జంతర్ మంతర్ వేదికగా జెన్ జీ తరం సృష్టించిన పెను సంచలనం గురించి అందరూ ఇంకా చర్చించుకుంటుండగానే... తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ఆల్ఫా తరం కూడా తరగతి గదుల్లోంచి బయటికొచ్చింది. ఉత్తరాదిన ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్‌లతో పాటు మహారాష్ట్రలో సైతం పాఠశాలల్లో మంచినీరు, మరుగుదొడ్లు, ఫ్యాన్లు, బెంచీలవంటి కనీస సదుపాయాలు కల్పించాలనీ, అన్ని పాఠ్యాంశాలకూ టీచర్లను నియమించా లనీ కోరుతూ సాగుతున్న ధర్నాల వెనక కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) సాధించిన విజయాల స్ఫూర్తి ఉన్నదని తెలుస్తూనే ఉంది.
పాలకుల్ని నిలదీసిన జెన్ జీ తరాన్ని చూసి అసహ్యించుకున్న ఎంపీ కంగనా రనౌత్ లాంటివారు ఈ ఆల్ఫా తరానికి ఎలాంటి శాపనార్థాలు పెడతారో చూడాల్సివుంది. బిహార్‌లోని గయ జిల్లాలో విద్యార్థులు అతి పెద్ద ధర్నా నిర్వహించడమే కాదు... తమ డిమాండ్లు తెలుసుకోవటానికొచ్చిన ప్రభుత్వా ధికారిని వెనక్కిపంపారు. తాము జిల్లా మేజిస్ట్రేట్ (కలెక్టర్)తో తప్ప మాట్లాడబోమని చెప్పటంతో ఆయనే రావాల్సివచ్చింది. అన్నిచోట్లా ఒకే రకమైన సమస్యలు. అందరిదీ ఒకే రకమైన కథ.
చదువు చుట్టూ ఇన్ని సమస్యలుండగా ‘వికసిత్ భారత్’ ఎలా సాధ్యమో పాలకులు చెప్పాలి. దేశంలో ప్రాథమిక విద్య మొదలు విశ్వవిద్యాలయ విద్యవరకూ అంతా అస్తవ్యస్థంగా ఉంది. ఎక్కడ చూసినా శిథిలాలను తలపించే బడులు, అరకొర సదుపా యాలు వెక్కిరిస్తుంటాయి. సరిపడా ఉపాధ్యాయులుండరు. యాదృచ్ఛికంగానే కావొచ్చు గానీ... రాజ్యసభలో గురువారం పాఠశాల విద్య గురించి అడిగిన ప్రశ్నకు విద్యామంత్రిత్వ శాఖ ఇచ్చిన జవాబు దిగ్భ్రమ గొలుపుతుంది. దేశంలో ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య 1,00,843 అని ఆ శాఖ సహాయమంత్రి చెప్పారు. అందులో 16,357 పాఠశాలలతో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో ఉంటే జార్ఖండ్(9,827), మహారాష్ట్ర(9,269), కర్ణాటక(8,042), ఉత్తరప్రదేశ్(7,874) తదనంతర స్థానాల్లో ఉన్నాయి.
అలాగని మిగిలిన స్కూళ్లు బాగున్నాయని కాదు. రాజస్థాన్‌లోని ఒక పాఠశాలలో కేవలం చరిత్ర, హిందీ పాఠ్యాంశాలకు మాత్రమే టీచర్లున్నారు. మరో పాఠశాలలో 1,2,3 తరగతులకు అసలు టీచర్లే లేరు. తక్షణం టీచర్ల నియామకం జరగకుంటే పాఠశాలకు తాళాలేసి, రహదారి దిగ్బంధిస్తామని పిల్లలు హెచ్చరించారు. చివరకు అప్పటికప్పుడు నలుగుర్ని నియమిస్తూ అధికారులు ఉత్తర్వులిచ్చారు. మరో ముగ్గుర్ని పది రోజుల్లో నియమిస్తామనటంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఫతేపూర్‌లో లిఖితపూర్వక హామీ దొరికేవరకూ ఇంటర్ విద్యార్థులు ధర్నా కొనసాగించారు.
సెకండరీ విద్యలో 2023–24లో ఆడపిల్లల్లో 12.6 శాతంగా ఉన్న డ్రాపౌట్లు 2025–26కు 8 శాతానికి తగ్గాయని పార్లమెంటుకు సమర్పించిన నివేదిక చెబుతోంది. కానీ ఇప్పటికీ 8 శాతంమంది పిల్లలు ఆ స్థాయికొచ్చాక చదువులు మానుకుంటున్నారంటే ఆవేదన కలుగుతుంది. దీన్ని అంకెల్లోకి మారిస్తే లక్షల్లో ఉంటుంది. ఇది మన అధ్వాన్న స్థితికి అద్దం పడుతుంది. పేదరికం మొదలుకొని పాఠశాలలో సదుపాయాల లేమి వరకూ ఇందుకు ఎన్నో కారణాలుండొచ్చు. వాటిని సరిచేయటానికి పూనుకొనే వరకూ ఇలాంటి పిల్లలు చదువులకు దూరంకాక తప్పదని పాలకులు గుర్తించాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్ బడి పిల్లల వ్యథ మరో రకం. అక్కడ గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 11,700 కోట్లు వ్యయం చేసి ‘నాడు–నేడు’ కింద 38,059 పాఠశాలల రూపురేఖల్ని మార్చింది. కార్పొరేట్ విద్యాసంస్థల్ని తలదన్నేలా 60,000 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు, 10,000 స్మార్ట్ టీవీలు అమర్చి తరగతి గదుల్ని డిజిటల్ లెర్నింగ్ స్పేస్‌లుగా మార్చింది. పిల్లలకు దాదాపు ఆరు లక్షల ట్యాబ్‌ల్ని అందించి పాఠాల్ని సులభంగా అవగాహన చేసుకునేందుకు తోడ్పడింది.
ఇప్పుడు ఉత్తరాదిన వినబడుతున్న డిమాండ్లతోపాటు మరెన్నో నాలుగేళ్ల క్రితమే అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు అందులో చాలా భాగం అటకెక్కాయి. గుక్కెడు మంచినీళ్లు, పరిశుభ్రమైన పరిసరాలు, రుచికరమైన మధ్యాహ్న భోజనం కరువయ్యాయి. గతంలో సకల సదుపాయాలతో వర్ధిల్లిన బడులన్నీ ఇప్పుడు బావురుమంటున్నాయి. అనేకం మూతబడ్డాయి. అందుకే ఉత్తరాది పిల్లల స్ఫూర్తితో రేపో మాపో ఏపీ ఆల్ఫా తరం కూడా తిరగబడినా ఆశ్చర్యం లేదు.


