న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని కారకోరం శ్రేణిలో ఉన్న బ్రాడ్ పీక్‌పై సంభవించిన భారీ హిమపాతానికి కొద్ది క్షణాల ముందు ప్రముఖ బ్రిటీష్-నేపాల్ పర్వతారోహకుడు నిర్మల్ ‘నిమ్స్’ పుర్జా, ఆయన బృందానికి సంబంధించిన చివరి ఫోటో ఆన్‌లైన్‌లో వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్‌కు చెందిన ‘కరకోరం విజన్’ అనే టూర్ ఆపరేటర్ సంస్థ ఈ చిత్రాన్ని షేర్ చేస్తూ, 8,051 మీటర్ల ఎత్తైన బ్రాడ్ పీక్‌పై జూలై 30న ఈ ప్రమాదం జరగడానికి కొద్దిసేపటి ముందు ఇది కెమెరాలో నిక్షిప్తమైందని వెల్లడించింది.
ఈ ఫోటోతో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను కూడా పోస్ట్ చేసిన ఆ సంస్థ.. బేస్ క్యాంప్ నుంచి గమనిస్తున్న సమయంలో 10 మంది అంతర్జాతీయ పర్వతారోహకుల బృందం శిఖరం వైపు ముందుకు సాగుతున్న దృశ్యాలు ఇందులో ఉన్నాయని పేర్కొంది. ‘మా బృందం జూలై 30న ఈ దృశ్యాలను రికార్డు చేసింది. బేస్ క్యాంప్ నుంచి చూస్తున్న మాకు ప్రపంచ ప్రఖ్యాత పర్వతారోహకుడు నిర్మల్ ‘నిమ్స్’ పుర్జాతో సహా 10 మంది పర్వతారోహకులు పర్వతాన్ని అధిరోహిస్తున్న తీరు కనిపించింది’ అని కరకోరం విజన్ తెలిపింది. అయితే ఆ వెంటనే పర్వతంపై భారీ హిమపాతం విరుచుకుపడిందని వెల్లడించింది. ‘మంచు తొలగిపోయిన తర్వాత మేం ఎగువ వాలులను భయంతో పరిశీలించాం. అక్కడ ఎవరూ కనిపించలేదు. బ్రాడ్ పీక్‌పై ఇదొక పెద్ద విషాదం’ అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.
సుమారు 5,700 మీటర్ల ఎత్తులో సంభవించిన ఈ హిమపాతం కారణంగా 43 ఏళ్ల పుర్జాతో పాటు ఆయన అంతర్జాతీయ యాత్ర బృందంలోని 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విపత్తు సంభవించిన వెంటనే ఆ బృందంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఆదివారం కఠినమైన వాతావర పరిస్థితుల నడుమ రెస్క్యూ సిబ్బంది పుర్జా మృతదేహాన్ని వెలికితీశారు. అలాగే మరో ఇద్దరు నేపాల్ పర్వతారోహకులు, ఒక చైనా జాతీయునితో సహా నలుగురి మృతదేహాలను కిందకు రవాణా చేస్తున్నట్లు తెలిపారు. మరో ఎత్తయిన ప్రాంతంలో మరో మృతదేహం కూడా గుర్తించామని, అయితే అత్యంత ప్రమాదకరమైన భూభాగ పరిస్థితులరీత్యా ప్రస్తుతానికి అక్కడ నుంచి మృతదేహాన్ని వెలికితీసే ప్రయత్నం చేయడం కష్టమని తెలిపారు.
ఇది కూడా చదవండి: రోడ్డు పక్కన.. ప్లాస్టిక్ కవర్లో నవజాత శిశువు


