2,87,634 ఎకరాల్లో ఆరుతడి పంటల లక్ష్యం.. వేసింది 32,243 ఎకరాల్లోనే..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు, ప్రాజెక్టుల్లో పరిమిత నీటి లభ్యత, భూగర్భ జలాల తగ్గుదల.. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆరుతడి పంటల సాగును ప్రోత్సహిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. జిల్లాలో ప్రస్తుత వానాకాలం సీజన్‌లో 2,87,634 ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా నిర్ధేశించింది. అయితే ఇప్పటివరకు కేవలం 32,243 ఎకరాల్లోనే ఆరుతడి పంటలు సాగయ్యాయి. అంటే నిర్దేశించిన లక్ష్యంలో సుమారు 11.20 శాతం మాత్రమే సాధించినట్లయింది. దీంతో ఆరుతడి పంటల సాగు లక్ష్యం కాగితాలకే పరిమితమవుతోంది. మరోవైపు వరిసాగు గణనీయంగా పెరిగింది. వ్యవసాయ శాఖ అంచనాకు దగ్గరగా జిల్లాలో రైతులు వరి సాగు చేస్తుండడంతో వర్షాలు కురవకపోతే పంటలను కాపాడుకునేదెలా అని రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.
నీటి వినియోగం తగ్గించాలని..
నీటి వినియోగాన్ని తగ్గించేందుకు ఆరుతడి పంటల వైపు రైతులను మళ్లించాలని అధికారులు సూచిస్తున్నారు. వరి సాగుకు అధికంగా నీరు అవసరమవుతుండటంతో వీలైనంత మేర ఇతర పంటలను సాగు చేయాలని చెబుతున్నారు. అయితే వరికి మార్కెట్ ఉండటం, సాగు పద్ధతిపై రైతులకు అనుభవం ఉండటం, గతంలో మంచి దిగుబడులు రావడం వంటి కారణాలతో రైతులు వరి సాగుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే 4,38,762 ఎకరాల్లో వరి సాగైనట్లు లెక్కలు చెబుతున్నాయి. ఆరుతడి పంటల సాగు లక్ష్యంతో పోలిస్తే వరి విస్తీర్ణం భారీగా ఉండటం వ్యవసాయ శాఖకు సవాల్‌గా మారింది. గతేడాది వానాకాలంలో జిల్లాలో 5,34,523 ఎకరాల్లో వరి సాగు చేయగా, ప్రస్తుత వానాకాలంలో 95,761 ఎకరాల్లో మాత్రమే వరి సాగు తగ్గింది. ఇక పత్తి విస్తీర్ణం పెద్ద ఎత్తున 6,01,195 ఎకరాల్లో సాగు చేశారు. ప్రస్తుతం జిల్లాలోని 12,02,051 ఎకరాల సాగు అంచనాలో ఇప్పటివరకు 10,72,311 ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేశారు.
నీటి భద్రతపై ప్రభావం
వరి సాగు విస్తీర్ణం పెరగడంతో నీటి వినియోగం కూడా అధికమయ్యే అవకాశం ఉంది. వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోతే చెరువులు, ప్రాజెక్టులు, బోర్లపై ఆధారపడే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో యాసంగి సీజన్‌లో నీటి లభ్యతపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అవగాహన పెంచడం సవాలే..
ప్రస్తుత పరిస్థితుల్లో రైతులను ఆరుతడి పంటల వైపు మళ్లించడం వ్యవసాయ శాఖకు పెద్ద సవాలుగా మారింది. అయినప్పటికీ ఆరుతడి పంటలతో తక్కువ నీటితో సాగు చేయడమే కాకుండా పంటల మార్పిడి, భూసార పరిరక్షణ, సాగు వ్యయాల తగ్గింపు వంటి ప్రయోజనాలు ఉన్నాయని వ్యవసాయ శాఖ చెబుతోంది. రైతులకు ఆయా పంటలపై అవగాహన కల్పించడంతో పాటు మార్కెటింగ్ సౌకర్యాలు, మద్దతు ధర, కొనుగోలు భరోసా కల్పిస్తేనే ఆరుతడి పంటల వైపు రైతులు ఆసక్తి చూపే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
అత్యధికంగా వరి సాగైన మండలాలు..
జిల్లాలో ప్రత్యామ్నాయ పంటల సాగు ఇలా..
పంట సాగు లక్ష్యం సాగైంది
కందులు 58,176 11,240
పెసర 28,800 14,221
కూరగాయలు 14,976 5,599
పచ్చజొన్న 14,400 207
తొల్లజొన్న –– 565
నువ్వులు 86,400 11
ఉలవలు 14,400 74
బొబ్బర 57,024 110
ఆముదం 13,824 33
వేరుశనగ –– 65
చెరుకు –– 40
జూట్ –– 78
ఫ నిర్దేశిత లక్ష్యంలో 11.20 శాతమే సాగు..
ఫ ప్రభుత్వ ప్రచారాన్ని పట్టించుకోని రైతులు
ఫ వ్యవసాయశాఖ అంచనాలకు దగ్గరగా వరిసాగు
ఫ ఇప్పటికే 4,38,762 ఎకరాల్లో నాట్లు
నల్లగొండ
మిర్యాలగూడ
కనగల్
తిప్పర్తి
మాడ్గులపల్లి
నిడమనూరు
త్రిపురారం
కట్టంగూర్
కేతేపల్లి
నార్కట్‌పల్లి
వేములపల్లి


