ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ దాదాపు 19 ఏళ్ల తర్వాత మళ్లీ కోల్‌కతా గడ్డపై అడుగుపెట్టారు. గతంలో తీవ్ర నిరసనలు, వివాదాల కారణంగా నగారన్ని వీడాల్సి వచ్చిన ఆమె.. శుక్రవారం కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. తిరిగి రావడంపై ఆమె ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.
‘‘ఇంటికి తిరిగొచ్చినట్లే అనిపిస్తోంది. ఇక్కడ నాకు చాలా నచ్చుతుంది’’ అంటూ కోల్‌కతాలో అడుగుపెట్టిన వెంటనే తస్లీమా స్పందించారు. చాలా కాలం తర్వాత తనకు ఎంతో అనుబంధం ఉన్న నగరానికి తిరిగి రావడం వ్యక్తిగతంగా ఎంతో ప్రత్యేకమైన సందర్భమని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఆమె రాకను బీజేపీ స్వాగతించింది. అయితే మిగతా రాజకీయ పార్టీలు మాత్రం సరైన సమయం కాదనే అంటున్నాయి.
నా అంతట నేను పోలేదు
‘‘నేను కోల్‌కతాను ఎప్పుడూ స్వచ్ఛందంగా వదిలిపెట్టలేదు. అప్పటి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నన్ను వెళ్లాల్సిన పరిస్థితి కల్పించింది. అయినా ఏదో ఒక రోజు తిరిగి వస్తాననే ఆశను ఎప్పుడూ కోల్పోలేదు’’ అని తెలిపారు. ఏళ్లు గడిచాయి.. ప్రభుత్వాలు మారాయి.. కానీ తిరిగి రావడానికి నాకు తలుపులు మాత్రం మూసే ఉన్నాయి” అని ఆమె గత అనుభవాలను గుర్తు చేసుకున్నారు.
#WATCH | Bangladeshi writer and activist Taslima Nasreen arrives in Kolkata, West Bengal pic.twitter.com/IsFSBUaZ7t
— ANI (@ANI) July 31, 2026
‘ద్విఖండితో’ పుస్తకంతో వివాదం
తస్లీమా నస్రీన్ 2007లో కోల్‌కతాను వీడాల్సి వచ్చింది. ఆమె రాసిన ఆత్మకథాత్మక పుస్తకం ‘ద్విఖండితో’పై తీవ్ర నిరసనలు చెలరేగడంతో అప్పటి పరిస్థితుల్లో ఆమె నగరాన్ని విడిచారు. అంతకుముందు బంగ్లాదేశ్‌లో కూడా మతపరమైన వివాదాల కారణంగా ఆమె తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. బంగ్లాదేశ్ నుంచి వెళ్లిపోయిన తర్వాత కోల్‌కతాను తన నివాసంగా మార్చుకున్న ఆమె.. దాదాపు పదేళ్ల పాటు అక్కడే ఉన్నారు.
అయితే 2003లో అప్పటి వామపక్ష ప్రభుత్వ హయాంలో ‘ద్విఖండితో’ పుస్తకాన్ని మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తుందనే ఆరోపణలతో నిషేధించారు.
రేపు కార్యక్రమంలో పాల్గొననున్న తస్లీమా
కోల్‌కతా పర్యటనలో భాగంగా శనివారం రవీంద్ర సదన్‌లో నిర్వహించే ఓ కార్యక్రమంలో తస్లీమా పాల్గొననున్నారు. మత మౌఢ్యానికి వ్యతిరేకంగా నిర్వహించే సాహిత్య సభకు పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం 63 ఏళ్ల తస్లీమా నస్రీన్ ఢిల్లీలో దీర్ఘకాలిక నివాస అనుమతితో ఉంటున్నారు.
తిరిగి వచ్చినా.. పాత జ్ఞాపకాల వెంట
రచనల్లో స్వేచ్ఛ, మహిళా హక్కులు, మత ఛాందసవాదంపై తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేసే తస్లీమా నస్రీన్‌కు కోల్‌కతాతో ప్రత్యేక అనుబంధం ఉంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆమె తిరిగి రావడం సాహిత్య, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


