ఎంతో సున్నితమైన నదీజలాల సమస్యను ప్రభుత్వాలు దశాబ్దాల తరబడి అపరిష్కృతంగా వదిలేయటంవల్ల అది కాస్తా మరింత జటిలమవుతోంది. రాష్ట్రాలమధ్యా, రాష్ట్రాల్లో ప్రాంతాలమధ్యా తరచు తలెత్తుతున్న జలవివాదాలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఎప్పటిలాగే కర్ణాటక, తమిళనాడుల మధ్య తాజాగా కావేరీ నదీజలాల పంపకం విష
యంలో చిచ్చు రేగింది. రోజూ 3,500 క్యూసెక్కుల చొప్పున తమిళనాడుకు 4.5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కావేరీ నీటి యాజమాన్య ప్రాధికార సంస్థ (సీడబ్ల్యూఎంఏ) కర్ణాటకకు ఇటీవల ఇచ్చిన ఆదేశాలు తాజా వివాదానికి మూలం.
ఈ విషయంలో ఏం చేయాలన్న అంశంపై ఈ ఆదివారం కర్ణాటక ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ ఈ సమస్యపై అప్పుడే ఉద్యమం కూడా ప్రారంభించింది. కన్నడ సంఘాలు వచ్చే 13న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ విషయంలో చర్చించేందుకు తమ రాష్ట్రానికి సోమవారం రావాల్సిన తమిళనాడు సీఎం విజయ్‌ను ‘ప్రస్తుత పరిస్థితుల రీత్యా’ వాయిదా వేసుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అభ్యర్థించారు.
రాజ్యాంగంలోని 262వ అధికరణం నదీజలాల వినియోగం, పంపిణీ, నియంత్రణ వంటి అంశాల్లో రాష్ట్రాల మధ్య వివాదాలు రాజుకున్నప్పుడూ, ఫిర్యాదులొచ్చినప్పుడూ వాటి పరిష్కారం కోసం తగిన యంత్రాంగాన్ని ఏర్పాటుచేసే అధికారాన్ని పార్లమెంటుకు ఇచ్చింది. దీని ఆధారంగానే కేంద్రం 1956లో నదీజలాల వివాదాల చట్టాన్ని, నదీజలాల బోర్డు చట్టాన్ని తీసుకొచ్చింది. బోర్డు అయితే ఏర్పాటు కాలేదుగానీ... నదీ వివాదాల చట్టంకింద అయిదు ట్రిబ్యునల్స్ ఏర్పడ్డాయి. చిత్రమేమంటే ప్రజా ప్రభు త్వాలు లేని కాలంలోనే... అంటే బ్రిటిష్ వలసపాలకుల హయాంలోనే నదీజలాల ఒప్పందాలు కుదిరాయి.
1924లో అప్పటి మైసూర్ సంస్థానం, మద్రాస్ ప్రెసిడెన్సీలమధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం మైసూర్ కృష్ణరాజ సాగర్ డ్యామ్‌నూ, మద్రాస్ మెట్టూర్ డ్యామ్‌నూ నిర్మించుకోవటానికి అవగాహన కుదిరింది. అప్పట్లో కావేరీ జలాల్లో దాదాపు 75 శాతం వాటా మద్రాస్ ప్రెసిడెన్సీకే కేటాయించారు. ఈ ఒప్పందం కాలపరిమితి యాభైయ్యేళ్ల అనంతరం 1974లో ముగిసిపోగా అప్పటికే కర్ణాటకలో నదీజలాల కేటాయింపు విషయంలో తమకు అన్యాయం జరిగిందనే భావన బలంగా నాటుకుంది. ఎగువభాగంలో ఉండటం కారణంగా కర్ణాటక తమ నీటి అవసరాలకు తగ్గట్టు కొత్త ప్రాజెక్టుల నిర్మాణం కూడా చేపట్టింది.
వర్షాలు సమృద్ధిగా పడినంతకాలం నదీ జలాల వివాదాలు వచ్చే అవకాశం లేదు. రుతుపవనాలు విఫలమై వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా, కరవు కాటేసినా ఘర్షణలు బయల్దేరతాయి. కావేరీ బేసిన్‌లోని ఆనకట్టలు నిండనప్పుడు తాము బెంగళూరు నగరానికీ, రైతులకూ అవసరమైన నీరు వినియోగించుకోవటంలో తప్పేమిటన్నది కర్ణాటక ప్రశ్న. ఇటు తమవైపు పంటలన్నీ ఎండిపోతున్నాయనీ, న్యాయంగా తమ వాటా నీరు విడుదల చేయాలనీ తమిళనాడు అంటున్నది. అసలే ఈ ఏడాది ‘సూపర్ ఎల్‌నినో’ ప్రభావంతో వర్షాలు సరిగా లేవు. ఇలాంటి పరిస్థితుల్లో సహజంగానే వివాదాలు తలెత్తుతాయి. పుదుచ్చేరి కూడా ఈ కావేరీ జలాల వివాదంలో ఉంటుంది. పడమటి కనుమల్లో పుట్టి గోవా దగ్గర అరేబియా సముద్రంలో కలిసే మహాదాయి విషయంలోనూ కర్ణాటక, గోవాల మధ్య ఇలాంటి వివాదాలే తలెత్తుతుంటాయి.
ప్రపంచ పునరుత్పాదక జలవనరుల్లో మన దేశం వాటా కేవలం 4 శాతం మాత్రమే. కనుక నీటి కోసం పోటీ తప్పదు. సమస్య తలెత్తినప్పుడల్లా తాత్కాలిక పరిష్కారంతో ప్రయత్నించి, గండం గడించిందనుకోవటం తప్ప శాశ్వత పరిష్కార దిశగా ఎవరూ ఆలోచించటం లేదు. ఘర్షణ పడే రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరిద్దా మనుకోవటం లేదు. విపక్షాలనుంచి ఒత్తిళ్లు తప్పవు మరి. నదుల్లో నీరు నిండుకున్న ప్పుడు నీరందక పంటలు ఎండిపోతాయి. దృఢంగా పోరాడి ఆ నష్టాన్ని తగ్గించుకోవటంపైనే వివాదం తలెత్తిన రాష్ట్రాల రైతులు దృష్టి పెడతారు. కావేరీ వివాదం సామరస్య పూర్వకంగా పరిష్కారమయ్యే దిశగా రెండు రాష్ట్రాలూ చిత్తశుద్ధితో కృషిచేయాలి. ఇప్పుడిప్పుడే వరుణుడు కరుణిస్తున్న దాఖలా కనబడుతోంది. కనుక ఈ వివాదం త్వరలో సమసిపోతుందని ఆశించాలి.


