కామారెడ్డి: బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తిని కాదని, అలా ఎవరికి అమ్ముడుపోలేదన్నారు. కేవలం నియోజకవర్గం అభివృద్ధి కోసం కాంగ్రెస్‌కు మద్దతిచ్చానన్నారు. అభివృద్ధి జరుగుతుందనే ఆశతో సీఎం రేవంత్‌కు మద్దతు తెలిపానని పోచారం స్పష్టం చేశారు. తన మాటల వెనుక రాజకీయ రహస్యం ఏది కూడా లేదని, ఉన్నది ఉన్నట్లు చెప్పడం తన నైజమన్నారు.
రెండు రోజుల క్రితం కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన పోచారం.. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పట్ల విధేయతతో మాట్లాడారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో తనకు ఎదరవుతున్న ఇబ్బందులపై ఆయన పశ్చాత్తాప వ్యాఖ్యలు చేశారు.
మంత్రి పదవి కోసమో, డబ్బుల కోసమో పార్టీ మారలేదు. కేసీఆర్‌ను మోసం చేసి పార్టీ మారడం ఇష్టం లేదని చెప్పాను. కండువా కప్పుకుంటే నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇస్తామంటే తప్పని పరిస్థితుల్లో కండువా కప్పుకున్నా. 6 నెలల్లో పెండింగ్ పనులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. సీఎం చెప్పినా మంత్రులు నా ఫోన్ ఎత్తడం లేదు’ అని అన్నారు.


