వాషింగ్టన్: అమెరికాలో ప్రముఖ విమానయాన సంస్థ అయిన ‘అమెరికా ఎయిర్‌లైన్స్’ సేవలు తీవ్ర అంతరాయానికి గురయ్యాయి. పెద్దఎత్తున తలెత్తిన ఐటీ సమస్య కారణంగా దేశవ్యాప్తంగా విమాన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. సిస్టమ్‌లో ఏర్పడిన సాంకేతిక లోపం వల్ల యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దేశవ్యాప్తంగా ఈ గ్రౌండ్ స్టాప్‌ను జారీ చేసింది. ఈ అనూహ్య పరిణామంతో సుమారు 45 నిమిషాల పాటు విమానాల టేకాఫ్‌లు పూర్తిగా నిలిచిపోయాయి. సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో ఎఫ్‌ఏఏ ఈ ఆదేశాలు జారీ చేసింది. అప్పటికే గాలిలో ఉన్న విమానాల రాకపోకలపై ఎలాంటి ప్రభావం పడనప్పటికీ, ఇంకా టేకాఫ్ కాని విమానాలన్నీ రన్‌వేలపైనే నిలిచిపోయాయి.
ఈ సాంకేతిక లోపం ఎందుకు తలెత్తిందనే దానిపై అమెరికా ఎయిర్‌లైన్స్ ఇప్పటివరకు స్పష్టమైన కారణాన్ని వెల్లడించలేదు. అయితే, ఈ ఐటీ వైఫల్యం వల్ల సంస్థ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌తో పాటు ఇతర కస్టమర్ సేవా వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోయాయి. డౌన్‌డెటెక్టర్ ప్లాట్‌ఫారమ్‌లో సుమారు 1,500 మందికి పైగా వినియోగదారులు ఈ సమస్యపై ఫిర్యాదు చేశారు. ‘ఎక్స్’ వేదికగా స్పందించిన సంస్థ, సాంకేతిక సమస్య కారణంగా కనెక్టివిటీ దెబ్బతిన్నట్లు అంగీకరించింది. ఐటీ బృందాలు వేగంగా స్పందించి, సమస్యను పరిష్కరించడంతో సుమారు 45 నిమిషాల తర్వాత ఎఫ్‌ఏఏ గ్రౌండ్ స్టాప్‌ను ఎత్తివేసింది. కనెక్టివిటీ పూర్తిగా పునరుద్ధరణ జరిగిందని, ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నామని సంస్థ ప్రకటించింది.
ఈ అంతరాయం కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఫ్లైట్ అవేర్ సమాచారం ప్రకారం, సంస్థకు చెందిన సుమారు 1,100 విమానాలు ఆలస్యంకాగా, 221 విమానాలు రద్దయ్యాయి. మరోవైపు, అమెరికా తూర్పు తీరంలో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులు కూడా ప్రయాణికుల కష్టాలను మరింత పెంచాయి.


