జంతర్ మంతర్ వద్ద నీట్ నిరసనల సందర్భంగా విద్యార్థులపై జరిగిన పోలీసు చర్య వ్యవహారం పార్లమెంట్‌ను కుదిపేస్తోంది. ఘటనపై హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలంటూ ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. దీంతో పార్లమెంట్ సమావేశాల్లో వరుసగా వాయిదాల పర్వం(ఇవాళ కూడా) కొనసాగుతోంది. అయితే అమిత్ షా గైర్హాజరీని కాంగ్రెస్ సహా విపక్షాలు ప్రధాన అస్త్రంగా చేసుకోగా.. బీజేపీ మాత్రం ఆరోపణలను ఖండిస్తోంది.
విద్యార్థుల నిరసనల సమయంలో పోలీసులు అనవసర బల ప్రయోగం జరిపారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా చలో సంసద్ ర్యాలీ సమయంలో లాఠీలు, పెల్లెట్ గన్స్ వినియోగించారనే ఆరోపణలపై కేంద్రం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. భద్రతా బలగాలు కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటాయని, అందుకే ఘటనకు బాధ్యత హోంమంత్రి అమిత్ షాదేనని విపక్ష నేతలు అంటున్నారు.
“అమిత్ షా సమాధానం చెప్పాలి”
పరీక్షల సంస్కరణ బిల్లు చర్చ సందర్భంగా లోక్‌సభలో రాహుల్ గాంధీ ఈ అంశాన్ని ప్రస్తావించారు. విద్యార్థులపై పోలీసు చర్యకు ఎవరు ఆదేశాలు ఇచ్చారని ప్రశ్నించిన ఆయన.. హోంమంత్రి అనుమతి లేకుండా ఇలాంటి పరిణామాలు ఎలా చోటుచేసుకున్నాయని నిలదీశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం.. వారిపై బలప్రయోగం చేసిందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత అమిత్ షాపై ఉందని పేర్కొంటూ.. ఆయన సభకు రాకపోవడంపై కూడా విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

కేంద్రం వాదన ఏంటి?
అయితే ప్రతిపక్షాల ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చుతోంది. నిరసనల సమయంలో పోలీసులు సంయమనం పాటించారని, ఎలాంటి అనవసర బలప్రయోగం జరగలేదని చెబుతోంది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు.. రాహుల్ గాంధీ ఆరోపణలను ఖండిస్తూ ఆధారాలు చూపాలని సవాల్ చేశారు. సమస్యను పరిష్కరించకుండా విపక్షాలు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నాయని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.
మళ్లీ రంగంలోకి CJP
మరోవైపు నీట్ నిరసనలకు నాయకత్వం వహించిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కూడా తన డిమాండ్లపై వెనక్కి తగ్గడం లేదు. నిరసనకారులపై నమోదైన కేసులను ఎత్తివేయాలన్న డిమాండ్ ఇంకా నెరవేరలేదని ఆ పార్టీ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 5న కీలక సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు వెల్లడించింది. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు కేంద్రానికి మరో సవాల్‌గా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కేసుల ఉపసంహరణ, విద్యార్థులపై చర్యలపై స్పష్టత ఇవ్వకపోతే ఆందోళనలను మళ్లీ ఉధృతం చేసే అవకాశం ఉందన్న సంకేతాలు వస్తున్నాయి.
షా మౌనం చర్చనీయాంశం
నీట్ నిరసనల వ్యవహారంలో ఇప్పటివరకు అమిత్ షా ప్రత్యక్షంగా స్పందించకపోవడం రాజకీయంగా చర్చకు దారితీసింది. ఆయన గైర్హాజరీని విపక్షాలు ప్రశ్నిస్తుండగా.. ప్రభుత్వం మాత్రం ప్రత్యేక కారణాన్ని వెల్లడించలేదు. మరోవైపు CJP తదుపరి కార్యాచరణ ప్రకటించనున్న నేపథ్యంలో.. ఈ వివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
విద్యార్థులపై పోలీసు చర్యల ఆరోపణలు.. అమిత్ షా మౌనం.. కేసుల ఎత్తివేత డిమాండ్.. ఈ మూడు అంశాలు కేంద్రంపై ఒత్తిడిని పెంచుతున్నాయి. ఇప్పుడు పార్లమెంట్‌లో హోంమంత్రి స్పందిస్తారా? రాజకీయ రగడ మరింత కొనసాగుతుందా?? అన్నదే ఆసక్తికరంగా మారింది.


