ఐదంకెల జీతం, విలాసవంతైన జీవనశైలి, లగ్జరీ ఇల్లు, ఖరీదైన కారు ఇవే జీవితం అనుకొని పరుగులు తీసే కాలానికి ఇక చెల్లు అంటోంది నేటి యువత. ప్రస్తుత కాలంలో ప్రశాంతమైన, ఒత్తిడి లేని జీవితానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. మస్కాన్ అటార్ అనే మహిళ లింక్డిన్‌లో షేర్ చేసిన స్టోరీ ఆసక్తికరంగా మారింది. జెన్ జీ డబ్బు, కెరీర్ వృద్ధి,పని-జీవిత సమతుల్యతను ఎలా చూస్తారనే దానిపై ఆన్‌లైన్‌లో చర్చకు దారి తీసింది.
స్టోరీ ఏంటంటే..
ఏడాదికి కోటీ రూపాయల వార్షికవేతనం అంటే ఎవరైనా ఆనందంతో ఎగిరి గంతేస్తారు. కానీ ఓ జెన్-జీ మాత్రం అంత భారీ ఆఫర్‌కు సింపుల్‌గా నో చెప్పేశాడు. అదేంటి పిచ్చా అని అనుకుంటున్నారా? ఆగండి ఇక్కడే ఉంది అసలు సంగతి. విషపూరితమైనదిగా భావించిన పని ప్రదేశంలో పనిచేయడానికి అతడికి ఇష్టం లేదట. అందుకే ఉద్యోగ అవసరం చాలా ఉన్నప్పటికీ, ఈ ఉద్యోగావకాశాన్ని తిరస్కరించాడు.
‘టాక్సిక్ వర్క్‌ప్లేస్’లో పనిచేయడం కంటే తక్కువ జీతమైనా తనకు నచ్చిన పని చేసుకోవడమే మేలని తన స్నేహితుడు నిర్ణయించుకున్నాడనీ మస్కాన్ అటార్ చెప్పుకొచ్చారు. కెరీర్‌లో కీలక దశలో ఉన్న సమయంలో ఇంత భారీ మొత్తాన్ని వదులుకోవడం తనను ఆశ్చర్యపరిచిందని తెలిపారు . 25 ఏళ్ల వయసు లోనే అతడు అంత భారీ ఆఫర్‌ను వద్దనుకోవడానికి చూపిన స్పష్టత తానైతే ఆ వయసులో చూపించలేక పోయేదాన్నని ముస్కాన్ పేర్కొన్నారు. కుటుంబ బాధ్యతలు, లైఫ్‌స్టైల్ ఆకాంక్షలు, సమాజపు ఒత్తిడి వల్ల సాధారణంగా ఎవరైనా ఆ డబ్బు వైపే మొగ్గు చూపుతారని అన్నారు.
నేటి తరం యువత (Gen Z) కేవలం ఎక్కువ జీతం ఇచ్చే ఉద్యోగాల వెనుక పడకుండా, పని ప్రశాంతత (Work-life balance), మానసిక ఆరోగ్యం మరియు దీర్ఘకాలిక లక్ష్యాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ ఘటన తెలుపుతోందన్నారు.అంతేకాదు రాబోయే రోజుల్లో నిపుణులైన ఉద్యోగులను నిలుపుకోవాలంటే కంపెనీలు తమ పని సంస్కృతిని, వాతావరణాన్ని మార్చుకోక తప్పదని ఆమె అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: 12 సీట్లతో మొదలై రెండేళ్లలోనే రూ. 350 కోట్ల బిజినెస్
సోషల్ మీడియాలో ఈ పోస్ట్‌పై నెటిజన్ల నుంచి రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కోటి ఆఫర్‌ను తిరస్కరించడం వెనక ఆర్థికంగా బలమైన నేపథ్యం లేదా నెలకు కొంతకాలం ఆదాయం లేకపోయినా ఉండ గలిగే వెసులుబాటు ఉన్నవారికే సాధ్యమని కొందరు వ్యాఖ్యానించగా నా మిడిల్ క్లాస్ మెంటాలిటీకి 45 ఏళ్ల వయసులో కూడా నేను అంత పెద్ద ఆఫర్‌ను వదులుకోలేను. అలాంటి ఆఫర్లు ఉంటే నాకే రీడైరెక్ట్ చేయండి!" అని ఒక నెటిజన్ సరదాగా కామెంట్ చేశారు. భవిష్యత్తు పని సంస్కృతి రాబోయే రోజుల్లో కేవలం జీతం మాత్రమే కాకుండా ఉద్యోగి మానసిక ఆరోగ్యం, వర్క్ శాటిస్‌ఫేక్షన్‌కు ప్రాధాన్యత ఇచ్చే ఉద్యోగులే భవిష్యత్తు కార్పొరేట్ రంగాన్ని నడిపిస్తారని మరికొందరు సమర్థించారు.
ఇదీ చదవండి: లిప్త పాటులో సుఖ్‌బీర్ ప్రాణాలను కాపాడింది ఈయనే : సర్వత్రా ప్రశంసలు
.


