క్రీస్తుపూర్వం బడి... నేటికీ ఉంది తెలుసా? | first public school built by a local government in China | Sakshi
Sakshi News home page

క్రీస్తుపూర్వం బడి... నేటికీ ఉంది తెలుసా?

Dec 20 2025 1:05 PM | Updated on Dec 20 2025 1:27 PM

first public school built by a local government in China

పిల్లలూ! మీ స్కూల్‌ కట్టి ఎన్నేళ్లయ్యింది? పదేళ్లు, ఇరవై ఏళ్లు..మహా అయితే యాభై ఏళ్లు. అయితే వేల సంవత్సరాల క్రితమే ఉన్న బడి గురించి తెలుసా? మరింత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, నేటికీ అది నడుస్తోంది. అందులో విద్యార్థులు చదువుకుంటున్నారు. అదే చైనా దేశంలోని చాంటూ షూషే ఉన్నత పాఠశాల.

ఈ పాఠశాలను క్రీ.పూ.143–141 సంవత్సరాల మధ్య హాన్‌ రాజవంశపు గవర్నర్‌ వెన్‌ వెంగ్‌ నిర్మించారు. చైనాలో స్థానిక ప్రభుత్వం నిర్మించిన మొట్టమొదటి ప్రభుత్వ పాఠశాల ఇదే. దీన్ని మొదట రాళ్లతో నిర్మించారు. అందుకే దీనికి ‘షూషే’ అంటారు. అంటే ’రాతి గది’ అని అర్థం. ఈ పాఠశాలను వెన్‌వెంగ్‌ షూషే అని కూడా పిలుస్తారు. చరిత్రలో నిలిచిన హాన్‌ రాజవంశ పండితుడు సిమా జియాంగ్రు ఈ పాఠశాలలోనే చదువుకున్నారు. అనంతరం ఈ పాఠశాల అగ్నిప్రమాదంలో ధ్వంసమైంది. ఆపై క్రీ.శ.199లో పునర్నిర్మించారు. 17వ శతాబ్దంలో మింగ్‌ రాజవంశం పతనమైనప్పుడు జాంగ్‌ జియాన్‌ జాంగ్‌ యొక్క తిరుగుబాటు దళం ఈ బడిని నాశనం చేసింది.

1661లో క్వింగ్‌ రాజవంశం అదే ప్రదేశంలో బడిని తిరిగి స్థాపించింది. తరువాత కాలంలో సిచువాన్‌ విశ్వవిద్యాలయంగా మారిన జిన్జియాంగ్‌ అకాడమీ 1740లో ఈ పాఠశాలలోనే స్థాపించారు.1902లో ప్రవేశపెట్టిన కొత్త విద్యావిధానంలో ఇది ‘చెంగ్డు ఫుక్సు చెంగ్డు నార్మల్‌ స్కూల్‌’గా మారింది. ఆ తర్వాత 1904లో ఇది చెంగ్డు మిడిల్‌ స్కూల్‌గా మారింది. 1940లో దీన్ని చెంగ్డు షూషే మిడిల్‌ స్కూల్‌గా మార్చారు. 1948 మధ్యలో దేశవ్యాప్తంగా ఉన్న మాధ్యమిక పాఠశాలలకు ఒక నమూనాగా గుర్తించారు. 1952లో పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా స్థాపించిన తర్వాత ఈ పాఠశాల పేరును చెంగ్డు నంబర్‌ 4 మిడిల్‌ స్కూల్‌గా మార్చారు. చైనాలోని టాప్‌ 100 హైస్కూల్స్‌లో ఇదీ ఒకటిగా నేటికీ నిలబడింది. ఎంతోమంది చైనా ప్రముఖులు ఈ బడిలో చదువుకున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement