ముంబై: మహారాష్ట్రలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ అకాల మరణం తర్వాత మరాఠా రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు అంగీకరించారు. నేడు ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోవైపు.. అజిత్ కుమారుడు పార్థ్ పవార్‌కు బంపరాఫర్ వస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
అజిత్ పవార్ మరణం తర్వాత మహారాష్ట్ర రాజకీయాల గురించి రోజుకో విషయం బయటకొస్తుంది. తాజాగా ఆయన పెద్ద కుమారుడు పార్థ్ పవార్ రాజ్యసభలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఆయన తల్లి సునేత్రా పవర్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న నేపథ్యంలో ఆమె స్థానంలో రాజ్యసభకు వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, పార్థ్ పవార్.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మావల్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. అయితే, ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు.
ఇదిలా ఉండగా.. అజిత్ పవార్ ఆకస్మిక మరణంతో ఆయన స్థానాన్ని సతీమణి సునేత్ర పవార్‌కు అప్పగించాలని కూటమి పెద్దలు నిర్ణయించారు. ఈ మేరకు దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు ఇతర కూటమి నేతలు సునేత్ర పవార్‌తో చర్చలు జరిపారు. ఆ చర్చలు విజయవంతం కావడంతో ఆమె ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేశారు. సునేత్ర పవార్ గతంలో బారామతి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు. అయినప్పటికీ ఆమెకు స్థానికంగా మంచి పట్టుంది. అజిత్ పవార్ వర్గం ఆమెను ఉప ముఖ్యమంత్రిగా తీసుకురావడం ద్వారా మహిళా నాయకత్వానికి ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా, బారామతి ప్రాంతంలో తమ బలాన్ని మరింతగా పెంచుకోవాలని చూస్తోంది. ఇక, సునేత్రా నిర్ణయంతో అజిత్ పవార్ మరణం తర్వాత ఎన్‌సీలోని రెండు వర్గాలు ఏకమవుతాయన్న ప్రచారానికి తెర పడినట్లయింది.
సునేత్ర రికార్డు
మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక మహిళ ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టటడం ఇదే తొలి సారి. 1978వ సంవత్సరంలో రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ప్రారంభమైనప్పుడు ఈ పదవిని సృష్టించారు. అయితే ఇప్పటి వరకు ఏ మహిళా నాయకురాలు కూడా ఈ హోదాలో పని చేయలేదు. అజిత్ పవార్ మరణం తర్వాత ఆయన స్థానాన్ని భర్తీ చేయాలని ఎన్సీపీ నాయకులు గట్టిగా కోరడంతో సునేత్రా పవార్ ఇందుకు అంగీకరించారు. శనివారం ఉదయం ముంబైలో జరిగే పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఆమెను ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు. అనంతరం సాయంత్రం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది.


