మోదీ మంచి మనసు.. రుచికా ఎపిసోడ్‌లో బిగ్‌ ట్విస్ట్‌ | From Abuse Row to Apology: Big Twist in Modi Ruchika Episode | Sakshi
Sakshi News home page

మోదీ మంచి మనసు.. రుచికా ఎపిసోడ్‌లో బిగ్‌ ట్విస్ట్‌

Aug 1 2026 8:37 AM | Updated on Aug 1 2026 8:45 AM

From Abuse Row to Apology: Big Twist in Modi Ruchika Episode

ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యల వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జంతర్‌ మంతర్‌ నిరసనల్లో చేసిన వ్యాఖ్యలపై విమర్శలు.. కేసు ఎదుర్కొంటున్న రుచికా సింగ్‌ తాజాగా క్షమాపణలు కోరుతూ ఓ వీడియో విడుదల చేసింది. తాను చేసింది ముమ్మాటికీ తప్పేనని అంటోంది. అదే సమయంలో రుచికా వ్యవహారంపై పరోక్షంగా ప్రధాని మోదీ స్పందించడమూ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ వెంటనే ఈ ఎపిసోడ్‌లో మరికొన్ని ట్విస్టులు వెలుగు చూశాయి.. 

ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌లో నీట్‌ పేపర్‌ లీక్‌ అంశంపై జరిగిన నిరసనల సందర్భంగా నోయిడాకు చెందిన రుచికా సింగ్‌ చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో.. కొందరు యువకులు వీడియో తీస్తుండగా రెచ్చిపోతూ ఆమె ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర భాష ఉపయోగించింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది.

ఈ వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగ పదవిలో ఉన్న ప్రధానిపై అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. సుప్రీంకోర్టు న్యాయవాది స్మృతి సింగ్‌ చందేల్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జూలై 29న నోయిడాలోని ఎక్స్‌ప్రెస్‌వే పోలీస్‌ స్టేషన్‌లో రుచికా సింగ్‌పై జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

భారతీయ న్యాయ సంహిత (BNS)లోని 352, 353(1), 356(1) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉద్దేశపూర్వకంగా అవమానించడం, ప్రజా శాంతికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం, పరువునష్టం వంటి అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. జంతర్‌ మంతర్‌ ప్రాంతం ఢిల్లీ పోలీసుల పరిధిలో ఉండటంతో కేసును ఢిల్లీ పోలీసులకు బదిలీ చేశారు.

మోదీ ఏమన్నారంటే..
ఈ వివాదం మధ్య ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. తనపై, తన దివంగత తల్లిపై చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయని చెప్పిన ఆయన.. యువత చేసిన తప్పులకు మార్పు అవకాశం ఇవ్వాలని సూచించారు. “నన్ను దూషించిన వారిని క్షమించాలనుకుంటున్నాను. పిల్లలు తప్పులు చేస్తారు. వారిని శిక్షించడం కంటే సరైన మార్గం చూపించడం సమాజం బాధ్యత” అని మోదీ అన్నారు. అవమానాలు ఏ సమస్యను పరిష్కరించవని, యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములను చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యల తర్వాతే రుచికా క్షమాపణ వీడియో బయటకు రావడం ఆసక్తికర పరిణామంగా మారింది.

చేతులు జోడించి రుచికా క్షమాపణలు
సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోలో రుచికా సింగ్‌ చేతులు జోడించి దేశ ప్రజలకు క్షమాపణలు కోరింది. “నేను చేసినది తప్పు. దేశం మొత్తానికి క్షమాపణలు చెబుతున్నాను. నాకు చాలా సిగ్గుగా ఉంది. ఇది నా మొదటి, చివరి తప్పు. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేయను” అని ఆమె చెప్పింది. తాను అక్కడ ఉన్న కొందరి ప్రభావానికి లోనై ఆ వ్యాఖ్యలు చేశానని పేర్కొంది. అయితే ఈ వీడియో ఎప్పుడు తీశారనేది స్పష్టత రావాల్సి ఉంది.

వయసుపై వివాదం
ఈ వ్యవహారంలో మరో కీలక అంశంగా రుచికా వయసు మారింది. క్షమాపణ వీడియోలో ఆమె తన వయసు 15 ఏళ్లు అని చెప్పింది. అయితే పోలీసుల ఎఫ్‌ఐఆర్‌లో ఆమె వయసు 25 ఏళ్లుగా పేర్కొనడం గమనార్హం. దీంతో ఆమె అసలు వయసు ఎంత? అనే ప్రశ్నలు తలెత్తాయి. పోలీసులు ఆమె కుటుంబ వివరాలు, నేపథ్యాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.

నేపథ్యంపై సోషల్‌ మీడియాలో చర్చ
ఇదే సమయంలో రుచికా వ్యక్తిగత నేపథ్యంపై సోషల్‌ మీడియాలో పలు వాదనలు వైరల్‌గా మారాయి. ఆమె గతంలో ఓ సెలూన్‌లో నెయిల్‌ ఆర్ట్‌ శిక్షణ కోసం వెళ్లేదని, ఆధార్‌ కార్డు అడిగిన తర్వాత అక్కడికి వెళ్లడం ఆపేసిందని ఆ సెలూన్‌ యజమాని చెప్పినట్లు కొన్ని పోస్టుల్లో పేర్కొన్నారు. అలాగే ఆమె తన పేరు వేరుగా చెప్పిందని, ఆధార్‌ వివరాలు ఇవ్వలేదని కూడా కొన్ని వాదనలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ అంశాలను అధికారికంగా ధ్రువీకరించలేదు. వాస్తవాలు పోలీసు దర్యాప్తులోనే తేలాల్సి ఉంది.

భావ ప్రకటనా స్వేచ్ఛపై చర్చ
రుచికాపై క్రిమినల్‌ కేసు నమోదు చేయడాన్ని కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP) అధికార ప్రతినిధి సౌరవ్‌ దాస్‌ ప్రశ్నించారు. అభ్యంతరకర వ్యాఖ్యలను సమర్థించలేమని చెబుతూనే.. కేవలం వ్యాఖ్యల ఆధారంగా క్రిమినల్‌ చర్యలు తీసుకోవడం భావ ప్రకటనా స్వేచ్ఛపై ప్రభావం చూపుతుందని అన్నారు. అలాంటి సందర్భాల్లో పరువునష్టం వంటి చట్టపరమైన మార్గాలను అనుసరించవచ్చని సూచించారు. అదే సమయంలో నిరసనకారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే సమయంలో సంయమనం పాటించాలని కూడా కోరారు.

రుచికా క్షమాపణలు, మోదీ స్పందన, ఆమె వయసుపై వివాదం, సీజేపీ స్పందన పోలీసుల దర్యాప్తు.. ఈ పరిణామాలతో ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. యువతకు మార్పు అవకాశం ఇవ్వాలన్న మోదీ సందేశం ఒకవైపు చర్చకు దారితీస్తుండగా.. చట్టపరమైన ప్రక్రియ మరోవైపు కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement