‘సామ్రాజ్యాలు కూలిపోతాయి.. బంగారం నిలుస్తుంది’ | Robert Kiyosaki Gold Safe Haven Paper Money Dollar collapse warning | Sakshi
Sakshi News home page

‘సామ్రాజ్యాలు కూలిపోతాయి.. బంగారం నిలుస్తుంది’

Jul 29 2026 9:30 PM | Updated on Jul 29 2026 9:38 PM

Robert Kiyosaki Gold Safe Haven Paper Money Dollar collapse warning

ప్రపంచ ప్రసిద్ధ ‘రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌’ పుస్తక రచయిత, ఇన్వెస్ట్‌మెంట్‌ నిపుణుడు రాబర్ట్‌ కియోసాకి మరోసారి బంగారం, వెండిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ చరిత్రలో ప్రతి సామ్రాజ్యం ఒకే చక్రాన్ని అనుసరిస్తుందని, అధికంగా కరెన్సీ ముద్రించడం చివరికి ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తుందని ఆయన తన ఫేస్‌బుక్‌ పోస్టులో పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాగితపు కరెన్సీ కంటే బంగారం, వెండి వంటి వాస్తవ ఆస్తులే సంపదను కాపాడగలవని ఆయన అభిప్రాయపడ్డారు.

రోమన్‌ సామ్రాజ్యం నుంచి స్పెయిన్‌, బ్రిటన్‌ వరకు చరిత్రను పరిశీలిస్తే, కరెన్సీ విలువ తగ్గిన ప్రతిసారి బంగారం తన విలువను నిలబెట్టుకుందని కియోసాకి తెలిపారు. ప్రభుత్వాలు ఎంత డబ్బునైనా ముద్రించగలవని, కానీ బంగారం లేదా వెండిని ముద్రించడం సాధ్యం కాదని ఆయన చెప్పారు. అందుకే ధనవంతులు తమ సంపదను బంగారం, వెండి వంటి పరిమిత లభ్యత కలిగిన ఆస్తుల్లో నిల్వ చేస్తారని వివరించారు.

ద్రవ్యోల్బణం ప్రజల కొనుగోలు శక్తిని క్రమంగా తగ్గిస్తుందని, అలాంటి సమయంలో బంగారం, వెండి కొనుగోలు శక్తిని రక్షించే సాధనాలుగా పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వాలపై నమ్మకం తగ్గినప్పుడు బంగారం ధరలు పెరుగుతున్నట్లు కనిపించినా, వాస్తవానికి కరెన్సీ విలువే తగ్గుతోందని ఆయన వ్యాఖ్యానించారు.

తాను అమెరికా అంతమవుతుందని చెప్పడం లేదని, అయితే అమెరికా డాలర్‌ ఆధిపత్యం క్రమంగా తగ్గే దిశగా సాగుతోందని కియోసాకి అభిప్రాయపడ్డారు. చరిత్రలో కరెన్సీ విలువను అధికంగా తగ్గించిన ప్రతి సామ్రాజ్యం చివరకు తన ఆధిపత్యాన్ని కోల్పోయిందని గుర్తు చేశారు.

బంగారం, వెండి ఒక్క రాత్రిలో ధనవంతులను చేసే పెట్టుబడులు కాదని, ఆర్థిక సంక్షోభాల నుంచి రక్షించే "ఫైనాన్షియల్‌ లైఫ్‌బోట్లు" అని ఆయన పేర్కొన్నారు. పరిస్థితులు మరింత క్లిష్టం అయ్యే వరకు వేచి చూడకుండా, చిన్న మొత్తంతో అయినా వెండి నాణెం లేదా చిన్న పరిమాణంలోని బంగారం కొనుగోలు చేసి నిజమైన సంపదను కూడబెట్టడం ప్రారంభించాలని తన ఫాలోవర్లకు సూచించారు. కాగితపు కరెన్సీలో మాత్రమే పొదుపు చేస్తే కాలక్రమంలో కొనుగోలు శక్తి తగ్గిపోతుందని, బంగారం, వెండి వంటి వాస్తవ ఆస్తులే దీర్ఘకాలంలో సంపదను రక్షిస్తాయని ఆయన తన పోస్టులో స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement