న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో దేశవ్యాపంగా గ్యాస్ సిలిండర్ల సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సరిగ్గా ఇదే అదనుగా భావించిన సైబర్ నేరగాళ్లు కొత్త రకం ‘ఎల్పీజీ స్కామ్’తో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. వీరు సృష్టిస్తున్న మోసపూరిత లింకుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ పోలీసులు ప్రజలకు అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు.
ఏమిటీ గ్యాస్ స్కామ్?
ఢిల్లీ నగరంలో ఎల్పీజీ కొరత నెలకొనడంతో, వినియోగదారుల మొబైల్ ఫోన్లకు నిరంతరం ఎస్ఎంఎస్ , వాట్సాప్ సందేశాలు వస్తున్నాయి. ‘మీ ఎల్పీజీ కేవైసీ పెండింగ్‌లో ఉంది’, ‘స్టాక్ పరిమితంగా ఉంది, వెంటనే బుక్ చేసుకోండి’, ‘ఆధార్ లింక్ చేయకపోతే కనెక్షన్ కట్ అవుతుంది’ అంటూ భయపెట్టిస్తూ కేటుగాళ్లు లింకులు పంపుతున్నారు.
పోలీసులు గుర్తించిన మోసాలివే:
నకిలీ వెబ్‌సైట్లు: Indane, HP వంటి ప్రముఖ గ్యాస్ కంపెనీల పేర్లను పోలి ఉండేలా ‘bookLPGfast.com’, ‘lpg-booking.com’ వంటి వెబ్‌సైట్లను సృష్టించి అడ్వాన్స్ పేమెంట్లు వసూలు చేస్తున్నారు.
డేంజరస్ ఏపీకే (APK) ఫైల్స్: వాట్సాప్ ద్వారా గ్యాస్ బుకింగ్ యాప్స్ అంటూ ఏపీకే ఫైల్స్ పంపిస్తున్నారు. వీటిని ఇన్‌స్టాల్ చేస్తే ఫోన్‌లోని వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు నేరుగా హ్యాకర్ల చేతికి వెళ్తాయి.
ఓటీపీ మోసాలు: తక్కువ ధరకే సిలిండర్ ఇప్పిస్తామంటూ ఫోన్ చేసి, మీ ఫోన్‌కు వచ్చే ఓటీపీ లేదా పిన్ నంబర్లను అడిగి తెలుసుకుని ఖాతాలు ఖాళీ చేస్తున్నారు.
జాగ్రత్తగా ఉండండి ఇలా..
‘గ్యాస్ బుకింగ్ కోసం అనధికారిక లింకులను క్లిక్ చేయవద్దు. కేవలం గ్యాస్ ఏజెన్సీల అధికారిక వెబ్‌సైట్లు లేదా మొబైల్ యాప్స్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలి’ అని ఢిల్లీ డీసీపీ ఆశిష్ మిశ్రా సూచించారు. ఎవరైనా ఇలాంటి మోసానికి గురైతే వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని ఆయన పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ట్రంప్ కొత్త టార్గెట్ ఫిక్స్!


