ప్రభుత్వం మారితే సరిపోదు.. అదే నాకు బహుమతి: వాంగ్‌చుక్‌ | Sonam Wangchuk Says peaceful revolution need In Indian politics | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం మారితే సరిపోదు.. అదే నాకు బహుమతి: వాంగ్‌చుక్‌

Aug 14 2026 7:24 AM | Updated on Aug 14 2026 7:24 AM

Sonam Wangchuk Says peaceful revolution need In Indian politics

భారత్‌ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే కేవలం ప్రభుత్వాలు మారడం సరిపోదని.. దేశ రాజకీయ వ్యవస్థలోనే మౌలిక మార్పులు రావాలని ప్రముఖ పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్ అన్నారు. దేశానికి ఇప్పుడు ఒక ‘శాంతియుత విప్లవం’ అవసరమని పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధికి విద్యే పునాది అని వాంగ్‌చుక్‌ స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రాకుండా దేశం ముందుకు వెళ్లడం సాధ్యం కాదన్నారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన వీడియో సందేశంలో వాంగ్‌చుక్‌ భారత్‌ భవిష్యత్తుపై తన ఆందోళనలను వ్యక్తం చేశారు. ఒకప్పుడు భారత్‌తో సమానంగా లేదా వెనుకబడి ఉన్న థాయ్‌లాండ్‌, మలేషియా, ఇండోనేషియా, శ్రీలంక, బంగ్లాదేశ్‌ వంటి దేశాలు నేడు వేగంగా ముందుకు దూసుకెళ్లాయని ఆయన గుర్తుచేశారు. ‘ఇదే వేగంతో కొనసాగితే 2047 నాటికి భారత్‌ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తన స్థానాన్ని నిలబెట్టుకోవడం కష్టమవుతుంది’ అని ఆయన హెచ్చరించారు.

విద్య వెనుకబడితే.. 
దేశ అభివృద్ధికి విద్యే పునాది అని వాంగ్‌చుక్‌ స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రాకుండా దేశం ముందుకు వెళ్లడం సాధ్యం కాదన్నారు. ఇటీవల మార్పు కోసం ప్రజలు చేపట్టిన ఆందోళనలను ప్రస్తావించిన ఆయన.. కొన్ని సందర్భాల్లో మంత్రుల రాజీనామాలు జరిగినా, కేవలం వ్యక్తుల మార్పుతో సమస్యలు పరిష్కారం కావని అన్నారు. ఇదే సమయంలో తన విమర్శలు ఏ ఒక్క రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదని  స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. అన్యాయాన్ని ప్రశ్నించే ప్రజల గొంతుకలను అణచివేస్తున్నారనే ఆరోపణలు వివిధ ప్రభుత్వాలపై వస్తున్నాయని అన్నారు.

2012-13లో జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని గుర్తుచేస్తూ.. ఆ ఉద్యమం తర్వాత ప్రభుత్వం మారినా అవినీతి, అన్యాయం పూర్తిగా అంతం కాలేదని వ్యాఖ్యానించారు. సమస్యలు ఇప్పుడు మరో రూపంలో మరింత పెద్దవిగా కనిపిస్తున్నాయని అన్నారు. భారత్‌ రాజకీయ వ్యవస్థలో ప్రధాన సమస్య నాయకులను ఎన్నుకునే విధానమే అంటూ తన అభిప్రాయపడ్డారు. నాయకులు సరైనవారు కాకపోతే.. మొత్తం దేశమే తప్పుదారి పడుతుందని.. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధుల సంఖ్యపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు.

అదే నాకు బహుమతి.. 
అయితే తాను అధికార పార్టీని కానీ, ప్రతిపక్షాన్ని కానీ లక్ష్యంగా చేసుకోవడం లేదని స్పష్టం చేశారు. ‘ఇది ఏ పార్టీ సమస్య కాదు.. దేశ సమస్య’ అని వ్యాఖ్యానించారు. దేశానికి కొత్త రాజకీయ దిశను చూపించగల వ్యక్తులను గుర్తించేందుకు ప్రజల సహకారం కోరారు. కేవలం మేధావులు మాత్రమే కాకుండా.. నిస్వార్థంగా పనిచేసే, మంచి వ్యక్తిత్వం కలిగిన, సూత్రాలకు కట్టుబడి ఉండే వ్యక్తులు కావాలని అన్నారు. దేశవ్యాప్తంగా అలాంటి వ్యక్తుల పేర్లను ప్రజలు సూచించాలని ఆయన కోరారు. వివిధ రాష్ట్రాలు, నగరాల్లో పర్యటించి ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు, సూచనలు సేకరించనున్నట్లు తెలిపారు. ఈ స్వాతంత్ర్య దినోత్సవానికి నాకు ఇవ్వగలిగే ఉత్తమ బహుమతి.. అలాంటి మంచి వ్యక్తుల పేర్లను సూచించడమే అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement