ఒహియో: అమెరికా రాజకీయాల్లో భారత సంతతి నేత, రిపబ్లికన్ పార్టీ నాయకుడు వివేక్ రామస్వామి మరోసారి సంచలనం సృష్టించారు. ఒహియో రాష్ట్ర గవర్నర్ అభ్యర్థిత్వానికి జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, నవంబర్‌లో జరిగే తుది సమరానికి సమరశంఖం పూరించారు. బయోటెక్ వ్యాపారవేత్త అయిన వివేక్ రామస్వామి మంగళవారం జరిగిన రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో తన ప్రత్యర్థి, వ్యాపారవేత్త కేసీ పుచ్‌పై భారీ మెజారిటీతో గెలుపొందారు.
ఈ విజయం దరిమిలా డెమొక్రాటిక్ పార్టీ తరఫున ఏకగ్రీవంగా నామినేట్ అయిన ఒహియో డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ మాజీ డైరెక్టర్ ఎమీ ఆక్టన్‌తో ఆయన నేరుగా తలపడనున్నారు. అమెరికా రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన ఈ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ఘన విజయం అనంతరం వివేక్ తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘నన్ను ఇక్కడిదాకా తీసుకొచ్చిన ఓటర్లకు ధన్యవాదాలు, కానీ మన అసలు గమ్యం నవంబర్‌లో ఉంది’ అని అన్నారు. రామస్వామి గెలుపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. ‘వివేక్ యువకుడు, చాలా తెలివైనవాడు. దేశాన్ని ప్రేమించే మంచి వ్యక్తి. ఒహియోకు ఆయన గవర్నర్ అవుతారు. అతనికి నా సంపూర్ణ మద్దతు ఉంటుంది’ అని ట్రంప్ ప్రకటించారు. ప్రముఖ కన్జర్వేటివ్ నేత లారా లూమర్.. ఇది అతిపెద్ద విజయమని అభివర్ణిస్తూ, వర్ణ వివక్షతో ఆయనను అణగదొక్కాలని చూసిన వారికి ఇది చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు.
నవంబర్ సమరానికి సై
2024 అధ్యక్ష ఎన్నికల ప్రచారంతో జాతీయ స్థాయిలో అనూహ్యమైన క్రేజ్ సంపాదించుకున్న వివేక్ రామస్వామి, ఆ తర్వాత వ్యూహాత్మకంగా ట్రంప్ కు మద్దతు ప్రకటించారు. ప్రైమరీ దశలో రిపబ్లికన్ ప్రత్యర్థులను ఎదుర్కొంటూనే, ఆయన తన ప్రచారాన్ని ప్రధానంగా డెమొక్రాట్ అభ్యర్థి ఎమీ ఆక్టన్ లక్ష్యంగా సాగించడం విశేషం. మరోవైపు కోవిడ్-19 సంక్షోభ సమయంలో ఒహియో రాష్ట్రానికి సమర్థవంతంగా నాయకత్వం వహించిన వ్యక్తిగా ఆక్టన్ కు మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుత గవర్నర్ మైక్ డివైన్ పదవీకాలం ముగియడంతో ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇరువురు బలమైన అభ్యర్థుల మధ్య నవంబర్‌లో జరగబోయే ఈ పోరు రసవత్తరంగా మారనుంది.


