అత్యంత శీతలమైన, సుదూర ప్రాంతమైన అంటార్కిటిలో టూర్ గైడ్‌గా పనిచేయడం చాలా మందికి ఒక అద్భుతమైన కల. నెలల తరబడి మంచుతో కప్పబడిన గ్లేసియర్లు, పెంగ్విన్లు, సీల్స్, ఓర్కా వేల్స్ మధ్య జీవిస్తూ, పర్యాటకులకు ఆ అద్భుతమైన ప్రపంచాన్ని పరిచయం చేయడం చాలామందికి డ్రీమ్ జాబ్. కానీ ప్రస్తుతం ఇదే రంగంలో అనుభవజ్ఞులైన గైడ్లు తమ ఉద్యోగాలకు స్వస్తి పలుకుతున్నారు. దీనికి వేతనాలు లేదా పని ఒత్తిడి మాత్రమే కారణం కాదు. వాతావరణ మార్పులు, విపరీతంగా పెరుగుతున్న పర్యాటకమే ప్రధాన కారణం.
వెలుగు చూసిన దిగ్భ్రాంతికర నిజాలు
నీర్లాండ్‌లోని గ్రోనింగెన్ విశ్వవిద్యాలయం, బ్రిటన్‌లోని సరే విశ్వవిద్యాలయం పరిశోధకులు అంటార్కిటికాలో పనిచేసి మానేసిన 25 మంది మాజీ గైడ్లను ఇంటర్వ్యూ చేశారు. ఈ అధ్యయనంలో వారు అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ గురించి పర్యాటకులకు అవగాహన కల్పిస్తున్నామని అనుకున్న గైడ్లు.. తాము చేస్తున్న పనుల వల్లే అక్కడి సున్నితమైన ఆవాసాలపై మరింత భారం పడుతోందనే నైతిక సంఘర్షణకు గురయ్యారు. ఈ అంతర్మథనమే వారిని ఉద్యోగాలు వదిలేసేలా ప్రేరేపించింది.
కళ్ల ముందే కరిగిపోతున్న గ్లేసియర్లు
అధ్యయనంలో పాల్గొన్న ఒక మాజీ గైడ్ మాట్లాడుతూ.. తాను స్వయంగా ఒక భారీ గ్లేసియర్ ముక్క విరిగి సముద్రంలో పడటాన్ని చూశానని తెలిపారు. వాతావరణ మార్పులకు అది తీవ్ర హెచ్చరిక అయినప్పటికీ, అక్కడికి వచ్చిన పర్యాటకులు మాత్రం దాన్ని ఒక అద్భుతమైన వినోదంగా భావించి చప్పట్లు కొట్టారన్నారు. ఆ సమయంలో పర్యాటకులు ఈ ముప్పు తీవ్రతను అసలు అర్థం చేసుకోలేకపోతున్నారనే నిరాశ ఆ గైడ్‌ను కుంగదీసింది.
టీ-షర్ట్‌లతో గ్లేసియర్‌లపై నడిచిన వైనం
2020లో అంటార్కిటికాలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత రోజులను తాను అనుభవించానని మరో గైడ్ పేర్కొన్నారు. సాధారణ పరిస్థితుల్లో ఎప్పుడూ ఊహించని విధంగా తాను టీ-షర్ట్ ధరించి గ్లేసియర్‌లపై నడిచానని, చేతికి గ్లౌవ్స్ లేకుండానే బోటు నడిపానని ఆయన గుర్తుచేసుకున్నారు. వాతావరణంలో వస్తున్న ఈ ప్రమాదకర మార్పులు వారిని తీవ్రంగా కలచివేశాయి.
వన్యప్రాణుల మనుగడపై నీలినీడలు
పర్యాటకుల సంఖ్య విపరీతంగా పెరగడం వల్ల అక్కడ ఉండే పెంగ్విన్లు, ఇతర వన్యప్రాణుల సహజ జీవనానికి తీవ్ర ఆటంకం కలుగుతోందని గైడ్లు ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలు కఠినంగా ఉన్నప్పటికీ, రాత్రి సమయాల్లో కూడా పర్యాటకుల రాకపోకలు పెరగడం వల్ల పక్షుల విశ్రాంతికి భంగం కలుగుతోందని, ఇది ఆ ప్రాంత పర్యావరణ వ్యవస్థను దెబ్బతీస్తోందని వారు స్పష్టం చేశారు.
లక్షల్లో పర్యాటకులు
అధికారిక గణాంకాల ప్రకారం.. 2025-26 పర్యాటక సీజన్‌లో ఏకంగా 1.20 లక్షలకు పైగా పర్యాటకులు అంటార్కిటికాను సందర్శించారు. ఇదే తీరు కొనసాగితే రాబోయే దశాబ్ద కాలంలో ప్రతి వేసవి కాలంలోనూ పర్యాలకులు సంఖ్య సుమారు 4.5 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. భారీ క్రూజ్ నౌకల రాకపోకల వల్ల జరిగే భారీ కార్బన్ ఉద్గారాలు ఈ సున్నితమైన ప్రాంతాన్ని మరింత ప్రమాదంలోకి నెడుతున్నాయి.
ఉద్యోగం వదిలేయడం వెనుక..
అంటార్కిటికా అంటే విపరీతమైన ప్రేమ ఉన్న ఈ గైడ్లకు ఉద్యోగం వదలడం అంత తేలికైన నిర్ణయం కాదు. ఏళ్ల తరబడి సాగిన మానసిక క్షోభ తర్వాతే వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో తమ పిల్లల కళ్లలోకి చూసి భూమిని కాపాడటానికి తాము కూడా శక్తివంచన లేకుండా ప్రయత్నించామని చెప్పాలనే ఉద్దేశంతోనే వారు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
‘ప్రేమించడం అంటే దూరంగా ఉండటమే’
‘ఒక ప్రాంతాన్ని ప్రేమించడం అంటే ఎప్పుడూ అక్కడే ఉండటం కాదు, కొన్నిసార్లు దాని రక్షణ కోసం దాని నుంచి దూరంగా ఉండటమే నిజమైన ప్రేమ’ అని మాజీ గైడ్లు నిరూపించారు. ఈ ఉద్యోగాలు వదిలిన తర్వాత తమకు మానసిక ప్రశాంతత దక్కిందని వారు తెలిపారు. ఈ పరిశోధన కేవలం అంటార్కిటికాకు మాత్రమే పరిమితం కాకుండా, ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పర్యాటకంపై తీవ్రమైన నైతిక ప్రశ్నలను లేవనెత్తుతోంది.
ఇది కూడా చదవండి: 2029 నాటికి ‘జెన్ జీ’ ఓటే శాసనం!


