దాహార్తిని తీర్చే ప్రణాళికలేవి? | Sakshi Editorial On Drinking water Thirst quenching plans | Sakshi
Sakshi News home page

దాహార్తిని తీర్చే ప్రణాళికలేవి?

Jun 18 2026 12:53 AM | Updated on Jun 18 2026 12:53 AM

Sakshi Editorial On Drinking water Thirst quenching plans

సంక్షోభాలు అకారణంగా రావు. అంచనాలున్నప్పుడూ, సమస్య అంతకంతకు ఉగ్ర రూపం దాలుస్తున్న వైనం కనబడుతున్నప్పుడూ మేల్కొంటే సకాలంలో వాటిని నివారించటం, అధిగమించటం వీలవుతుంది. కానీ మన పాలకుల విధానాలన్నీ దాహం వేసిన ప్పుడు బావి తవ్విన చందాన ఉంటున్నాయి. అందువల్లే ఈ వేసవిలో దేశంలోని మహా నగరాలన్నీ కనీ వినీ ఎరుగని నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ జనాభాలో మన వాటా 18 శాతం. కానీ ప్రపంచ నీటి వనరుల్లో వాటా కేవలం 4 శాతం మాత్రమే. ఇంత వ్యత్యాసం ఉన్నప్పుడు నీటి వనరుల సంరక్షణ విషయంలో మొదటినుంచీ ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పనవసరం లేదు. వాతావరణ మార్పులు ఒక్కటే కాదు... భూగర్భ జలాల వినియోగంలో జాగ్రత్తలు పాటించకపోవటం, నగర పట్టణ ప్రాంతాల్లో నీటిని కాస్తయినా పట్టింపు లేకుండా వృథా చేయటం వంటివి సైతం సమస్యను ఉగ్ర రూపం దాల్చేలా చేస్తున్నాయి. ప్రపంచం నీటి కొరత, ఎద్దడి, సంక్షోభం దశల్ని దాటి ఇప్పుడు నీటి దివాలా(పునరుత్పాదకతకు వీల్లేనివిధంగా పూర్తిగా అడుగంటడం) వరకూ వచ్చిందని ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయ జల, పర్యావరణ, ఆరోగ్య సంస్థ ఈమధ్య ప్రకటించింది. 

అయితే దీన్నుంచి తప్పించుకోవటానికి ఇప్పటికీ మార్గాలున్నాయి. గండం గట్టెక్కడానికి తోచినవిధంగా చేసుకుపోవటం బదులు పారదర్శక విధానాలు పాటించటం అవసరమని ఆ సంస్థ సూచించింది. ఒక ప్రణాళికాబద్ధంగా సహజ నీటివనరుల రీచార్జ్‌కి అనుసరించాల్సిన మార్గాలేమిటో నిర్ధారించుకోవటం, వాగులు, వంకలు, జలాశ యాలు నిండటానికి దోహదపడే కొండలు, గుట్టల్ని ప్రాణప్రదంగా కాపాడుకోవటం అవసరమని నిపుణులంటున్నారు. ప్రపంచంలో 70 శాతం జలాశయాలు క్రమేపీ క్షీణిస్తు న్నాయనీ, 400 కోట్లమంది ప్రజలు ఏడాదిలో కనీసం ఒక నెలపాటు నీటి ఎద్దడి ఎదు ర్కొంటున్నారనీ సమితి విశ్వవిద్యాలయం అంటున్నది. తీవ్ర నీటి కొరత ఎదుర్కొంటున్న నగరాల్లో ఢిల్లీ, కోల్‌కతా చెన్నై, బెంగళూరులతోపాటు హైదరాబాద్‌ కూడా ఉంది. ఈ నీటి కొరత ప్రజారోగ్యానికి కూడా ముప్పు కలిగిస్తోంది. 14 యేళ్లలోపున్న 80 లక్షల మంది బాలలు తాగునీటి నాణ్యత నాసిరకంగా ఉండటంవల్ల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని సంస్థ నివేదిక చెబుతోంది. 

నీటి ఎద్దడిని వర్షాలు సరిగా పడకపోతే వచ్చే సమస్యగానే ఇంకా మన పాలకులు చూస్తున్నారు. కానీ సరిగా అధ్యయనం చేస్తే దీని మూలాలు మరెక్కడో ఉన్నాయని అర్థమవుతుంది. నగరాలు తమ స్థోమతకు మించి విస్తరిస్తున్నాయి. అంతో ఇంతో ఉపాధి కల్పించే సంస్థలన్నీ అక్కడే కేంద్రీకృతం కావటంతో అనివార్యంగా అందరూ నగరాల బాట పట్టాల్సివస్తోంది. కానీ మౌలిక సదుపాయాలు ఇంతమందిని తట్టుకోగల స్థాయిలో లేక సహజంగానే సంక్షోభం ముదురుతుంది. ఉన్న నీటి వనరులేమిటి... వాటి సమర్థ వినియోగానికి మార్గాలేమిటన్న అంశాలపైకాక, కొత్త వనరుల అన్వేషణపై దృష్టి కేంద్రీకరించటం సమస్య తీవ్రతను పెంచుతోంది. భూగర్భ జలాల వినియోగంపై నియంత్రణలు, వ్యర్థ జలాల శుద్ధి అంశాల్లో ప్రభుత్వాలకు సరైన ప్రణాళికలు లేవు. వ్యర్థ జలాలు, పారిశ్రామిక వ్యర్థాలు చెరువుల్లో, నదుల్లో కలుస్తున్నా పట్టకపోవటంతో చివరకు భూగర్భజలాలు కూడా కలుషితమవుతున్నాయి.  

వచ్చే 2030 నాటికి అందుబాటులో ఉండే నీటి లభ్యతతో పోలిస్తే రెండు రెట్లు అధిక డిమాండ్‌ ఉంటుందని నీతి ఆయోగ్‌ సంస్థ చెబుతున్న జోస్యం అందరినీ భయపెడుతోంది.  మూడు నాలుగు నెలలపాటు ఉండాల్సిన రుతుపవనాలు చుట్టం చూపుగా వచ్చి పోవటం రివాజుగామారి చాన్నాళ్లవుతోంది. ఈసారి ముంచుకొస్తున్న సూపర్‌ ఎల్‌నినో సరేసరి. గంగ, సింధు, బ్రహ్మపుత్ర నదులను నింపే హిమాలయాల్లోని మంచుదిబ్బలు వేగంగా కరుగుతూ వెంటనే వరదలకూ, అటుపై నీటి కొరతకూ కారణమవుతున్నాయి. అందుకే చైనా, సింగపూర్‌ వంటి దేశాలు నీటి వనరుల రక్షణకూ, వాన నీటి సేకరణకూ, వ్యర్థ జలాల వినియోగానికీ అనుసరించే విధానాలను అధ్యయనం చేసి మన దగ్గర కూడా అమలు చేయాలి. నీటి వినియోగంపై సమగ్రమైన నిబంధనలకు రూపకల్పన చేయాలి. వానాకాలంలో వరదల్లో మునిగి, వేసవిలో ఎడారులుగా మారే నగరాలు మనకొద్దని ప్రతినబూనాలి. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement