ఢిల్లీ: జంతర్‌మంతర్‌లో ఇటీవల జరిగిన విద్యార్థులు, సీజేపీ నిరసన కార్యక్రమంపై బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. నిరసనలో పాల్గొన్న వారిలో విద్యార్థుల కంటే "పంక్చర్ వేసేవాళ్లు, తాళాల మేస్త్రీలు" ఎక్కువ మంది ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపైనా తీవ్ర విమర్శలు చేశారు.
తాజాగా మీడియాతో మాట్లాడిన బిధూరి మాట్లాడుతూ.. ‘జంతర్‌మంతర్‌లో జరిగిన నిరసనలో విద్యార్థుల కంటే పంక్చర్ వేసేవాళ్లు, తాళాల మేస్త్రీలే ఎక్కువ మంది ఉన్నారు. పంక్చర్ వేసేవాళ్లు, తాళాల మేస్త్రీలు ఎవరనేది మీకు తెలుసు’ అని అన్నారు. అలాగే, ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వారిని ఉద్దేశిస్తూ.. "ఏ తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను దేశ ప్రధాని గురించి అలాంటి భాష మాట్లాడమని ప్రోత్సహించరు. మోదీ జీని దూషించే వారు పంక్చర్ వేసేవాళ్ల పిల్లలు లేదా వారి కుటుంబాలకు చెందినవారే" అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
నీట్ (NEET) అంశాన్ని అడ్డం పెట్టుకుని కొందరు సంఘ వ్యతిరేక శక్తులు జనరేషన్-జెడ్ (Gen Z) యువతను తప్పుదోవ పట్టించాయని బిధూరి ఆరోపించారు. ‘నీట్ సమస్య పేరుతో కొందరు సంఘ వ్యతిరేక శక్తులు జంతర్‌మంతర్ వద్ద యువతను సమీకరించాయి. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడం, పార్లమెంట్‌పై దాడికి ప్రయత్నించడం, దేశంలో అశాంతి సృష్టించడమే వారి లక్ష్యం’ అంటూ ఆయన అన్నారు.
జెన్-జెడ్‌కు అవగాహన కల్పించాలి..
గత 12 ఏళ్లలో దేశంలో జరిగిన మార్పులు, అభివృద్ధి, అంతకుముందు 12 ఏళ్ల పరిస్థితుల గురించి యువతకు సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని బిధూరి పేర్కొన్నారు. తప్పుదోవ పట్టిన జనరేషన్-జెడ్‌ను సరైన మార్గంలోకి తీసుకురావాలి. గత 12 ఏళ్లలో దేశంలో ఏం జరిగిందో, అంతకుముందు పరిస్థితులు ఎలా ఉన్నాయో వారికి వివరించాలని అన్నారు. అయితే, రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వివాదాస్పదంగా మారే అవకాశం ఉంది. గతంలో కూడా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఈసారి కూడా నిరసనలో పాల్గొన్న వారిపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాజకీయ పార్టీల నుంచి విమర్శలు వచ్చే అవకాశముంది.


