పథకాలు పక్కాగా అమలు కావాలి | - | Sakshi
Sakshi News home page

పథకాలు పక్కాగా అమలు కావాలి

Aug 13 2026 1:57 AM | Updated on Aug 13 2026 1:57 AM

రామగిరి(నల్లగొండ) : షెడ్యూల్డ్‌ కులాలు, తెగల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు కావాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు. బుధవారం నల్లగొండ కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌లో కమిషన్‌ సభ్యులతో కలిసి ఎస్సీ, ఎస్టీ భూసమస్యలు, దాడులు, కేసులు, ఉద్యోగాల్లో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అమలు తదితర అంశాలపై జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ వెంకటయ్య మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులను పక్కాగా వినియోగించాలని, ఇతర పనులకు మళ్లిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిధులు మిగిలితే ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోనే రోడ్లు, ఇతర మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఉద్యోగాలు, ప్రమోషన్లలో తప్పనిసరిగా రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటించాలని, ఎంపీ, నియోజకవర్గ అభివృద్ధి, ఎస్డీఎఫ్‌ నిధులను రిజర్వేషన్‌ ప్రకారమే కేటాయించాలని ఆదేశించారు.

దాడుల కేసుల్లో పురోగతి ఉండాలి..

ఎస్సీ, ఎస్టీలపై దాడుల కేసుల్లో జాప్యం లేకుండా శిక్షల శాతాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను ఆదేశించారు. బాధితులకు అందాల్సిన రూ.1.89 కోట్ల పరిహారంతో పాటు కులాంతర వివాహాల ప్రోత్సాహకాలు, బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలల నిధులు త్వరలోనే వచ్చేలా చూస్తామని తెలిపారు. నల్లగొండలోని మర్రిగూడ బైపాస్‌ వద్ద ఉన్న అంబేద్కర్‌, బాబు జగ్జీవన్‌ రామ్‌ విగ్రహాలను తొలగించకుండా కమిటీ వేసి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఉచిత న్యాయ సహాయం అందిస్తున్న అడ్వకేట్‌ దర్శనం నర్సింహకు గన్‌మెన్‌ భద్రతను పునరుద్ధరించాలని ఎస్పీని కోరారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అవుట్‌సోర్సింగ్‌ నియామకాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కలెక్టర్‌కు చెప్పారు. గుడితాండా పునరావాస కేంద్రం పరిహారం రాని 130 మందికి, చండూరు మండలం అంగడిపేటకు చెందిన మేకల బుచ్చమ్మ ఇంటి వివాదంపై విచారణ జరిపి న్యాయం చేయాలన్నారు. కమిషన్‌ సభ్యులు జిల్లా శంకర్‌, రాంబాబు నాయక్‌ మాట్లాడుతూ దాడుల కేసుల పరిష్కారం, డ్రగ్స్‌ అరికట్టడంలో జిల్లా యంత్రాంగం కృషిని అభినందించారు. భూసమస్యలలో అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని అరికట్టాలని, తక్షణమే ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయ్యేలా చూడాలని, శూన్యపహాడ్‌ గణేష్‌పహాడ్‌ రోడ్డు సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరారు. కలెక్టర్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ జిల్లాలో విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశాలు, ప్రతి నెలా పౌర హక్కుల దినోత్సవం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి జిల్లాలో ప్రస్తుతం 54 కేసులు విచారణలో ఉన్నాయని, 6 కేసుల్లో కోర్టు ద్వారా శిక్షలు ఖరారయ్యాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కమిషన్‌ సభ్యులు లక్ష్మీనారాయణ, అదనపు కలెక్టర్‌ జె.శ్రీనివాస్‌, ప్రేమకరణ్‌రెడ్డి, డిప్యూటీ కలెక్టర్‌ (ట్రెయినీ) శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఫ ఉద్యోగాల్లో రూల్‌ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటించాలి

ఫ ఎంజీయూలో నియామకాలపై విచారణ జరపాలి

ఫ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement