ఢిల్లీ: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వచ్చే సెప్టెంబర్‌లో భారత్‌లో జరగనున్న బ్రిక్స్ (BRICS) సదస్సుకు హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. సెప్టెంబర్ 12–13 తేదీల్లో న్యూఢిల్లీలో నిర్వహించనున్న ఈ సదస్సులో పాల్గొనేందుకు ఆయన భారత్‌కు రావచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ పర్యటనపై భారత్ లేదా చైనా ప్రభుత్వాలు ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు.
షీ జిన్‌పింగ్ భారత్‌కు వస్తే.. 2020 గాల్వాన్ లోయ ఘర్షణ తర్వాత ఆయన చేసే తొలి భారత పర్యటనగా నిలుస్తుంది. చివరిసారిగా ఆయన 2019 అక్టోబర్‌లో భారత్‌ను సందర్శించారు. ఆ తర్వాత తూర్పు లడఖ్‌లో భారత్–చైనా సరిహద్దు ఉద్రిక్తతలు రెండు దేశాల సంబంధాలను దెబ్బతీశాయి. కాగా, జిన్‌పింగ్ పర్యటనకు ముందు భారత్–చైనా మధ్య దౌత్య చర్చలు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ త్వరలో చైనాలో పర్యటించి ఉన్నత స్థాయి సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది.
అలాగే, సరిహద్దు వ్యవహారాలపై వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ (WMCC) సమావేశం, అనంతరం ప్రత్యేక ప్రతినిధుల స్థాయి చర్చలు కూడా జరగనున్నట్లు సమాచారం. ప్రత్యేక ప్రతినిధుల సమావేశంలో భారత్–చైనా సరిహద్దు వివాద పరిష్కారానికి సంబంధించిన అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. సరిహద్దు నిర్వహణ, ఉద్రిక్తతల నివారణ, పరస్పర విశ్వాసం పెంపు వంటి అంశాలపై రెండు దేశాలు ముందడుగు వేయాలని ప్రయత్నిస్తున్నాయి.
#JUSTIN: Sources: Chinese President Xi Jinping is likely to visit India in September for the BRICS Summit in New Delhi, marking his first trip to India since the COVID-19 pandemic and the Galwan border tensions, sources said. Ahead of the summit, India and China are expected to…
— India Today Global (@ITGGlobal) July 31, 2026
మోదీ–షీ భేటీపై ఆసక్తి
షీ జిన్‌పింగ్ బ్రిక్స్ సదస్సుకు హాజరైతే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశం జరిగే అవకాశముంది. ఈ భేటీలో సరిహద్దు వివాదం, ప్రాంతీయ భద్రత, ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారం వంటి కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది. అయితే, ప్రస్తుతం జిన్‌పింగ్ భారత్ పర్యటనపై అధికారిక ధృవీకరణ లేదు. ఢిల్లీ లేదా బీజింగ్ నుంచి అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే ఈ పర్యటన ఖరారైనట్లు భావించాల్సి ఉంటుంది.


