాదని, భావోద్వేగ అనుబంధం లేకపోవడమే అసలు సిసలు సమస్య అని గ్రహించాం’ అంటున్న ఈ దంపతులు గత సంవత్సరం దిల్లీలోని కిద్వాయ్‌నగర్ కాలనీలో ‘స్కూల్ ఆఫ్ ట్రీస్’ ప్రారంభించారు.నిశ్శబ్ద గురువులుస్కూల్ ప్రత్యేకత విషయానికి వస్తే....నిరాడంబరంగా ప్రారంభమైంది. తరగతి గదులు లేవు. అరువు తెచ్చుకున్న సిలబస్ లేదు. కేవలం చెట్లు, మట్టి, ఉత్సాహం మాత్రమే ఉన్నాయి. ‘చెట్లు అంటే కేవలం చెట్లు మాత్రమే కావు. అవి నిశ్శబ్ద గురువులు. మనం తినే ప్రతీది, మనం తాకే ప్రతీది ఇక్కడే మొదలవుతుంది’ అనే సందేశాన్ని పిల్లల మనసులోకి తీసుకు వెళ్లారు. ‘కిరణజన్య సంయోగక్రియ ఆగిపోతే మనకు తెలిసిన జీవితం ఆగిపోతుంది. ఆకులు తమ మనుగడ కోసం ఒకదానిపై ఒకటి అల్లుకుంటూ కలిసి పెరుగుతాయి. మనం కూడా వాటి నిశ్శబ్ద కృషి నుంచి నేర్చుకోవాలి’ అని చెబుతున్న రోహిత్–గీతాంజలి దంపతులు ఆసక్తికరమైన వర్ణమాలను సృష్టించారు.ఉదా: ‘బి’ ఫర్ బ్యాంబూ ‘ఇ’ ఫర్ ఎర్త్ ‘స్కూల్ ఆఫ్ ట్రీస్’లో ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు ఉండదు. ఆసక్తి ఉంటే చాలు.ట్రీ పార్టీప్రకృతి మధ్య, ప్రకృతి సంబంధిత పదాలతో భాష నేర్చుకోవడం ఎంత బాగుంటుంది! ట్రీ స్కూల్’లో పాఠాలు నేర్చుకోవడం పనిలా అనిపించదు. అదొక ఆటలా అనిపిస్తుంది. పిల్లలకోసం ప్రతి వారాంతంలో ‘ట్రీ పార్టీ’లు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ బల్లలు ఉండవు, ‘కదలకుండా కూర్చోవాలి’ అనే నియమాలు ఉండవు. మెత్తటి పచ్చిక బయళ్లు, ఆకాశమంత ఎత్తైన చెట్ల కాండాలను చూస్తూ, సేద తీరుతూ, ఆటలు ఆడుతూ కనపిస్తారు పిల్లలు. పిల్లలు ఆడే ఆటల్లో ఒకటి... చెట్లను గమనించే ఆట. ఒక అమ్మాయి/అబ్బాయి స్టాప్‌వాచ్ పట్టుకోగా, మిగతా పిల్లలు ఒక నిమిషం వ్యవధిలో తమ పరిసరాలలో ఉన్న చెట్ల పేర్లు చెప్పాలి. గెలిచిన వారికి చాక్లెట్లు బహుమానంగా ఇస్తారు. మరొకదానిలో... పిల్లలకు విత్తనాలు, కుండీలు ఇచ్చి ‘నాటండి. నీరు పోయండి, గమనించండి’ అంటూ సులభమైన సూచనలు ఇస్తారు.‘చెట్లు అనేవి పాఠశాలలో నేర్చుకునే పాఠాలు కాదు. కంఠస్థం చేసే నిర్వచనాలు కావు. మొక్కలు నాటుతూ, రోజూ వాటిని పలకరిస్తూ, వాటి ఎదుగుదలను చూడడమే అసలు సిసలు పాఠం’ అంటుంది సాక్షి అనే విద్యార్ధిని.మట్టిపరిమళం తెలిసింది‘స్కూల్ ఆఫ్ ట్రీస్’లోని పాఠాలు తరగతి గదికి మాత్రమే పరిమితమైనవి కావు. అవి పిల్లలతో పాటు వారి ఇంటికి వెళతాయి. ఒకసారి క్లాస్‌లో పాత ప్లాస్టిక్ సీసాలను మొక్కలు నాటే తొట్టెలుగా ఎలా ఉపయోగించాలా పిల్లలకు చూపించారు. అవి చూసిన పిల్లలు తమ ఇంట్లో వాటిని తయారుచేశారు. ఒకప్పుడు మట్టిని మట్టుకోవడానికి సంకోచించే పిల్లలు ఇప్పుడు తమ సైకిళ్లపై కుండీలను జాగ్రత్తగా పెట్టుకొని సగర్వంగా ఇంటికి వెళుతున్నారు.వారు తమ మొక్కలకు నీళ్లు పోస్తారు. వాటి పెరుగుదలను గమనిస్తారు. పర్యావరణానికి సంబంధించి తల్లిదండ్రులకు స్ఫూర్తిని ఇస్తారు. ‘ఇంట్లో ప్లాస్టిక్ వ్యర్థాలు కనిపిస్తే వాటిని ఎలా ఉపయోగించుకోవచ్చు అని ఆలోచిస్తుంటాను’ అంటుంది పన్నెండు సంవత్సరాల మీనాక్షి. మామిడి మొక్క నాటాలనేది ఆమె కల. ఇలాంటి కలలెన్నో ‘స్కూల్ ఆఫ్ ట్రీస్’ పిల్లలకు ఉన్నాయి. -
ప్రతి చిన్నారికి విద్య, పోషకాహారం
సాక్షి, హైదరాబాద్: ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, పోషకాహారం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం పెట్టేందుకు బడ్జెట్లో కేటాయింపులు చేశామని చెప్పారు. ప్రముఖ ఆర్థికవేత్త కార్తీక్ మురళీధరన్ గురువారం సీఎంను కలిశారు. రాష్ట్రంలో 0–10 ఏళ్లలోపు పిల్లల్లో పోషకాహారం లోపం.. విద్యాభ్యాసన స్థాయి సామర్థ్యలోపాలకు సంబంధించి పలు నివేదికలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. చిన్న వయస్సులో పోషకాహారం లోపంతో భవిష్యత్‌లో తలెత్తే ఆరోగ్య సమస్యలు, ప్రాథమిక స్థాయిలో సరైన బోధన లభించకపోతే విద్యార్థి భావి జీవితంలో పడే మానసిక వేదన వివరించారు.వాటిని అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. అయితే ఆయా అంశాలపై తాము ఇప్పటికే ప్రత్యేక శ్రద్ధ పెట్టామని సీఎం చెప్పారు. మురళీధరన్‌తో సమన్వయం చేసుకుని ఆయా అంశాలపై ప్రత్యేక నివేదిక రూపొందించి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, సీఎస్ కె.రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, కార్యదర్శి మాణిక్ రాజ్, ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, సెర్ప్ సీఈవో దివ్య తదితరులు పాల్గొన్నారు. -
అల్లరి వేళల అప్రమత్తం
రంగంపేట/రాయవరం: పిల్లలు అల్లరి చేస్తేనే అందం. ఆటలాడితేనే ఆరోగ్యం. ఆలోచిస్తేనే మేధోబలం. ఇవన్నీ నియంత్రణలో ఉన్నపుడే వారికీ.. వారి తల్లిదండ్రులకు.. చదువులు చెప్పే గురువులకు గౌరవం.. మన్నన. ఎండల తీవ్రత పెరగడంతో విద్యాశాఖ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 24 వరకు ఒంటిపూట తరగతుల నిర్వహణపై మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు సాగనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు పాఠశాలల నుంచి రాగానే పుస్తకాల సంచీ అవతల పడేసి ఆదరాబాదరగా అన్నం తినేసి స్నేహితులతో ఆటలకు పరుగులెడుతున్నారు. ఎండలు ఎక్కువగా ఉన్నాయని ఒంటి పూట బడులు పెడితే విద్యార్థులు మళ్లీ ఆ ఎండనే పడి ఆటలాడడం ఆలోచించాల్సి విషయం. ఒంటిపూట బడుల నేపథ్యంలో పిల్లల భద్రతను తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఫేట్ మారుస్తున్న ఫీట్స్.. దేశంలో ఏటా రెండు లక్షల మంది చిన్నారులు కాలువలు, చెరువులు, వాగులు, వంకలు, బావుల్లో ఈత సరదా కోసం వెళ్లి మత్యువాత పడుతున్నట్లు యూనిసెఫ్ సర్వే సారాంశం. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో నీటి వనరులకు కొదవు లేకపోవడంతో ఇటువంటి ఘటనలకు ఆస్కారం ఎక్కువ. నీటిని చూడగానే సహజంగానే పిల్లలు ఈతకు ఉపక్రమిస్తుంటారు. స్థానికులైతే కొంత పరవాలేదు కానీ.. చుట్టపుచూపుగా వచ్చిన బంధువుల పిల్లలు, స్నేహితులు అయితే ఆ కాలువో, చెరువో లేదా మరేదైనా దాని లోతెంతో తెలియక.. ఊబి ఉందా.. బంక మట్టి ఉందా తెలియక వాటిలో మునిగిపోయి మృత్యువాత పడుతున్నారు. మరి కొందరు సరిగా ఈత రాక ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరు చిన్నారులు తోటి స్నేహితులు ఈదుతున్నారు కదా అని ఈత రాకపోయినా వారు కూడా దిగి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. అలాగే ప్రమాదకర ఫీట్స్ చేసి తగలరాని చోట ఏదో తగిలి.. లేదా నిలువుగా డైవ్ చేసే వేళ నిగ్రహించుకోలేని లోతులకు దూసుకుపోయి ఊపిరాడక ప్రాణాలు కోల్పోతున్నారు. చెట్ల కొమ్మల నుంచి.. కాలువ గట్ల పైనుంచి దూకుతూ దుందుడుకు చర్యలకు పాల్పడుతూ మృత్యువాత పడుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలి ఒంటి పూట బడులు, రానున్న వేసవి సెలవుల నేపథ్యంలో తల్లిదండ్రులతో పాటు అధికారులు మరింత అప్రమత్తమై అత్యవసర చర్యలు తీసుకోవాల్సి ఉంది. కాలువల రేవుల వద్ద, చిన్నారులు ఎక్కువుగా స్నానాలు చేసే ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులు పెట్టాలి. కాలువైనా.. వ్యవసాయ బావులైనా.. నదులైనా ఎక్కడ ఎంత లోతు ఉంది.. పిల్లలు దిగరాదని.. నీటి లోపలి మట్టి జారుడుగా ఉందా.. ఊబులు ఉండే అవకాశం ఉందా.. అట్టడుగున తూటికాడ, గుర్రపుడెక్క ఉండే అవకాశం ఉందా.. దానిలో కాళ్లు చిక్కుకుని మునిగిపోయే ప్రమాదం ఉందా తదితర వివరాలతో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉంది.పంచాయతీలు, నీటిపారుదల శాఖలు సంయక్తంగా కాలువ రేవుల వద్ద మెష్‌లతో కంచెలు నిర్మిస్తే చాలా వరకు ప్రయోజనం ఉంటుంది.తేలికపాటి ఆహారం మంచిది...వేసవిలో పిల్లలకు త్వరగా జీర్ణమయ్యే తేలికపాటి ఆహారం ఇవ్వాలి. పండ్ల రసాలు తాగించి బడికి పంపాలి. నీరు ఎక్కువగా తాగిస్తూ ఉండాలి. మరీ చల్లని పదార్థాలు ఇవ్వొద్దు. వేపుళ్లు, మాంసాహారం వంటివి వేసవిలో మంచిది కాదు. రాత్రిపూట త్వరగా నిద్రకు ఉపక్రమించేలా, నిద్ర లేచిన తరువాత కొంత సమయం చదువుకునేలా అలవాటు చేస్తే మేధాశక్తి పెరుగుతుంది. – డాక్టర్ వేణుశ్రీలక్ష్మి, పీహెచ్సీ, రంగంపేట మండుటెండల్లోనే ఆటలువిద్యార్థులు ఎండ బారిన పడకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాఠశాల వదిలాక ఇళ్లకు వచ్చే క్రమంలో తలకు టోపీ ధరించడం, ముఖంపై ఎండ పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రవి కిరణాలతో ప్రమాదంఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సూర్యుడి కిరణాలు భూమిపై నిటారుగా పడుతుంటాయి. ఈ సమయంలో విడుదలయ్యే అతినీలలోహిత కిరణాలు చర్మంపై పడి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అవసరమైతే తప్ప బయట తిరగకపోవడం, ప్రయాణ సమయాల్లో పిల్లలను వాహనాల ముందు భాగంలో కూర్చోపెట్టకుండా వడదెబ్బ నుంచి కాపాడడం అవసరమని వారు సూచిస్తున్నారు.ఆటలలో అజాగ్రత్త వద్దువిద్యార్థులు స్మార్ట్ మొబైళ్లకు బానిసలు కాకుండా నీడ పట్టున ఆడే ఆటలు, విజ్ఞానాన్ని పెంపొందించే పుస్తకాల పఠనం, అన్నింటి కంటే ముఖ్యంగా తల్లిదండ్రులు, బంధువర్గంతో ఎక్కువ సమయం గడపడం అత్యంత ఆవశ్యకం. తద్వారా పెద్దలతో మసలే తీరు తెలుసుకునే అవకాశం, మంచీ చెడూ తెలుస్తాయి. మధ్యాహ్న వేళ కొంత విశ్రాంతి తీసుకునేలా చూడాలి. -
నల్లగున్నవ్.. నీకెందుకు చదువు..?
మెదక్ కలెక్టరేట్: ‘నల్లగున్నవు నీకు చదువెందుకు.. టీసీ ఇస్తాం వెళ్లిపో’.. అంటూ తమ కుమార్తెను పాఠశాలకు రానివ్వడం లేదని తల్లిదండ్రులు గురువారం కలెక్టర్ ప్రతిమాసింగ్‌కు మొర పెట్టుకున్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం నాయిని జలాల్‌పూర్‌కు చెందిన బాధిత విద్యార్థిని మనస్విని, ఆమె తల్లిదండ్రులు ఎల్లం, జ్యోతి విలేకరులకు తెలిపిన వివరాలివి. మెదక్‌లోని తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ (టీజీఆర్ఎస్)లో మనస్విని 7వ తరగతి చదువుతోంది. గత నెల 20న కడుపునొప్పి రావడంతో.. ప్రిన్సిపాల్‌కు సమాచారం అందించి విద్యార్థినిని ఆస్పత్రికి తీసుకెళ్లగా కిడ్నీలో స్వల్పంగా రాయి ఉన్నట్లు తేలింది. నీళ్లు తాగితే సరిపోతుందని వైద్యులు చెప్పడంతో పాఠశాలలో చేర్పించారు. ఈ క్రమంలో మళ్లీ అనారోగ్యానికి గురి కావడంతో తల్లిదండ్రులు వెళ్లి ఏఎన్ఎం ఆశాజ్యోతిని సంప్రదించగా దురుసుగా ప్రవర్తించింది. ‘ఏ అడివినుంచి వచ్చిండ్రు మీరు... ఆ పిల్లకు టీసీ ఇచ్చి పంపిస్తాం’.. అని అవమానించినట్లు విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపించారు. అనంతరం పాపకు ఆస్పత్రిలో చికిత్స చేయించి ఇటీవల పాఠశాలలో చేర్చుకోవాలని వెళ్తే ప్రిన్సిపాల్‌తో పాటు సిబ్బంది నోటికొచ్చినట్లు మాట్లాడి అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. కిడ్నీలో రాయి తగ్గినట్లు డాక్టర్ సర్టిఫికెట్ తెస్తేనే చేర్చుకుంటామని ప్రిన్సిపాల్ పాఠశాలలోకి రానివ్వడం లేదని వాపోయారు. ‘నల్లగా ఉన్న నీకు చదువెందుకు?.. టీసీ ఇచ్చి పంపిస్తాం.. వెళ్లిపో’.. అని నర్స్ ఆశాజ్యోతి, ప్రిన్సిపాల్ తారాసింగ్ పాఠశాలలోకి రానివ్వడం లేదని విద్యార్థిని బోరున విలపించింది. స్పందించిన కలెక్టర్ ప్రతిమాసింగ్ ప్రిన్సిపాల్ తారాసింగ్ వివరణ తీసుకొని విద్యార్థిని మనస్వినిని పాఠశాలకు పంపించినట్లు సమాచారం. -
తెలంగాణలో ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు
హైదరాబాద్: తెలంగాణలో మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు ఉంటాయి. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు కొనసాగుతాయి. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ మేనేజ్మెంట్ పాఠశాలలన్నింటికీ ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. మధ్యాహ్న భోజనం సరిగ్గా మధ్యాహ్నం 12.30 గంటలకు పెడతారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో ఆ క్లాసుల విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయి. పదో తరగతి పరీక్షా కేంద్రాలుగా ఉన్న స్కూళ్లు.. పరీక్షలు జరిగే రోజుల్లో మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయి. పరీక్షలు లేని రోజుల్లో పరీక్షా ఆ స్కూళ్లు కూడా యథావిధిగా ఉదయం 8 గంటల నుంచి 12.30 గంటల వరకు పనిచేయాలి. ఈ ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారులకు (DEOs) డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు. -
ఇరాన్ లో స్కూల్ పై దాడి.. ప్రాణాలు కోల్పోయిన పిల్లలు
-
విద్యార్థిపై 10 మంది దాడి.. మనస్థాపంతో సూసైడ్ నోట్
సాక్షి, కోనసీమ: ద్రాక్షరామ గురుకుల పాఠశాలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బిల్లీపాల్ అనే విద్యార్థిపై తోటి 10 మంది విద్యార్థులు దాడి చేశారు. దీంతో మనస్థాపం చెందిన బిల్లీపాల్ సూసైడ్ నోట్ రాసి ఎవరికి కనిపించకుండా వెళ్లిపోయారు. దీంతో వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పాఠశాల వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. విద్యార్థి క్షేమంపై తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇది సొసైటీ... నడబడిక!
స్కూళ్లలో గంజాయి, స్కూళ్లలో వీడియోగేమ్స్, స్కూళ్లలో చెడ్డ మాటలు, స్కూళ్లలో రౌడీయిజం చదువుకునే పిల్లల మధ్య కలుపుమొక్కలు. చివరకు క్లాస్‌రూమ్‌లో టీచర్ మీద చెయ్యెత్తే వరకూ వచ్చారు. ఇందులో ఎవరి మీద నెపం నెడదాం? ఈ విద్యా భారతాన్ని ఎలా చూద్దాం?బడి అంటే ఉత్తి భవనం కాదు. విద్యార్థుల భవితను తీర్చిదిద్దే ఆలయం. చదువు చెప్పే ప్రతి గురువు దైవంతో సమానం. తల్లిదండ్రుల తర్వాతి స్థానం మన పెద్దలు గురువుకే ఇచ్చారు. విద్యార్థుల్ని సొంత పిల్లల్లా చూసుకుంటూ, వారి బతుకును తీర్చిదిద్దే దిక్సూచులుగా మారి వారిని గమ్యానికి చేర్చే బాధ్యత ఉపాధ్యాయులది. కానీ.. పరిస్థితి తారుమారైంది. చదువు చెప్పే గురువులకు మర్యాద కరువైంది. విద్య నేర్పే ఒజ్జలకు విలువనిచ్చే సంస్కృతి కనుమరుగవుతోంది. తప్పు చేస్తే విద్యార్థులను ఉపాధ్యాయులను దండించే కాలం పోయి, విద్యార్థులే ఉపాధ్యాయులను దండించే కాలం వచ్చింది. ఇది కాలరీతి అనుకోవాలా లేక సమాజంలో దిగజారిపోతున్న విలువలకు తార్కాణంగా భావించాలా తెలియని పరిస్థితి. ఇటీవలి ఘటన కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వీరవల్లి జడ్పీ ఉన్నతపాఠశాలలో జరిగిన ఘటన అందరినీ నివ్వెరపరిచింది. మరుగుదొడ్ల వద్ద సిగరెట్లు తాగుతున్న ముగ్గురు విద్యార్థులను గమనించి ల్యాబ్ అసిస్టెంట్ మందలించారు. దీనిపై ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ విద్యార్థులు ఆయనతో వాగ్వాదానికి దిగి దాడి చేశారు. ఈ ఘటనను వీడియో తీస్తున్న వారిపైనా దాడి చేశారు. దీంతో ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో తరచూ జరుగుతున్నాయి. బడిలో మద్యం, గంజాయి తాగడం, అమ్మాయిలను ఏడిపించడం, గ్రూపులుగా విడిపోయి కొట్టుకోవడం తరచూ కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల ఇవి తీవ్రస్థాయికి చేరుతున్నాయి. వీటిని కట్టడి చేయలేక ఉపాధ్యాయులు చేతులెత్తేస్తున్నారు. గట్టిగా చర్యలు తీసుకోవాలని చూస్తున్నా స్థానిక రాజకీయాలు, ఒత్తిడి వారి ఆ పని చేయనీయకుండా చేస్తోంది. దీంతో మిన్నకుండిపోతున్నారు.సినిమాలు... సోషల్ మీడియా ప్రభావంస్కూల్ పిల్లలు చెడ్డదారిలో పడటానికి సినిమాలు, సోషల్ మీడియా ప్రధాన కారణంగా మారుతున్నాయని నిపుణులు అంటున్నారు. సినిమాల్లో విద్యార్థులు తమ లెక్చరర్లను ఏడిపించడం, వారి మీద జోకులేయడం వంటి సన్నివేశాలు చూసి తామూ అలా చేయాలని భావిస్తున్నారని అంటున్నారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ట్రెండింగ్ వీడియోలు, బూతులు, అశ్లీల వీడియోలు సైతం వారి మనసుల మీద చెడు ప్రభావం చూపిస్తున్నాయంటున్నారు. ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉండటం వల్ల చాలా సులభంగా వీటిని చూస్తూ ఆ ప్రభావానికి లోనవుతున్నారని అంటున్నారు.తల్లిదండ్రుల మాటలనూ లెక్కచేయక...విద్యార్థులు బడిలోనే ఇలా ఉంటున్నారనుకుంటే ΄÷రపాటే. కొందరు తమ ఇళ్లల్లోనూ ఇదే రీతిలో ప్రవర్తిస్తున్నారు. తల్లిదండ్రుల మాట వినకుండా, వారి మాటలకు ఎదురుచెప్తూ, వారి మీదే దాడికి పాల్పడుతున్నవారూ ఉన్నారు. అతిగారాబం, అడిగినవన్నీ అందించడం, అందరిలోనూ గొప్పగా ఉండాలని కోరుకోవడం వంటి కారణాలతో తల్లిదండ్రులే పిల్లల్ని ఇటువంటి ప్రవర్తనకు పురిగొల్పుతున్నారని మానసిక వైద్యులు అంటున్నారు. చివరకు సొంత అమ్మానాన్నల మాట కూడా వినని స్థితికి చేరుకున్నాక ఏమీ చేయలేక కుమిలిపోతున్నారని అంటున్నారు.ఇలా చేస్తే మేలు...⇒ పిల్లలను అతిగారాబం చేయకూడదు. వారి అవసరాలను గుర్తించి అందుకు తగ్గట్టు అందించాలి తప్ప వారి అడిగిన ప్రతి వస్తువూ కొనివ్వకూడదు. ⇒ పెద్దల్ని గౌరవించడం, ఆడవారితో మర్యాదగా ఉండటం, తోటివారితో స్నేహంగా మెలగడం వంటివి చిన్ననాటి నుంచే నేర్పించాలి. ⇒ పిల్లలు వారి ఫోన్ లో ఏమేం చూస్తున్నారో కనిపెడుతూ ఉండాలి. చూడకూడదని మొండికేస్తే ఆ ఫోన్ వారి నుంచి తీసుకోవాలి. ⇒ పిల్లల స్నేహితులు ఎవరు, వారి అలవాట్లు ఏమిటి, వారి పద్ధతి ఎలా ఉంది అనేది గమనించాలి. ఎక్కడైనా తప్పుడు స్నేహాల బారిన పడుతున్నట్లు అనిపిస్తే వెంటనే హెచ్చరించాలి. ⇒ కనీసం నెలకోసారైనా బడికి వెళ్లి పిల్లల ప్రవర్తన గురించి ఆరా తీయాలి. కేవలం మార్కుల గురించే కాకుండా నడవడిక గురించి కనుక్కోవాలి. ⇒ రాత్రుళ్లు ఆలస్యంగా ఇంటికి రావడం, రోజంతా ఫోన్ లోనే గడపడం, అందరిపట్లా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటివి గమనిస్తే వెంటనే పిల్లల్ని మందలించాలి. అయినా మారకపోతే కొన్నిసార్లు కఠినంగా వ్యవహరించక తప్పదు. -
‘కళ్లు పెద్దవిగా చేసుకుని చూడు’.. ట్రంప్ పరువు తీసిన ఇరాన్
టెహ్రాన్: ‘ట్రంప్ కళ్లు పెద్దవిగా చేసుకుని చూడు’ అంటూ ఇరాన్ ప్రభుత్వ ఆంగ్ల మీడియా సంస్థ టెహ్రాన్ టైమ్స్ ఫ్రంట్ పేజీలో ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనంలో ఇటీవల అమెరికా మిసైల్ దాడిలో మరణించిన ఇరాన్ మినాబ్ నగరంలోని ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థుల ఫొటోలు ప్రచురించి, ప్రపంచ దేశాల ఎదుట అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరువు తీసింది.‘ట్రంప్ ఒక్కసారి ఆ చిన్నారుల కళ్లల్లోకి చూడు’ అంటూ ఆ ఫొటోలతో పాటు ఇరాన్‌పై జరుగుతున్న సైనిక దాడులపై ట్రంప్ చేసిన ప్రకటనలు బాధ్యతారహితంగా, తప్పుడు వాదనలు, దౌత్య పరిష్కారాలను ధిక్కరించేవిగా ఉన్నాయని పేర్కొంది. స్కూల్‌పై దాడి ఘటనపై ట్రంప్ మాట్లాడుతూ, “ఆ స్కూల్‌పై ఇరాన్ దాడి చేసింది. వారి ఆయుధాలకు ఖచ్చితత్వం ఉండదు” అంటూ ఇనాబ్ స్కూల్ విషాదాన్ని ఇరాన్‌పై నెట్టే ప్రయత్నం చేశాడు.ట్రంప్ వ్యాఖ్యలను ఖండిస్తూ, ఇరాన్ తన సొంత మీడియా పత్రిక ఫ్రంట్ పేజీలో ఇనాబ్ స్కూల్లో ప్రాణాలు కోల్పోయిన పసిపిల్లల ఫొటోలు అచ్చు వేసింది. ఇక అటు ట్రంప్, ఇటు ఇరాన్ వాదనలు–ప్రతివాదనలు కొనసాగుతుండగా, ప్రముఖ అమెరికా మీడియా సంస్థ న్యూయార్క్ టైమ్స్ విచారణలో మినాబ్‌లోని పాఠశాలపై దాడి చేసింది అమెరికా సైన్యమేనని తేలింది. ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడి జరగగా, స్కూల్లో 150 మంది చనిపోయారని, వారిలో అధిక శాతం విద్యార్థులేనని నివేదికలో పేర్కొంది. స్కూల్లో జరిగిన మారణహోమానికి అమెరికా, ఇజ్రాయెల్ బాధ్యత వహించాల్సిందేనని న్యూయార్క్ టైమ్స్ హైలైట్ చేసింది.గత ఫిబ్రవరి 28న ఇరాన్‌లోని ఇనాబ్ ప్రాంతంలో అమెరికా–ఇజ్రాయెల్ మిసైళ్లతో దాడి జరిపాయి. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా అభివృద్ధి చేసిన టొమాహాక్ క్రూయిజ్ మిసైల్ దాడి జరిగినట్లు యుద్ధాలు, ఘర్షణలు, వాటి ప్రభావాలను అధ్యయనం చేసే రీసెర్చర్ ట్రెవర్ బాల్ తెలిపారు.అంతేకాదు, తొలిసారి ఐఆర్జీసీ కేంద్రాలపై అమెరికానే ఈ దాడి జరిపిందని, అందులో ఇజ్రాయెల్ ప్రమేయం లేదని చెప్పారు. ఇనాబ్ స్కూల్ గోడలోకి దూసుకెళ్లిన అమెరికాకు చెందిన టొమాహాక్ క్రూయిజ్ మిసైల్ అని నిర్ధారించేందుకు ఫుటేజీలను కూడా బయటపెట్టారు. -
165 మంది విద్యార్థినుల సామూహిక ఖననం
టెహ్రాన్: అమెరికా వైమానిక దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన 165 మంది విద్యార్థినుల సామూహిక ఖనన క్రతువు వేలాది మంది స్థానికుల సమక్షంలో కొనసాగింది. మినాబ్ నగరంలోని బాలికల ప్రాథమిక పాఠశాలపై శనివారం అమెరికా జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థినుల సంఖ్య తాజాగా 165కి పెరిగిన విషయం తెల్సిందే. మరో 60 మంది గాయపడ్డారు. చనిపోయిన వాళ్లందరినీ ఒకే చోట సామూహికంగా పూడ్చిపెట్టారు. ఇందుకోసం 165 చిన్న గోతులు తీసిన వీడియోలు ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో వైరల్‌గా మారాయి.మినాబ్ సిటీలో జరిగిన విద్యార్థినుల అంతిమయాత్రలో భారీ సంఖ్యలో జనం పాల్గొన్నారు. అశ్రునయనాలతో తుది వీడ్కోలు పలికారు. ‘అమెరికా నాశనం కావాలి’అని నినాదాలు చేశారు. విద్యార్థినుల పారి్ధవదేహాలను ఉంచిన వాహనాలు వీధుల గుండా వెళ్తుండగా వేలాదిగా జనం హాజరై రహదారికి ఇరువైపులా నిలబడి తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు.పేగు తెంచుకుని పుట్టిన తమ చిన్నారులను కడసారి చూసుకుంటూ తల్లులు దిక్కులు పిక్కటిల్లేలా విలపించారు. తర్వాత అశ్రునయనాలతో తమ చిన్నారులకు వీడ్కోలు పలికారు. దీంతో ఆ ప్రాంతాలన్నీ శోకసంద్రాలయ్యాయి. పార్థివదేహాలను వాహనాల్లో అంతిమయాత్రగా తీసుకొస్తుండగా వాళ్లను చివరిసారిగా చూసేందుకు జనం ఎగబడ్డారు. ప్రాణాలు కోల్పోయిన అతీనా అనే విద్యార్థిని తల్లి ఆవేదనలతో మాట్లాడారు. ‘‘అమెరికా చేసే ఘోర నేరాలకు నా బిడ్డ మృతదేహమే ప్రబల సాక్ష్యం’’అని కన్నీరుమున్నీరయ్యారు. -
స్కూలుపై ఇజ్రాయెల్ దాడి 36 మంది ఇరాన్ విద్యార్థులు మృతి
-
స్కూల్‌పై బాంబుల వర్షం.. 50 మందికిపైగా మృతి
ఇరాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. మినాబ్‌లోని స్కూల్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో 50 మందికిపైగా విద్యార్థులు మృతి చెందారు. ఇవాళ ఉదయం(శనివారం) ఇరాన్‌పై ఇజ్రాయెల్ మెరుపు దాడులకు దిగింది. ఇజ్రాయెల్, అమెరికా తీరుపై రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. వరల్డ్ ఆర్డర్‌ను మార్చేలా అమెరికా నాయకత్వం వ్యవహరిస్తోందంటూ మాస్కో మండిపడింది. ఇరాన్‌లోని పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో సుప్రీం లీడర్ ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు సమాచారం.బాంబు దాడుల నేపథ్యంలో ఇరాన్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా సైన్యం ఇరాన్‌పై దాడులు చేపట్టిందన్న ట్రంప్.. అమెరికాకు పొంచి ఉన్న ప్రమాదాన్ని అరికట్డడానికే దాడులంటూ ఆయన తెలిపారు. ఇరాన్ అణ్వాయుధాలు మళ్లీ తయారు చేస్తోందన్న ట్రంప్.. అమెరికా సైనిక స్థావరాలకు ముప్పు ఉండడం వల్లే ఈ దాడులంటూ పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌పై ఇరాన్ ఎదురుదాడి ప్రారంభించింది. బాలిస్టిక్ మిసైళ్లతో ఇరాన్ దాడికి దిగింది. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియా రగులుతోంది. ఒకేసారి ఇరాన్ 10 దేశాలపై మిస్సైళ్లు ప్రయోగించింది.కాగా, ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు నేపథ్యంలో విమానాలు రద్దయ్యాయి. శంషాబాద్ నుంచి వెళ్లాల్సిన పలు విమానాలను రద్దు చేశారు. ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దయ్యాయి. పశ్చిమాసియాకు వెళ్తే విమానాలు రద్దు చేస్తున్నట్లు ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. పశ్చిమాసియా ఘర్షణలతో ఎయిరిండియా విమానం వెనక్కి తిరగొచ్చింది. -
చదువుల బడిలో చిరుత
గాజియాబాద్: పాఠాలు వినేందుకు విద్యార్థులు రావాల్సిన పాఠశాలకు వాళ్ల కంటే ముందే ఒక చిరుతపులి రావడంతో పాఠశాల యాజమాన్యం అవాక్కైంది. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చి దానిని పట్టుకునేందుకు కృషిచేసింది. ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌లోని గోవిందాపురం ప్రాంతంలో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. పాఠశాల వైపుగా ఒక చిరుత రావడం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఇది చూసిన పాఠశాల యాజమాన్యం వెంటనే పోలీసులకు ఫిర్యాదుచేయడం, వాళ్లు వెంటనే బోను, మత్తుమందు ఇంజెక్షన్లతో అటవీశాఖ సిబ్బందిని వెంటేసుకుని రంగంలోకి దిగడం చకచకా జరిగిపోయాయి. ఎట్టకేలకు చిరుతను పాఠశాల టాయిలెట్ గదిలో గుర్తించారు. గది గోడకు నాలుగు అడుగుల రంధ్రం చేసి అందులోంచే మత్తు ఇంజెక్షన్‌ను చిరుత మీదకు ప్రయోగించి అది నిద్రపోయేలా చేశారు. బోనులోకి ఎక్కించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. సహరన్‌పూర్‌లోని శివాలిక్ కొండల్లో చిరుతను వదిలేస్తామని సబ్ డివిజనల్ అధికారి డాక్టర్ సలోని చెప్పారు. -
పాఠశాలల్లో డ్రగ్స్, గంజాయి విక్రయాలు!
మహారాణిపేట: అరకు, పాడేరు ప్రాంతాల్లోని పాఠశాలల్లో విద్యార్థులు డ్రగ్స్, గంజాయి బారిన పడుతుండటంపై విశాఖ జెడ్పీటీసీ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె. సుభద్ర అధ్యక్షతన శనివారం నిర్వహించిన స్థాయీ సంఘ సమావేశాల్లో ఈ సమస్యపై వాడివేడి చర్చ జరిగింది. వైఎస్సార్సీపీ సభ్యులు చెట్టి రోశ్ని (అరకు), సుర్ల గిరిబాబు (గొలుగొండ), సోము సత్యనారాయణ (మునగపాక), సీపీఎం సభ్యులు డి.గంగరాజు (అనంతగిరి) ఏజెన్సీ ప్రాంతాల్లోని విద్యా సంస్థల వద్ద గంజాయి విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాబు సర్కార్ నిర్లక్ష్యం వల్లే మాదకద్రవ్యాల సాగు, అమ్మకాలు చోటుచేసుకుంటున్నాయని విమర్శించారు. దీనిపై స్పందించిన చైర్పర్సన్ విద్యాశాఖ ఇతర విభాగాలతో కలిసి విద్యార్థుల్లో అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.అల్లూరి జిల్లా డీఎంహెచ్ఓను సరెండర్ చేయాలిఅల్లూరి సీతారామరాజు జిల్లాలో అక్రమాలకు పాల్పడుతున్న డీఎంహెచ్ఓను తక్షణమే సరెండర్ చేయాలని సభ్యులు డిమాండ్ చేశారు. ఆ అధికారి వల్ల ప్రజలు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అనంతగిరి, అరకు జెడ్పీటీసీలు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు రాత్రిళ్లు ఫోన్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని చైర్పర్సన్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై చైర్పర్సన్ స్పందిస్తూ మహిళా సిబ్బంది పట్ల అగౌరవంగా ప్రవర్తించే అధికారుల వైఖరి మార్చుకోవాలని, ఈ వ్యవహారంపై తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో అర్హులైన వారందరికీ కొత్త పెన్షన్లు ఇవ్వాలని జెడ్పీటీసీ గిరిబాబు కోరారు. గత 19 నెలలుగా కొత్త పెన్షన్ల మంజూరు లేకపోవడంతో పేదలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ పి.నారాయణమూర్తి, డిప్యూటీ సీఈఓ కె.రాజ్‌కుమార్ అధికారులు పాల్గొన్నారు. -
పాఠశాలల ఆవరణల్లో వాణిజ్య సముదాయాలా..?
సాక్షి, అమరావతి: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ఆవరణల్లో వాణిజ్య సముదాయాల నిర్మాణాలను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చిత్తూరు జిల్లా, బైరెడ్డిపల్లి పాఠశాల వద్ద రూ.50 లక్షలతో, వి.కోట పాఠశాల వద్ద రూ.25 లక్షల అంచనా వ్యయంతో వాణిజ్య సముదాయాలను నిర్మించాలని అధికారులు నిర్ణయించారని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ విశ్రాంత ఉపాధ్యాయుడు నారాయణరెడ్డి సోమచంద్రరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ శుక్రవారం విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కేజీ కృష్ణమూర్తి వాదనలు వినిపిస్తూ ఈ నిర్మాణాల వల్ల విద్యార్థుల చదువుపై ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి నిర్మాణాలను చేపట్టవద్దని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. -
మద్యం మత్తులో తల్లి.. 12 ఏళ్ల కొడుకుకి వింత శిక్ష
కన్నతల్లి ప్రేమకు పరిమితులు ఉండవు, ఆమె ప్రేమకు మరేదీ సాటిరాదు. ఎంతటి కష్టమొచ్చినా తాను పస్తులుండైనా కన్న బిడ్డలను ఆకలితీర్చే అమృత మూర్తి అమ్మ. కానీ కొంతమంది మహిళలలు అమ్మతనానికే మాయని మచ్చను తీసుకొస్తున్నారు. వివాహేతర సంబంధాలు, ఇతర కారణాలతో కన్న బిడ్డల పట్ల కర్కషంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే అమెరికాలోని శాన్ ఆంటోనియోలో చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఒక తల్లి.. తన 12 ఏళ్ల కుమారుడిని ఏకంగా 19 మైళ్ల (సుమారు 30 కిలోమీటర్లు) దూరంలో ఉన్న పాఠశాలకు ఒంటరిగా నడిచి వెళ్లాలని ఆదేశించింది. లూసియా విక్టోరియా మేరీ క్రూజ్ (35) అనే మహిళ ఈ అమానుషానికి ఒడిగట్టింది.ఏమి జరిగిందంటే?విక్టోరియా మేరీ క్రూజ్ భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటుంది. ఆమెకు 12 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే ఘటనకు ముందు రోజు రాత్రి లూసియా తన ప్రియుడితో గొడవపడి, పూటుగా మద్యం సేవించి మత్తులోకి వెళ్లిపోయింది. మరుసటి రోజు ఉదయం బాలుడు ఆమెను నిద్రలేపి స్కూలుకు వెళ్లాలని కోరగా, ఆమె అతడిని ఒంటరిగానే నడిచి వెళ్లమని చెప్పింది. దీంతో పిల్లోడు చేసేదేమి లేక 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన స్కూలుకు నడిచివెళ్లడం ప్రారంభించాడు. అయితే అత్యవసర వాహనాలు వెళ్లే ట్రాఫిక్ లైన్ల పక్కనే ఆ బాలుడు నడవడం ఒకరు గమనించారు. వెంటనే అనుమానం వచ్చి సదరు వ్యక్తి పోలీసులుకు సమాచారమందించాడు. వెంటనే స్పందించిన పోలీసులు బాలుడిని తన చదివే పాఠాశాలకు తీసుకువెళ్లారు.పాఠశాల రిసోర్స్ అధికారి బాలుడిని ప్రశ్నంచిగా అసలు విషయం బయటపడింది. తన తల్లి సూచన మేరకే ఒంటరిగా నడిచివచ్చానని చెప్పాడు. పోలీసులు లూసియా ఇంటికి వెళ్లి విచారించగా, తన కుమారుడు ఒంటరిగా నడిచి వెళ్తున్న విషయం తనకు తెలుసని ఆమె అంగీకరించింది. దీంతో బిడ్డ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరపరిచారు. అనంతరం 15,000 డాలర్ల (సుమారు రూ. 12.5 లక్షలు) వ్యక్తిగత బాండ్ సమర్పించడంతో ఆమెకు బెయిల్ లభించింది. -
స్కూల్లో చొరబడి విద్యార్థులు, టీచర్ల నిర్బంధం
హాట్ యాయ్: పట్టరాని ఆగ్రహంతో ఊగిపోతున్న ఓ ఆగంతకుడు సమీప స్కూల్లోకి చొరబడి గన్‌తో అక్కడి విద్యార్థులు, ఉపాధ్యాయులను బెదిరించి అందర్నీ బంధించిన ఉదంతం థాయిలాండ్‌లో జరిగింది. విషయం తెల్సి రంగంలోకి దిగిన పోలీసులు దాదాపు రెండు గంటలపాటు శ్రమించి ఎలాగోలా అందర్నీ క్షేమంగా విడుదలచేశారు. అయితే ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఒక విద్యార్థి గాయపడ్డాడు. రెండు గంటలపాటు తీవ్ర ఉత్కంఠకు గురిచేసిన ఈ ఘటన ఎట్టకేలకు సుఖాంతంకావడంతో పోలీసులు, స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. దక్షిణ థాయిలాండ్‌లోని హాట్ యాయ్ జిల్లాలోని సోంగ్‌ఖ్లా పట్టణంలోని ఫటోంగ్ ప్రథాన్ ఖిరివాట్ స్కూల్లో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. రెండు గంటలపాటు అందర్నీ తన బందీలుగా మార్చుకున్న 19 ఏళ్ల ఆగంతకుడిని ఖేమ్నన్గా పోలీసులు గుర్తించారు. స్కూల్లో తన సోదరికి పాఠాలు చెప్పిన ఒక టీచర్‌ను లక్ష్యంగా చేసుకుని పాఠశాలలోకి ఖేమ్నన్ చొరబడ్డాడని స్థానికులు ఆరోపించారు. ఖేమ్నన్కు పాఠశాలకు మధ్య నెలకొన్న వివాదం ఏమిటన్నది తెలియరాలేదు. స్కూల్లో పలుమార్లు కాల్పుల శబ్దాలు విన్పించాయని, పలువురు గాయపడ్డారని తొలుత వచ్చిన వార్తలను థాయిలాండ్ ప్రభుత్వం ఖండించింది. థాయిలాండ్‌లో తుపాకీల సంస్కృతి ఎప్పట్నుంచో ఉంది. ఇక్కడి జనాభాలో చాలా మందికి గన్లను కొనుగోలుచేసే అలవాటు ఉంది. వ్యక్తిగత మనస్పర్ధలతో తుపాకీల మోతలు మోగుతాయిగానీ గుమిగూడిన జనాలపై సామూహికంగా కాల్పుల ఘటనలు అత్యంత అరుదు. -
కాల్పుల కలకలం.. 34 మంది మృతి
థాయ్‌లాండ్‌లోని శోంక్లా పట్టణంలో దారుణం జరిగింది. పాఠశాలలో అగంతకుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 34 మంది మృతి చెందారు. మృతుల్లో 22 మంది చిన్నారులు ఉన్నారు. మాజీ పోలీస్ అధికారి ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. పాఠశాల ముగిసే సమయంలో ప్రాంగణంలోకి ప్రవేశించిన దుండగుడు కాల్పులు జరిపాడు. పాఠశాలలోకి చొరబడి ఉపాధ్యాయులు, చిన్నారులను బందీలుగా చేసుకుని కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ దాడి థాయ్‌లాండ్ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటనగా అధికారులు పేర్కొన్నారు. In Thailand’s Hat Yai city a gunman opened fire at a school. Children were injured and somechildren were taken hostage.Children aren't safe ? These are Second incidents. pic.twitter.com/dh81ilVK9S— Moiz Shaikh (@MoizShaikh00) February 11, 2026 -
సంగారెడ్డి స్కూలులో అగ్నిప్రమాదం
సాక్షి సంగారెడ్డి: పోతిరెడ్డి పల్లిలో శ్రద్ధ స్కూల్లో అగ్నిప్రమాదం జరిగింది. పట్టణంలోని స్కూలు బిల్డింగులో ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసే యత్నం చేస్తున్నాయి. అయితే ప్రమాదానికి కారణం షార్ట్ సర్కూట్ అయ్యిుండచ్చని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు. ఈ రోజు మున్సిఫల్ ఎన్నికలు కావడంలతో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. దీంతో విద్యార్థిులు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. -
చండీగఢ్ స్కూళ్లకు బాంబు బెదిరింపులు
బాంబు బెదిరింపుల కాల్స్ ఈ మధ్య తరచుగా మారాయి. తాజాగా ఛండీగఢ్‌లోని పలు పాఠశాలలలో బాంబులు పెట్టామంటూ ఈ రోజు ఉదయం బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని విద్యార్థులను ఖాళీ చేయించారు.ఛండీగఢ్‌తో పాటు పక్కనే ఉన్న మోహలీ ప్రాంతంలో పాఠశాలలో బాంబులు పెట్టామని బెదిరింపులు రావడంతో పాఠశాల సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆ సమాచారాన్ని పోలీసులకు అందించారు. అదే విధంగా కొన్ని పాఠశాలలు విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి పాఠశాలలకు సెలవు ప్రకటించారు. దీంతో వెంటనే పోలీసులు పాఠశాలలకు చేరుకున్నారు. డాగ్‌స్క్వాడ్ బృందాలతో పాటు జాగీలాలతో గాలింపు చేపట్టారు. అయితే ఇటీవల పాఠశాలలకు బాంబు బెదిరింపులు తరచుగా మారాయి. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం రేగింది. రాజధాని పరిసర ప్రాంతాల్లోని తొమ్మిది స్కూళ్లలో బాంబులు పెట్టామంటూ అఫ్జల్ గురు జ్ఞాపకార్థం ఢిల్లీ ఖలిస్థాన్ గా మార్చబోతున్నామంటూ అందులో ఉంది. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే ఆ స్కూళ్లను ఖాళీ చేయించారు.జనవరి 29న రాజధానిలో ఐదు విద్యాలయాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తీరా అధికారులు తనిఖీలు చేయగా అది బెదిరింపు మెయిల్ అని తేలింది. అదే విధంగా జనవరి 28న ద్వారకా కోర్టు కాంప్లెక్స్ లోనూ పేలుడు పధార్థాలు పెట్టామంటూ మెయిల్ రాగా పోలిసులు తనిఖీలు చేపట్టగా అది అబద్ధమని తేలింది.అయితే ఇలా బెదిరింపు కాల్స్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. -
కెనడా పాఠశాలలో కాల్పుల మోత
వాంకోవర్: ప్రశాంత కెనడాలో కాల్పుల మోత మోగింది. బ్రిటిష్ కొలంబియా రాష్ట్రంలోని టుంబ్లర్ రిడ్జ్ కొండ ప్రాంత పట్టణంలోని టుంబ్లర్ రిడ్జ్ సెకండరీ స్కూల్లో ఓ ఆగంతకురాలు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో పది మంది ప్రాణాలు కోల్పోయారు. 27 మంది గాయాలపాలయ్యారు. రక్తమోడుతున్న ఇద్దరిని అధికారులు హుటాహుటిన హెలికాప్టర్లో సమీప ఆస్పత్రికి తరలించారు. సమీప ఇంట్లో రెండు మృతదేహాలను అధికారులు గుర్తించారు. వినబడగానే వణికిపోయాం.. ‘‘కాల్పుల శబ్దాలు రాగానే అంతా వణికిపోయాం. స్కూల్లో లాక్డౌన్ ప్రకటిస్తున్నాం. పిల్లలంతా వెంటనే మీ క్లాస్‌రూమ్‌ను లోపలి నుంచి గడియపెట్టండి అని లౌడ్స్పీకర్లలో అనౌన్స్మెంట్ వినపడింది. వెంటనే మా తరగతి గది తలుపులు మూసేశాం. వాటిని బద్దలుకొట్టకుండా అడ్డుగా టేబుళ్లను పేర్చాం. వాటిని అలాగే రెండు గంటలపాటు అదిమిపట్టాం. పోలీసులు వచ్చాకే మా ప్రాణం లేచొచి్చంది’’అని పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న డేరియన్ క్విస్ట్ చెప్పాడు. ‘‘మా స్కూల్ ప్రిన్సిపల్ లాక్డౌన్ అని అరుస్తూ కన్పించారు. వెంటనే విద్యార్థులతోపాటు తరగతి గదిలోకి పరుగెత్తి లోపలి నుంచి గడియ బిగించాం. అడ్డుగా బెంచీలను అడ్డుపెట్టాం. అలా రెండు గంటలు ఉండిపోయాం. కాల్పుల శబ్దాలు మా చెవుల్లో మార్మోగుతున్నాయి. ఈ దెబ్బకు చిన్నారులు మళ్లీ పాఠశాలకు అడుగుపెట్టడం కష్టమే’’అని మెకానికల్ సబ్జెక్ట్ ఉపాధ్యాయుడు జార్బాస్ నోరోన్హా చెప్పారు. పాఠాల ప్రతిధ్వనులు మినహా కాల్పుల మోతలు అస్సలు వినబడని కెనడా పాఠశాలల్లో ఒక్కసారిగా కాల్పుల శబ్దాలు రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.20 గంటలకు ఈ ఘటన జరిగింది. కాల్పులు మొదలుకాగానే పోలీసులకు సమాచారం వెళ్లింది. వాళ్లు కేవలం రెండు నిమిషాల్లోనే స్కూల్‌కు వచ్చారు’’అని బ్రిటిష్ కొలంబియా ప్రజా భద్రతా మంత్రి, సొలిసిటర్ జనరల్ నైనా క్రీగర్ వెల్లడించారు. పోలీసులు వచ్చేలోపే ఆగంతకురాలు తనను తాను తీవ్రంగా గాయపర్చుకుని చనిపోయింది. ఆమె మృతదేహాన్ని పాఠశాలలో పోలీసులు గుర్తించారు. ఆగంతకురాలి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. దాడికి కారణాలను త్వరలోనే వెల్లడిస్తామని ది రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ సూపరింటెండెంట్ కెన్ ఫ్లాయిడ్ చెప్పారు. ‘బ్రౌన్ రంగు జుట్టు ఉన్న సాయుధురాలు’’అని మాత్రమే పేర్కొన్నారు. స్కూల్‌కు ఆమెకు ఉన్న సంబంధం ఏంటనేది తెలియరాలేదు. ఘటన జరిగిన పాఠశాలలో ఏడో తరగతి నుంచి 12వ తరగతి వరకు మొత్తం 175 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నట్లు తెలుస్తోంది. టుంబ్లర్ రిడ్జ్ జనాభా 2,700 మాత్రమే. సమీప బొగ్గు పరిశ్రమకు సహాయకంగా 1981లో రాష్ట్ర ప్రభుత్వం ఈ పట్టణాన్ని నిర్మించింది. -
ఢిల్లీని ఖలిస్థాన్ చేస్తాం.. స్కూళ్లలో బాంబులు పెట్టాం
దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం రేగింది. రాజధాని పరిసర ప్రాంతాల్లోని తొమ్మిది స్కూళ్లలో బాంబులు పెట్టామంటూ ఈరోజు( సోమవారం) ఉదయం బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అఫ్జల్ గురు జ్ఞాపకార్థం ఢిల్లీ ఖలిస్థాన్ గా మార్చబోతున్నామంటూ అందులో ఉంది. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే ఆ స్కూళ్లను ఖాళీ చేయించారు.బాంబు స్క్వాడ్ బృందాలతో పాటు జాగీలాలతో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. రోహిణి ప్రాంతంలోని వెంకటేశ్వర గ్లోబల్ స్కూల్, శ్రీనివాస పురిలోని లోరిటో కాన్వెంట్ స్కూల్, సిద్దిఖీ నగర్ లోని ఇండియన్ పాఠశాలతో మరికొన్ని ఈ జాబితాలో ఉన్నాయి.అయితే ఈ మధ్య కాలంలో పాఠశాలలకు తరచుగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. జనవరి 29న రాజధానిలో ఐదు విద్యాలయాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తీరా అధికారులు తనిఖీలు చేయగా అది బెదిరింపు మెయిల్ అని తేలింది. అదే విధంగా జనవరి 28న ద్వారకా కోర్టు కాంప్లెక్స్ లోనూ పేలుడు పధార్థాలు పెట్టామంటూ మెయిల్ రాగా పోలిసులు తనిఖీలు చేపట్టగా అది అబద్ధమని తేలింది.అయితే దీనిపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. ఇలా బెదిరింపు మెయిల్స్ చేసిన వారి వివరాలు ఆరా తీస్తున్నామని తెలిపారు. నిందితులను గుర్తించిన అనంతరం వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. -
పాఠశాలలో క్షుద్రపూజల కలకలం
చౌడేపల్లె: అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలంలోని కాగతి ప్రాథమికోన్నత పాఠశాలలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. పాఠశాలలో 94మంది విద్యార్థులు చదువుకొంటున్నారు. సంక్రాంతి సెలవులు ముగియడంతో సోమవారం విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చారు. ఆదివారం రాత్రి మౌని అమావాస్య సందర్భంగా గ్రామంలోని కొందరు పాఠశాల వంట గది సమీపంలో ముగ్గుపోసి, నిమ్మకాయలు కోసి, తాంబూలం పెట్టి, అక్షింతలు, పసుపు, కుంకుమ చల్లి తాంత్రిక పూజలు చేసినట్లు గుర్తించి భయాందోళనకు గురయ్యారు. 6 నెలలుగా గుర్తు తెలియని వ్యక్తులు తరగతి గదుల వరండాలో మల, మూత్ర విసర్జన చేయడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. గ్రామస్తులు, యువత సహకారంతో పాఠశాలకు సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేశారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. -
క్రీస్తుపూర్వం బడి... నేటికీ ఉంది తెలుసా?
పిల్లలూ! మీ స్కూల్ కట్టి ఎన్నేళ్లయ్యింది? పదేళ్లు, ఇరవై ఏళ్లు..మహా అయితే యాభై ఏళ్లు. అయితే వేల సంవత్సరాల క్రితమే ఉన్న బడి గురించి తెలుసా? మరింత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, నేటికీ అది నడుస్తోంది. అందులో విద్యార్థులు చదువుకుంటున్నారు. అదే చైనా దేశంలోని చాంటూ షూషే ఉన్నత పాఠశాల.ఈ పాఠశాలను క్రీ.పూ.143–141 సంవత్సరాల మధ్య హాన్ రాజవంశపు గవర్నర్ వెన్ వెంగ్ నిర్మించారు. చైనాలో స్థానిక ప్రభుత్వం నిర్మించిన మొట్టమొదటి ప్రభుత్వ పాఠశాల ఇదే. దీన్ని మొదట రాళ్లతో నిర్మించారు. అందుకే దీనికి ‘షూషే’ అంటారు. అంటే ’రాతి గది’ అని అర్థం. ఈ పాఠశాలను వెన్వెంగ్ షూషే అని కూడా పిలుస్తారు. చరిత్రలో నిలిచిన హాన్ రాజవంశ పండితుడు సిమా జియాంగ్రు ఈ పాఠశాలలోనే చదువుకున్నారు. అనంతరం ఈ పాఠశాల అగ్నిప్రమాదంలో ధ్వంసమైంది. ఆపై క్రీ.శ.199లో పునర్నిర్మించారు. 17వ శతాబ్దంలో మింగ్ రాజవంశం పతనమైనప్పుడు జాంగ్ జియాన్ జాంగ్ యొక్క తిరుగుబాటు దళం ఈ బడిని నాశనం చేసింది.1661లో క్వింగ్ రాజవంశం అదే ప్రదేశంలో బడిని తిరిగి స్థాపించింది. తరువాత కాలంలో సిచువాన్ విశ్వవిద్యాలయంగా మారిన జిన్జియాంగ్ అకాడమీ 1740లో ఈ పాఠశాలలోనే స్థాపించారు.1902లో ప్రవేశపెట్టిన కొత్త విద్యావిధానంలో ఇది ‘చెంగ్డు ఫుక్సు చెంగ్డు నార్మల్ స్కూల్’గా మారింది. ఆ తర్వాత 1904లో ఇది చెంగ్డు మిడిల్ స్కూల్‌గా మారింది. 1940లో దీన్ని చెంగ్డు షూషే మిడిల్ స్కూల్‌గా మార్చారు. 1948 మధ్యలో దేశవ్యాప్తంగా ఉన్న మాధ్యమిక పాఠశాలలకు ఒక నమూనాగా గుర్తించారు. 1952లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా స్థాపించిన తర్వాత ఈ పాఠశాల పేరును చెంగ్డు నంబర్ 4 మిడిల్ స్కూల్‌గా మార్చారు. చైనాలోని టాప్ 100 హైస్కూల్స్‌లో ఇదీ ఒకటిగా నేటికీ నిలబడింది. ఎంతోమంది చైనా ప్రముఖులు ఈ బడిలో చదువుకున్నారు. -
కాగ్నిబోట్ స్కూల్ తొలి వార్షికోత్సవం (ఫోటోలు)
-
విద్యార్థి ఆత్మహత్య కేసు: ‘ఆమె’ వివరణే కీలకం కానుందా?
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య కేసు ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. 16 ఏళ్ల శౌర్య పటిల్ అనే విద్యార్థి, తన స్కూల్లో టీచర్ల అవమానాలు, ఒత్తిడి కారణంగా మెట్రో స్టేషన్ నుంచి దూకి ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపుతోంది. విద్యార్థి మరణానికి దారితీసిన పరిణామాలను వెలుగులోకి తెచ్చే ప్రక్రియలో అతనిని చివరిసారిగా చూసిన దీప్షిక అనే ప్రధాన సాక్షి వివరణ పోలీసు విచారణకు కీలక ఆధారంగా మారింది.ఇ-రిక్షాలో జరిగిన బాధాకర ఘటన45 ఏళ్ల గృహిణి అయిన దీప్షిక తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె తన కుమారుడు, మరొక విద్యార్థితో మధ్యాహ్నం 2.15 గంటలకు పాఠశాల వెలుపల ఇ-రిక్షాలో ఎక్కారు. కొద్దిసేపటికి అదే వాహనంలో ఆ విద్యార్థి కూడా వారితో చేరాడు. ప్రారంభం నుండి అతడు తీవ్రంగా ఆందోళనలో ఉన్నట్లుగా కనిపించాడని ఆమె తెలిపింది. ఏడాది పొడవునా హింసించారు: విద్యార్థి వేదనఆ విద్యార్థిని ఎందుకు ఏడుస్తున్నావని తాను అడిగినప్పుడు సదరు విద్యార్థి పాఠశాలలో అవమానాలు, మందలింపులు ఎదురవుతున్నాయని, ఏడాది అంతా ఒత్తిడి చేస్తూ ప్రతి చిన్న తప్పులకు కూడా తన తల్లిదండ్రులను పదేపదే పిలిపించారని వేదనతో చెప్పాడని ఆమె వెల్లడించింది. అందులో ప్రధానంగా నలుగురు ఉపాధ్యాయుల పేర్లు ప్రస్తావిస్తూ వారి వల్లే నేను ఇబ్బందులు పడుతు న్నట్లు తనకు చెప్పినట్లు దీప్షిక అనే మహిళ స్పష్టం చేసింది. తరచుగా పాఠశాలకు వచ్చే క్రమంలో తాను భరించలేని ఒత్తిడికి గురయ్యానని కూడా విద్యార్థి చెప్పినట్లు నివేదికలో ఆమె పేర్కొంది.ఆమె దిగేటప్పుడు విద్యార్థి వద్ద ప్రయాణానికి డబ్బు లేకపోవటంతో రూ.10 ఇచ్చిందని, అతను ధన్యవాదాలు చెప్పి వెళ్లిపోయిన కాసేపటికి ఈ విషాదాంతం వెలుగులోకి వచ్చినట్లు ఆమె తెలిపింది.సూసైడ్ నోట్లో వేధింపుల ఆరోపణలుపోలీసుల చేతిలో ఉన్న విద్యార్థి వ్యక్తిగత నోట్లో ఉపాధ్యాయుల చేత అవమానాలు ఎదుర్కొన్న క్రమాన్ని వెల్లడించాడు.. కొన్ని నెలలుగా తనపై కొనసాగిన వేధింపుల పర్వాన్ని వివరించాడు. అందులో నలుగురు ఉపాధ్యాయుల పేర్లు కూడా రాసినట్లు పోలీసులు స్పష్టం చేశారు. పోలీసు చర్యలు, పాఠశాల స్పందనవిద్యార్థి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనతో ముడిపడినట్లు ఆరోపణులు ఎదుర్కొంటున్ననలుగురు ఉపాధ్యాయులను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది స్కూల్ యాజమాన్యం. -
రెండు రోజుల్లో ఇద్దరు.. మరో విద్యార్థిని ఆత్మహత్య
ముంబై: ఢిల్లీలో విద్యార్థి శౌర్య పాటిల్ మృతి ఘటన మరువక ముందే మహారాష్ట్రలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్రలో ఎనిమిదో తరగతి విద్యార్థిని(13) పాఠశాల భవనంలోని మూడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, ఉపాధ్యాయుల వేధింపుల కారణంగానే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకుందని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు.ఈ ఘటనపై సీఐ సందీప్ భారతీ తెలిపిన వివరాల ప్రకారం.. జల్నా నగరంలోని CTMK గుజరాతీ విద్యాలయంలో ఆరోహి దీపక్ బిట్లాన్(13) ఎనిమిదో తరగతి చదువుతోంది. ప్రతీరోజు మాదిరిగానే ఆమె.. శుక్రవారం పాఠశాలకు వచ్చింది. అనంతరం, ఉదయం 7:30 గంటల ప్రాంతంలో పాఠశాల భవనంలోని మూడవ అంతస్తు నుంచి దూకింది. దీంతో, వెంటనే ఆమెను ప్రైవేటు ఆసుపత్రికి తరలించి తర్వాత.. సివిల్ ఆసుపత్రికి తరలించారు. పాఠశాల యాజమాన్యం ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకున్నారు. కానీ, అప్పటికే బాధితురాలు చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. పాఠశాలలో ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదన్నారు.మరోవైపు, బాధితురాలు తల్లిదండ్రులు తమ బిడ్డ మరణంపై మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల నిరంతర వేధింపులు, చిత్రహింసల కారణంగానే మా కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. చాలా రోజులుగా ఆమె ఆవేదనతో ఉంది. కానీ, తను ఇలా ఆత్మహత్య చేసుకుంటుందని ఊహించలేదు. మాకు న్యాయం కావాలి. మా బిడ్డను వేధించిన పాఠశాల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి. ఇక, విద్యార్థిని మృతిపై పాఠశాల ప్రిన్సిపాల్ స్పందిస్తూ.. ఆమె మృతి విషాదకరమని అన్నారు. దీనిపై దర్యాప్తునకు పూర్తిగా సహకరించనున్నట్టు తెలిపారు. పోలీసులు తమ విచారణను పూర్తి చేసిన తర్వాతే వాస్తవాలు స్పష్టంగా తెలుస్తాయని అన్నారు.#WATCH | Jalna, Maharashtra: Sadar Police Inspector Sandeep Bharti says, "This morning, around 7:30-8 o'clock, information was received about a 13-year-old schoolgirl jumping from the school roof and committing suicide. Investigation is underway. Preliminary investigation is… pic.twitter.com/TqNohmAL0R— ANI (@ANI) November 21, 2025 -
Gadwal District: పర్దిపురం గ్రామంలో బస్సు ఆపడం లేదంటూ రోడ్డుపై విద్యార్థుల ధర్నా
-
ఈ బడి నిండా బోసినవ్వుల అవ్వలే!
అక్కడి బడిలో చదివేది అంతా 60 నుంచి 90 ఏళ్ల వయసు మధ్య ఉన్న అవ్వలే. అందరూ గులాబీ రంగు చీరలు యూనిఫామ్‌లా ధరించి.. స్కూల్ బ్యాగులతో హుషారుగా క్లాసులకు హాజరవుతుంటారు. పాఠాలు వింటూనే మధ్య మధ్యలో తమకు వచ్చిన.. నచ్చిన పాటలు పాడుకుంటూ, డ్యాన్సులు వేసుకుంటూ హుషారుగా గడుపుతుంటారు. అందుకే ఈ అవ్వల బడి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. తమ చిన్నతనంలో చదువుకోలేకపోయామే అన్న బాధలో ఉన్న అవ్వలే వీళ్లంతా. అలాంటి వాళ్లు తమ కలను నెరవేర్చుకునేందుకు వీలుగా యోగేంద్ర బంగార్ అనే వ్యక్తిని ఈ బడిని స్థాపించారు. నిత్య విద్యార్థి అనే మాటకు వందకు వంద శాతం న్యాయం చేసేందుకు వాళ్లంతా బడి బాట పట్టి ఓనమాలు దిద్దుతున్నారు. మహారాష్ట్రలోని ముర్బాద్ సమీపంలోని ఫాంగ్నే గ్రామంలో ఉంది ఈ అవ్వల బడి. ఇక్కడ ప్రతి శనివారం, ఆదివారం ఈ దృశ్యం కనిపిస్తుంది. చేతిలో స్కూల్ బ్యాగులు పట్టుకుని నవ్వుతూ క్లాసులకు హాజరవుతుంటారు వాళ్లంతా. అజ్జిబాయ్ చీ శాలా(Aajibai Chi Shala)గా పేరున్న ఈ బడిని.. ఉచితంగా ప్రాథమిక విద్యను అందిస్తున్నారు. విద్యకు వయస్సు అడ్డుకాదు అనే ఫిలాసఫీని యోగేంద్ర ఇక్కడ అన్వయింపజేశారు. ఈ బడి నిండా బోసినవ్వులు అవ్వలు.. చదువు పట్ల తపనతో నేర్చుకోవడం అందరినీ మంత్ర ముగ్ధుల్ని చేస్తోంది. ఏ వయస్సులోనైనా కొత్తగా నేర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ విద్య అందుబాటులో ఉండాలి అనే సందేశంతో ఈ అద్భుత దృశ్యాలను చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.“आजीबाईची शाळा” (Aajibai chi shala) या वाक्प्रचाराचा अर्थ आहे ‘आजीबाईंसाठीची शाळा’. याचा उपयोग अशा एका उपक्रमासाठी केला जातो, जिथे ६० ते ९० वयोगटातील महिलांना शिकण्याची संधी मिळते, ज्यामुळे त्यांची दीर्घकाळापासूनची शिक्षणाची स्वप्ने पूर्ण होऊ शकतात.📍 मुरबाड, महाराष्ट्र… pic.twitter.com/ieKteWnz9r— बृहन्महाराष्ट्र मराठी मंडळ (@RetweetMarathi) November 12, 2025ఈ వీడియోపై నెటిజన్లు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.‘‘ సోషల్ మీడియాలో నేను చూసిన అత్యుత్తమ దృశ్యం అని ఒకరు కామెంట్ చేయగా.. ఇది చూసినప్పుడు నా హృదయం ఆనందంతో నిండిపోయింది అని మరొకరు.. దేవుడా.. చాలా ఆనందంగా ఉంది’’ అని మరొకరు కామెంట్లు చేశారు.


