ప్రిన్సిపాల్‌ రూపారెడ్డి దారుణ హత్య | Nagarjuna Public School Director Rupa Reddy Incient At Nalgonda District | Sakshi
Sakshi News home page

ప్రిన్సిపాల్‌ రూపారెడ్డి దారుణ హత్య

Aug 13 2026 7:25 AM | Updated on Aug 13 2026 7:25 AM

Nagarjuna Public School Director Rupa Reddy Incient At Nalgonda District

నల్లగొండ : కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ప్రైవేట్‌ స్కూల్‌ నిర్వహిస్తున్న మహిళ దారుణ హత్యకు గురైంది. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండడం చూసి దుండగులు హత్యచేశారు. కొండమల్లేపల్లి సీఐతో పాటు ఇద్దరు ఎస్‌ఐలు నివాసం ఉండే సమీప ప్రాంతంలోనే హత్య జరగడం కలకలం రేపింది. కల్లు రూపారెడ్డి(52) కొన్ని సంవత్సరాలుగా కొండమల్లేపల్లిలో నాగార్జున గ్రామర్‌ స్కూల్‌ నిర్వహిస్తూ ప్రిన్సిపాల్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. 

ఆమె భర్త రాజేందర్‌రెడ్డి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుంటారు. వారు మండల కేంద్రంలోని జేబీ కాలనీలో నివాసముంటున్నారు. వీరికి హైదరాబాద్‌ శివారులోని గుర్రంగూడలో కూడా ఇల్లు ఉంది. వారి కుమారుడు అభినవ్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఇంజనీరింగ్‌ చదువుతూ అక్కడే ఉంటున్నాడు. దీంతో సెలవు దినాల్లో దంపతులిద్దరూ కుమారుడి వద్దకు వెళ్లి వస్తుంటారు. తాజాగా శని, ఆది, సోమవారం మూడు రోజులు వరుసగా సెలవులు రావడంతో రూపారెడ్డి భర్తతో కలిసి హైదరాబాద్‌లోని తమ కుమారుడి వద్దకు వెళ్లారు.

తిరిగి మంగళవారం ఉదయం రూపారెడ్డి కొండమల్లేపల్లికి రాగా.. భర్త రాజేందర్‌రెడ్డి పని ఉందని అక్కడే ఉండిపోయాడు. రూపారెడ్డి మంగళవారం ఉదయం స్కూల్‌కు వెళ్లి సాయంత్రానికి తిరిగికొండమల్లేపల్లిలోని ఇంటికి వచ్చారు. అయితే, బుధవారం ఉదయం రూపారెడ్డికి ఆమె భర్త రాజేందర్‌రెడ్డి ఎన్నిసార్లు ఫోన్‌ చేసినప్పటికి లిఫ్ట్‌ చేయకపోవడంతో కొండమల్లేపలి్లలోని తమ ఇంటి పైన అద్దెకుంటున్న వారికి ఫోన్‌ చేసి చూడాల్సిందిగా కోరాడు. అద్దెకు ఉంటున్న వారు వెళ్లి ఎన్నిసార్లు తలుపుతట్టినా రూపారెడ్డి తలుపు తీయకపోవడంతో ఇంటిపక్కన ఉన్న వారిని పిలిచారు. వారు వచ్చి తలుపు కొట్టినప్పటికి స్పందన లేదు. దీంతో ఇంటి వెనుక ఉన్న కిచెన్‌ వద్దకు వెళ్లి చూడగా తలుపులు తెరిచి ఉన్నాయి. 

ఇంట్లోకి వెళ్లి చూడగా రూపారెడ్డి రక్తపు మడుగులో విగతజీవిగా ఉంది. స్థానికులు వెంటనే రూపారెడ్డి భర్తకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ శ్రీనివాస్‌రావు, కొండమల్లేపల్లి సీఐ నవీన్‌కుమార్, ఎస్‌ఐ అజ్మీరాÆ రమేష్‌తో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్‌ టీంతో పాటు డాగ్‌ స్క్వాడ్‌ హత్య జరిగిన ప్రదేశంలో ఆధారాలు పరిశీలించారు. హత్యకు స్పష్టమైన కారణాలు ఇప్పటి వరకు లభ్యం కాకపోవడంతో అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నట్లు దేవరకొండ డీఎస్పీ శ్రీనివాస్‌రావు తెలిపారు. మంగళవారం సాయంత్రం 7.30 గంటల నుంచి 8.30 గంటల సమయంలో హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రూపారెడ్డి శరీరంపై కత్తిపోట్లు ఉండడంతో ఈ హత్యలో ఎంత మంది ప్రమేయం ఉందన్న కోణంలోనూ దర్యాప్తు జరుగుతుందని తెలిపారు. 

పక్కా రెక్కీతోనే హత్య చేశారా..?
హత్య జరిగిన సమీప ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల్లో అనుమానితుల కదలిలకలపై స్పష్టత లేకపోవడంతో రూపారెడ్డి ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల్లోనూ అనుమానాస్పద కదలికలు లేకపోవడంతో దుండగులు పక్కా రెక్కీ నిర్వహించి హత్య చేశారని పోలీసులు భావిస్తున్నారు. రూపారెడ్డి ఇంటి వెనుక వైపు సీసీ కెమెరాలు లేవు. ఇది గమనించి దుండగులు ఇంటి వెనకవైపు నుంచి వచ్చినట్టు తెలుస్తోంది. దీనికి తోడు హత్య జరిగిన ఇంట్లో ఎలాంటి చోరీ జరగకపోవడంతో దొంగలు కాదని భావిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement