అమిత్ షా ‘మహా వ్యూహం’.. జూలై 9న కీలక భేటీ | India Launches Nationwide Crackdown On Illegal Immigrants, Amit Shah To Chair High Level Security Meet On July 9th | Sakshi
Sakshi News home page

అమిత్ షా ‘మహా వ్యూహం’.. జూలై 9న కీలక భేటీ

Jun 29 2026 10:53 AM | Updated on Jun 29 2026 11:21 AM

Amit Shahs Mega July 9 Crackdown Top Agencies Unite to Flush Out Illegal Infiltrators

న్యూఢిల్లీ: దేశ భద్రతను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్న అక్రమ చొరబాటుదారుల ఆట కట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. భారతదేశ సరిహద్దుల్లోనూ, దేశ అంతర్గతంగానూ తిష్టవేసిన అక్రమ వలసదారులను ఏరిపారేయడమే లక్ష్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశవ్యాప్త భారీ ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. జూలై  9న దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికారులతో హోంమంత్రి అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక ఆపరేషన్ కోసం దేశంలోని అగ్రగామి నిఘా, దర్యాప్తు సంస్థలన్నీ ఒకే తాటిపైకి రానున్నాయి.

ఈ దేశవ్యాప్త మహా ప్రచారంలో ప్రధానంగా అక్రమ వలసదారులను గుర్తించడం, వారిని తిరిగి దేశం దాటించడం (డిపోర్టేషన్) వంటి కీలక చర్యలు చేపట్టనున్నారు. ఇందుకోసం జూలై 9న కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన రాష్ట్రాల డీజీపీలతో జరగబోయే భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. దేశ భద్రతకు ముప్పుగా మారిన చొరబాట్లను పూర్తిగా అరికట్టేలా, అన్ని రాష్ట్రాల పోలీసు బలగాలను అప్రమత్తం చేస్తూ ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. చొరబాటుదారుల నెట్‌వర్క్‌ను కూకటివేళ్లతో సహా పడగొట్టడమే ఈ ప్రచారంలోని ముఖ్య ఉద్దేశం.

నకిలీ పత్రాల నెట్‌వర్క్‌ ధ్వంసం
చొరబాటుదారులకు సహకరిస్తున్న అంతర్గత శక్తులను మట్టుబెట్టేందుకు కేంద్రం కఠిన వ్యూహాన్ని రచించింది. అక్రమంగా దేశంలోకి చొరబడటమే కాకుండా, ఇక్కడి నకిలీ గుర్తింపు పత్రాలను (ఫేక్ డాక్యుమెంట్స్) సృష్టిస్తున్న ముఠాల నెట్‌వర్క్‌లను ధ్వంసం చేయనున్నారు. ఈ భారీ ఆపరేషన్ కేవలం పోలీసులకే పరిమితం కాకుండా.. దేశ రక్షణలో కీలక పాత్ర పోషించే ఇంటెలిజెన్స్ బ్యూరో , రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ , నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ , ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వంటి అగ్రగామి సంస్థలను రంగంలోకి దించుతున్నారు. ఈ సంస్థలన్నీ రాష్ట్ర పోలీసు విభాగాలతో కలిసి సమన్వయంతో పనిచేయనున్నాయి.

అక్రమార్కుల ఆస్తుల జప్తు
చొరబాటుదారులకు, వారికి సహకరించే నెట్‌వర్క్‌లకు ఆర్థికంగా ఊపిరి అందకుండా చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అస్త్రాలను సిద్ధం చేసింది. అక్రమ వలసలు, మానవ రవాణా, నకిలీ పత్రాల ద్వారా సంపాదించిన ఆస్తులను గుర్తించి, వాటిని పూర్తిగా సీజ్ చేసే బాధ్యతను ఈడీకి అప్పగించారు. ఈ ఆర్థికపరమైన కఠిన చర్యల ద్వారా చొరబాటు నెట్‌వర్క్‌ల వెన్ను విరచాలని కేంద్రం నిశ్చయించుకుంది. నిఘా సంస్థల సమాచారంతో, దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఈ దాడులు జరిగేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement