అయ్యో.. అయ్యో.. అయ్యయ్యో..
కాపాడబోయి.. ఆత్మరక్షణలోకి!
స్పేస్ టెలిస్కోప్ ‘స్విఫ్ట్’ రెస్క్యూ మిషన్..
చిక్కుల్లో నాసా వ్యోమనౌక ‘లింక్’.
ఎరక్కపోయి వెళ్లి ఇరుక్కుపోలేదు... రిస్క్ ఏపాటిదో తెలుసు... అంతా తెలిసే... ఆ స్పేస్ టెలిస్కోపును కాపాడటానికి వెళ్లిందొక వ్యోమనౌక. తీరా ఆ పనిలోకి దిగడానికి ముందే తానే ఆత్మరక్షణలో పడిపోయింది. రక్షించాలంటూ కేకలు పెడుతోంది! ఇప్పుడు ఆ వ్యోమనౌకను కాపాడే పనిలో తలమునకలయ్యారు శాస్త్రవేత్తలు. ఇదీ ‘నాసా’ స్పేస్ టెలిస్కోప్ ‘స్విఫ్ట్’, వ్యోమనౌక ‘లింక్’ల కథాకమామిషు!
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ 2004లో ‘నీల్ గెరెల్స్ స్విఫ్ట్ అబ్జర్వేటరీ’ని రోదసికి పంపింది. 1.5 టన్నుల బరువైన ఆ స్పేస్ టెలిస్కోప్ ప్రస్తుతం భూమి ఉపరితలానికి 200 మైళ్ల ఎత్తుకు కొద్దిగా ఎగువన కక్ష్యలో పరిభ్రమిస్తోంది. విశ్వంలో సెకన్ల వ్యవధిలోనే అపార శక్తిని విడుదల చేయగల గామా కిరణ విస్ఫోటనాలను (Gamma-ray bursts) కొన్నింటిని ‘స్విఫ్ట్’ వేధశాల తన 22 ఏళ్ల పరిశోధనల్లో పరిశీలించింది. విశ్వంలో భారీ ద్రవ్యరాశి గల నక్షత్రాలు పతనమైనప్పుడు, న్యూట్రాన్ తారల విలీనం సందర్భంగానూ ఈ తీవ్ర విస్ఫోటనాలు సంభవిస్తాయి. దృగ్గోచర కాంతితోపాటు అతినీలలోహిత, ఎక్స్-కిరణ, గామా కిరణ కాంతుల్లోనూ డేటా సేకరించగల మూడు బహుళ తరంగదైర్ఘ్య టెలిస్కోపులను ‘స్విఫ్ట్’ వినియోగిస్తుంది.

అంతరిక్షంలో మనం అప్పటివరకు చూసిన వాటిలోకెల్లా అత్యంత శక్తిమంతమైన ఓ విస్ఫోటనాన్ని 2022లో ‘స్విఫ్ట్’ గుర్తించింది. ఆ గామా కిరణ విస్ఫోటనానికి ‘బోట్’ (BOAT- Brightest Of All Time) అని ముద్దుపేరు పెట్టారు. కృష్ణబిలాలు, నక్షత్రాలు, తోకచుక్కలు తదితర ఖగోళ వస్తువుల అధ్యయనానికి కూడా నాసా ఈ స్పేస్ టెలిస్కోపును ఉపయోగించింది. నాడు 25 కోట్ల డాలర్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు రెండేళ్లపాటు మాత్రమే పనిచేస్తుందని తొలుత ప్రయోగ సమయంలో భావించినప్పటికీ రెండు దశాబ్దాల పైబడి ‘స్విఫ్ట్’ సేవలు అందిస్తోంది.
అయితే రోదసిలో ‘స్విఫ్ట్’ కక్ష్య క్రమంగా తగ్గిపోతోంది. ఆరంభంలో 2004లో భూమి ఉపరితలానికి 600 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న దాని కక్ష్య ప్రస్తుతం 360 కిలోమీటర్ల ఎత్తులోకి వచ్చింది. ప్రతి వారం రోజులకు మైలున్నర వంతున అది కిందికి జారుతోంది. ముఖ్యంగా గడచిన రెండేళ్ల వ్యవధిలో ఈ కక్ష్య తగ్గుదల వేగం అధికంగా ఉంది. ‘స్విఫ్ట్’ ఈ ఏడాది చివరికల్లా భూవాతావరణంలో ప్రవేశించి, మండిపోయే అవకాశాలు 90 శాతం దాకా ఉన్నట్టు అంచనా వేశారు. ‘స్విఫ్ట్’ను పైకి నెట్టి, కక్ష్య పెంచగలిగితే అది మరో పదేళ్లపాటు సేవలందిస్తుంది.

సమస్యలతో ‘లింక్’ వ్యోమనౌక సతమతం!
భూమ్మీద కూలిపోయేలా కిందికి జారుతున్న ‘స్విఫ్ట్’ను మరింత స్థిరత్వంతో కూడిన కక్ష్యలోకి వెళ్లేలా పైకి తోయడం ఓ అసాధారణ రెస్క్యూ మిషన్. ఇందుకోసం మూడు భారీ ‘రోబోటిక్ చేతులు’ అమర్చిన ‘లింక్’ వ్యోమనౌకను నార్త్ రోప్ గ్రమ్మన్ ఏరో స్పేస్ కంపెనీకి చెందిన ‘పెగాసస్ ఎక్స్ఎల్’ రాకెట్ సాయంతో నాసా ఈ నెల 3న దిగువ కక్ష్యకు ప్రయోగించింది. అది ఇలాంటి మిషన్ చేపట్టడం ఇదే తొలిసారి. కానీ ఇక్కడే ఓ చిక్కొచ్చిపడింది. నాసా తలచినట్టుగా పని జరగలేదు సరికదా... అసలుకే మోసం వచ్చింది! ‘స్విఫ్ట్’ను రక్షించబోయి తానే ప్రమాదంలో చిక్కుకుంది ‘లింక్’ సర్వీసింగ్ వ్యోమనౌక.
విద్యుత్ వ్యవస్థలో తలెత్తిన సమస్య కారణంగా ‘లింక్’ ప్రస్తుతం కక్ష్యలో స్థిరత్వం కోల్పోయి ప్రతి 40 సెకన్లకోసారి భ్రమణం పూర్తిచేస్తూ గిరగిరా తిరుగుతోంది. ‘లింక్’ గమన దిశను నియంత్రించే మూడు ‘రియాక్షన్ వీల్స్’లో రెండు వీల్స్ విఫలమైనట్టు ‘కాటలిస్ట్ స్పేస్ టెక్నాలజీస్’ సంస్థ నిపుణులు ప్రాథమిక పరిశీలనలో గమనించారు. ‘లింక్’ వ్యోమనౌకను డిజైన్ చేసింది ఈ సంస్థే. దీంతోపాటు ఆ నౌకలోని శీతల వాయు చోదక వ్యవస్థ కూడా పాక్షికంగా పనిచేయడంలేదని నాసా పేర్కొంది. ‘స్విఫ్ట్’ స్పేస్ టెలిస్కోపు చెంతకెళ్లి, దానితో కచ్చితత్వంతో అనుసంధానమవడంలో ఉపకరించే కీలక వ్యవస్థ ఇది. ఇవి మినహా ‘లింక్’లోని ఇతర వ్యవస్థలు బాగానే పనిచేస్తున్నాయి.

‘స్విఫ్ట్’తో అనుసంధానమై దాన్ని ‘లింక్’ రక్షించే కార్యక్రమం వాస్తవానికి ఆగస్టు తొలి వారంలో ఆరంభమవ్వాల్సివుంది. తాజా సమస్యలతో అది ఆగస్టు నెలాఖరుకు వాయిదా పడేలా ఉంది. కక్ష్య పెంపునకు ఉద్దేశించిన ‘స్విఫ్ట్ బూస్ట్ మిషన్’ వ్యయం మూడు కోట్ల డాలర్లు (రూ.286 కోట్లు). ‘లింక్’లోని విద్యుత్ చోదక థ్రస్టర్ల సాయంతో ఆ నౌకను నియంత్రణలోకి తేవడానికి కాటలిస్ట్ స్పేస్ టెక్నాలజీస్ ఇంజినీర్లు శ్రమిస్తున్నారు. ఈ పనిలో వారు సఫలమైతే రెస్క్యూ మిషన్ కొనసాగుతుంది. విఫలమైతే ‘లింక్’, ‘స్విఫ్ట్’.. రెండిటిపైనా ఆశలు వదులుకోవాల్సిందే!
-జమ్ముల శ్రీకాంత్
(Courtesy: I Love The Universe, The New York Times, The Register, ABC News, Live Science, space.com)


