కుప్పకూలిన బంగారం, వెండి!.. కియోసాకి ట్వీట్ | Rich Dad Poor Dad Author Robert Kiyosaki Latest Tweet About Gold Silver And Bitcoin | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన బంగారం, వెండి!.. కియోసాకి ట్వీట్

Feb 2 2026 9:04 AM | Updated on Feb 2 2026 2:31 PM

Rich Dad Poor Dad Author Robert Kiyosaki Latest Tweet About Gold Silver And Bitcoin

ధనికులు, పేదల మధ్య ప్రధాన తేడా డబ్బు కాదు, ఆలోచనా విధానమే అంటున్నారు రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత 'రాబర్ట్ కియోసాకి'. దీనికి సంబంధించిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వాల్‌మార్ట్‌ వంటి వాటిలో సేల్స్ స్టార్ట్ చేసినప్పుడు చాలావరకు పేదవాళ్లే తండోపతండాలుగా వెళ్లి.. అవసరం ఉన్నా, లేకున్నా వస్తువులు కోనేస్తుంటారు. తక్కువ ధర అని తెలియగానే.. ఇప్పుడు పోతే ఇలాంటి అవకాశం మళ్లీ రాదనే భావనతో ఖర్చు చేస్తారు. ఇది తక్షణం మాత్రమే సంతృప్తిని ఇస్తుంది.. కానీ దీర్ఘకాల లాభం ఉండదు.

అయితే.. మార్కెట్లో క్రాష్ వచ్చినప్పుడు (షేర్స్, బంగారం, వెండి, బిట్‌కాయిన్ ధరలు తగ్గినప్పుడు) పేదవాళ్లు భయంతో తమ పెట్టుబడులను అమ్ముకుంటారు. ఇంకా పడిపోతే.. నష్టం వస్తుందనే భయమే దీనికి కారణం. ఇలాంటి సమయంలోనే ధనవంతులు కొనుగోలు చేయడానికి సిద్ధపడతారు.

ధరలు పడిపోయినప్పుడు, భవిష్యత్తులో విలువ పెరిగే ఆస్తులను తక్కువ ధరకు ధనవంతులు కొనుగోలు చేస్తారు. మార్కెట్ క్రాష్ వచ్చినా వారు భయపడరు. పైగా డబ్బును పోగు చేసి లేదా ఉన్న డబ్బుతోనే.. తెలివిగా పెట్టుబడులు పెడతారు. ఇటీవల బంగారం, వెండి, బిట్‌కాయిన్ మార్కెట్లు పడిపోవడం కూడా ఇలాంటిదే. కొందరికి ఇది నష్టం లాగా కనిపించినా, మరికొందరికి ఇది గొప్ప అవకాశం.

ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల్లో ఊహకందని మార్పు!

ధనికులు నష్టాల్లో లాభాన్ని చూస్తారు.. పేదలు భయాన్ని చూస్తారు. మార్కెట్ పైకి వెళ్లినప్పుడు కొనడం కాదు, కింద పడినప్పుడు ధైర్యంగా నిర్ణయం తీసుకోవడమే ఆర్థిక విజ్ఞానం. డబ్బు కన్నా ముందు మన ఆలోచనలు మారితేనే, మన భవిష్యత్తు మారుతుందంటున్నారు కియోసాకి.

బంగారం, వెండి & బిట్‌కాయిన్ మార్కెట్ ఇప్పుడే కుప్పకూలింది. అంటే అమ్మకానికి వచ్చింది. నేను వీటిని (గోల్డ్, సిల్వర్, బిట్‌కాయిన్) కొనడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు ఏమి చేయబోతున్నారు? అంటూ కియోసాకి ట్వీట్ పూర్తి చేశారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఎక్కడైనా పెట్టుబడులు పెట్టేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని నిపుణులు చెబుతారు. కాబట్టి ఈ విషయంలో తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి.

Advertisement
 
Advertisement
Advertisement