ట్రంప్‌ కొత్త టార్గెట్‌ ఫిక్స్‌! | Trump now wants to take Cuba Weakened nation right now | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ కొత్త టార్గెట్‌ ఫిక్స్‌!

Mar 17 2026 7:42 AM | Updated on Mar 17 2026 7:49 AM

Trump now wants to take Cuba Weakened nation right now

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా మరో సంచలనానికి తెరలేపారు. వెనిజులాలో సైనిక తిరుగుబాటు, ఇరాన్‌తో యుద్ధం తర్వాత ఇప్పుడు అమెరికాకు అతి సమీపంలో ఉన్న క్యూబాను తన గుప్పిట్లోకి తీసుకోవాలని ట్రంప్ తన టార్గెట్‌ ఫిక్స్‌ చేసుకున్నారు. సోమవారం వైట్ హౌస్‌లో జరిగిన ప్రెస్ బ్రీఫింగ్‌లో ఆయన ఈ విషయాన్ని బహిరంగంగానే ప్రకటించడం అంతర్జాతీయంగా కలకలానికి దారి తీస్తోంది.

అదను చూసి ట్రంప్ వ్యూహం
అమెరికా విధించిన చమురు దిగ్బంధం కారణంగా క్యూబా ప్రస్తుతం తీవ్ర విద్యుత్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దేశవ్యాప్తంగా టోటల్ బ్లాక్ అవుట్ ప్రకటించడంతో ఆ ద్వీప దేశం చీకటిమయమైపోయి, అక్కడి ‍ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. సరిగ్గా ఇదే సమయాన్ని అనుకూలంగా మార్చుకోవాలని ట్రంప్ యోచిస్తున్నారు. ‘క్యూబాను ఏదో ఒక రూపంలో స్వాధీనం చేసుకోవడం మాకు దక్కే గౌరవంగా భావిస్తున్నాను. దాన్ని విముక్తం చేస్తానా? లేదా నా ఆధీనంలోకి తీసుకుంటానా అనేది నా ఇష్టం. ప్రస్తుతం ఆ దేశం చాలా బలహీనంగా ఉంది, నేనేం చేయాలనుకుంటే అది చేయగలను’ అని ట్రంప్‌ ‍వ్యాఖ్యానించారు. దీనిని విన్న క్యూబా ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళనలో కాలం గడుపుతున్నారు.
 

ఆర్థిక దిగ్బంధంతో ఉక్కిరిబిక్కిరి
గత 67 ఏళ్లుగా క్యూబాలో సాగుతున్న కమ్యూనిస్ట్ పాలనకు చరమగీతం పాడాలనే లక్ష్యంతో ట్రంప్ యంత్రాంగం క్యూబాపై ఆర్థిక ఒత్తిడిని అంతకంతకూ పెంచుతోంది. క్యూబాకు మిత్రదేశమైన వెనిజులాలో మదురో ప్రభుత్వాన్ని కూల్చివేసిన తర్వాత, క్యూబాకు చమురు సరఫరా నిలిచిపోయింది. గత మూడు నెలలుగా తమకు ఎలాంటి ఇంధన రవాణా అందలేదని క్యూబా అధ్యక్షుడు మిగ్యుల్ డియాజ్-కానెల్ ఆవేదన వ్యక్తం చేశారు.

త్వరలోనే ఒక ఒప్పందం
అమెరికాకు క్యూబా ఒక అసాధారణ ముప్పుగా మారిందని ట్రంప్ ఆరోపించారు. అయితే ఇరాన్‌తో యుద్ధం ముగిసిన వెంటనే క్యూబాతో ఒక ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని, లేదా తాము అనుకున్నది చేస్తామని ట్రంప్‌ స్పష్టం చేశారు. అయితే క్యూబా ప్రభుత్వం కూడా తమతో రాజీకి రావాలని కోరుకుంటోందని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ దిశగా నెతన్యాహు కుట్ర?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement