టీఎంసీ కొంపముంచిన ఐదు కోట్ల డీల్ | Manoj Tiwary Exposes TMCs 5 Crore Ticket Scam | Sakshi
Sakshi News home page

టీఎంసీ కొంపముంచిన ఐదు కోట్ల డీల్

May 6 2026 12:31 PM | Updated on May 6 2026 12:59 PM

Manoj Tiwary Exposes TMCs 5 Crore Ticket Scam

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 15 ఏళ్ల టీఎంసీ (టీఎంసీ) పాలన అంతమై, బీజేపీ సంచలన విజయం సాధించిన వేళ, రాజకీయ వర్గాల్లో మరో పెను ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. టీఎంసీ మాజీ మంత్రి, టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ.. మమతా బెనర్జీ పార్టీ అవినీతి బండారాన్ని బట్టబయలు చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు.

టికెట్ ధర అక్షరాలా రూ. 5 కోట్లు
2026 ఎన్నికల్లో తాను ఎందుకు పోటీ చేయలేదో తివారీ స్పష్టం చేశారు. టీఎంసీ పార్టీ ఎమ్మెల్యే టికెట్ కోసం అక్షరాలా రూ. 5 కోట్లు డిమాండ్ చేసిందని, తాను నిరాకరించానని తెలిపారు. సుమారు 70 నుంచి 72 మంది అభ్యర్థులు కోట్లు కుమ్మరించి టికెట్లు కొనుక్కున్నారని ఆరోపించారు. ఈ నేపధ్యంలోనే తాను పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించిన ఆయన.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బలవంతం మేరకే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు.

మంత్రి పదవి ఓ ‘లాలీపాప్’
తనకు ఇచ్చిన క్రీడా శాఖ సహాయ మంత్రి పదవి కేవలం ఓ ‘లాలీపాప్’ లాంటిదని, పార్టీ మీటింగ్‌లలో తన మాటకు కనీస ప్రాధాన్యత ఉండేది కాదని తివారీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలు చెప్పబోతే మమతా బెనర్జీ మధ్యలోనే అడ్డుకుని, తన దగ్గర సమయం లేదని తేల్చిచెప్పేవారని విమర్శించారు. తన నియోజకవర్గంలో డ్రైనేజీ పనుల కోసం తాను సొంత జేబులోంచి డబ్బులు ఖర్చు పెట్టానని, కానీ కొందరు నేతలు అభివృద్ధి పనులను సైతం అడుగడుగునా అడ్డుకున్నారని ఆయన మండిపడ్డారు.

క్రీడల గురించి కనీస జ్ఞానం లేదు
క్యాబినెట్ క్రీడా మంత్రి అరూప్ బిశ్వాస్‌కు క్రీడల గురించి ఏబీసీడీలు కూడా తెలియవని మనోజ్ తివారీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన ఫోటోలు పత్రికల్లో రావడం చూసి తట్టుకోలేక, క్రీడా కార్యక్రమాలకు తనను పిలవడం మానేశారని ఆరోపించారు. అవకతవకలు జరుగుతాయని ముందే ఊహించి, మెస్సీ పర్యటన లాంటి కార్యక్రమాలకు తాను ఉద్దేశపూర్వకంగానే దూరంగా ఉన్నానని చెప్పారు. రాజకీయాలకు స్వస్తి పలికిన తివారీ, ఇకపై బెంగాల్ క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: ‘వేరే దిక్కులేక ఓటేశారు’: ఎన్ఎస్ఎస్ సంచలన వ్యాఖ్యలు

Advertisement
 
Advertisement
Advertisement