సినిమాల్లో ఒక్క అవకాశం వస్తే చాలు.. జీవితం మారిపోతుందని చాలామంది అనుకుంటారు. కానీ తమిళ నటుడు మారిముత్తు జీవితం చూస్తే పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుందని అర్థమవుతుంది. ఒకప్పుడు వెండితెరపై నటుడిగా మెరిసిన ఆయన.. ఇప్పుడు కుటుంబాన్ని పోషించుకునేందుకు ఆటో నడుపుతున్నారు. ఎం. శశికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం సుబ్రమణ్యపురం 2008లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులో అనంతపురం 1980 పేరుతో ఈ సినిమా విడుదలైంది. శశికుమార్, జై, స్వాతి తదితరులు నటించిన ఈ చిత్రంలో మారిముత్తు కూడా కీలక పాత్రలో కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే సినిమా విజయవంతమైనప్పటికీ ఆయనకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.
మదురైలో జన్మించి..
మదురైలో జన్మించిన మారిముత్తు చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా మూడో తరగతి వరకే చదువుకున్నట్లు సమాచారం. చిన్నప్పటి నుంచే వివిధ పనులు చేస్తూ జీవనం సాగించారు. రేడియో రిపేర్ షాప్‌లోనూ పనిచేశారు. అనంతరం సినిమా అవకాశాల కోసం చెన్నై వెళ్లారు.అక్కడ ఓ సినిమా చిత్రీకరణ సమయంలో చిత్రబృందం మారిముత్తు ఫొటో తీసుకుంది. కొద్ది రోజుల తర్వాత ఆడిషన్‌కు పిలవడంతో ఆయన సినీ ప్రయాణం మొదలైంది. అలా సుబ్రమణ్యపురంలో నటించే అవకాశం దక్కింది.
అయితే ఆ తర్వాత ఆశించిన అవకాశాలు రాకపోవడంతో కుటుంబ పోషణ కోసం ఆటో నడపడం మొదలుపెట్టారు. ఇలా ఆటో నడుపుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమాల్లో నటించిన వ్యక్తి.. జీవనం కోసం ఆటో నడపడం చూసి పలువురు ఆయన పట్టుదలను ప్రశంసిస్తున్నారు. మళ్లీ సుబ్రమణ్యపురం 2 వంటి సినిమాలో మంచి పాత్ర దక్కుతుందని మారిముత్తు ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.


