వాషింగ్టన్: చదువు తరువాత అమెరికాలోనే ఉద్యోగం చేసేందుకు వీలు కల్పించే ఆప్షన్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) వీసా ఫీజు లక్ష డాలర్లు కానుందా? అవునంటోంది వాల్‌స్ట్రీట్ జర్నల్. హెచ్–1బీ వీసా ఫీజులను లక్ష డాలర్లకు పెంచేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రయత్నాలు న్యాయస్థానాల్లో బెడిసికొట్టడంతో ఇప్పుడు ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ’(డీహెచ్‌ఎస్)ఈ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
విదేశీ విద్యార్థులు అమెరికా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ తరువాత తాము చదువుకున్న సబ్జెక్టులోనే ఏడాది నుంచి మూడేళ్లు ఉద్యోగం చేసేందుకు ఈ ఓపీటీ వీసా ఉపయోగపడుతుంది. యూఎస్ యూనివర్శిటీల్లో అత్యధిక నియామకాలు చేపట్టే టెక్నాలజీ ఆధారిత కంపెనీలు హెచ్–1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి.
అయితే ఓపీటీ ఫీజు లక్ష డాలర్లకు పెంచే విషయంపై డీహెచ్‌ఎస్ ఆచితూచి ఒక ప్రకటన చేసింది. అధికారిక ప్రకటన వెలువడేంత వరకూ ఏదీ ఫైనల్ కాదని స్పష్టం చేసింది. ‘‘అందుబాటులో ఉన్న విషయాలన్నింటిపై చర్చలు జరుగుతూనే ఉంటాయి.
చట్టపరంగా ఈ దేశానికి వలస వచ్చే వ్యవస్థ సమగ్రతను కాపాడేందుకు వీటిని ఉపయోగిస్తాం’’అని అధికార ప్రతినిధి ఒకరు ప్రకటించారు. ఇతర దేశాల నుంచి గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేసుకునే వారు దరఖాస్తుతోపాటు లక్ష డాలర్ల బాండ్ ఒకటి సమర్పించేలా కూడా డీహెచ్‌ఎస్ ఆలోచన చేస్తున్నట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం తెలిపింది. దరఖాస్తుదారు అమెరికా వచ్చి పౌరసత్వం పొందిన తరువాత బాండ్ మొత్తాన్ని తిరిగి పొందవచ్చు.


