‘సంపూర్ణ క్రాంతి’ సైరన్‌! | Sakshi Editorial On Cockroach Movement | Sakshi
Sakshi News home page

‘సంపూర్ణ క్రాంతి’ సైరన్‌!

Jul 26 2026 12:50 AM | Updated on Jul 26 2026 12:50 AM

Sakshi Editorial On Cockroach Movement

జనతంత్రం

‘‘పదండి ముందుకు, పదండి తోసుకు – ప్రభంజనం వలె హోరెత్తండి’’... శ్రీశ్రీ కవితావేశానికి దృశ్యరూపంలా కనిపించింది ‘కాక్రోచ్‌’ల కదనోత్సాహం. ఎండుగడ్డి మైదానంలో నిప్పు రవ్వలా నిద్రాణమైన జన చేతనను రగిలించగలిగింది. 1974లో స్వాతంత్య్ర సమరయోధుడు జేపీ నాయకత్వంలో నడిచిన ‘సంపూర్ణ క్రాంతి (టోటల్‌ రివోల్యూషన్‌) ఛాయలు ఈ ఉద్య మంలో ప్రస్ఫుటంగా కనిపించాయి. నిరంకుశ పాలన వైపు అడుగులేస్తున్న అధికార కూటమికీ, పక్షవాతం సోకిన ప్రధాన ప్రతిపక్షానికీ కాక్రోచ్‌ ఉద్యమం గట్టి సవాల్‌నే విసిరింది. 

ఉద్యమ స్వభావాన్ని, దాని గమనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక సమయంలోనే గుర్తించగలిగారు. ఫలితంగా శనివారం మధ్యాహ్నం విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని ఆయనే వ్యక్తిగతంగానే తీసుకున్నారని జాతీయ మీడియాకు లీకులందాయి. బహుశా ఆయన ప్రతిష్ఠను నిలబెట్టడం కోసం వీటిని ప్రసారం చేసి ఉండవచ్చు. భారతీయ జనతా పార్టీ ఎన్నికల విజయాల కీలక పాత్రధారుల్లో ధర్మేంద్ర ప్రధాన్‌ కూడా ఒకరు. ఆయన గౌరవాన్ని కాపాడటం పార్టీ బాధ్యత కూడా. సంపూర్ణ క్రాంతి ఉద్యమం మాదిరిగా దేశ వ్యాప్తంగా విస్తరించే లక్షణాలను కాక్రోచ్‌ ఉద్యమంలో గుర్తించి నందువల్ల దీనికి వెంటనే ఫుల్‌స్టాప్‌ పెట్టాలని ప్రధాని భావించి నట్టు సమాచారం.

ధరేంద్ర ప్రధాన్‌ రాజీనామా డిమాండ్‌ను తొలి దశలో ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రజా ఉద్యమాలకు తలొగ్గి నిర్ణయాలను మార్చుకునే లక్షణం పన్నేండేళ్ల పాలనా కాలంలో ఎన్డీఏకు ఎప్పుడూ లేదు. వ్యవసాయ చట్టాలకు వ్యతి రేకంగా పంజాబ్‌ రైతులు చేసిన చరిత్రాత్మక పోరాటంపై స్పందించడానికి మోదీ సర్కార్‌ సుదీర్ఘ సమయాన్ని తీసు కున్నది. అంతర్జాతీయ క్రీడా యవనికపై దేశ ప్రతిష్ఠను ఇనుమ డింపజేసిన మహిళా మల్లయోధుల ఆక్రందన అరణ్యరోదనగా మారింది తప్ప ఎన్డీఏ సర్కార్‌ చలించలేదు. పౌరసత్వ చట్టం దగ్గర నుంచి అనేకానేక అంశాల్లో కేంద్రం ప్రజా ఉద్యమాలను పట్టించుకున్న దాఖలాలు లేవు. ‘కాక్రోచ్‌’ల పార్లమెంట్‌ ముట్టడి జరిగిన మూడు రోజుల్లోనే ప్రధానమంత్రి రంగంలోకి దిగి నష్ట నివారణ చర్యలను చేపట్టారు.

ఈ నెల 23న ఆందోళనపై తొలిసారిగా ఆయన నోరు విప్పారు. పేపర్‌ లీకేజీ ఘటనల విచారణకు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు లను ఏర్పాటు చేస్తున్నట్టు అర్ధరాత్రి ట్వీట్‌ చేశారు. విద్యార్థుల సంక్షేమం, వారి భవితవ్యం కంటే ఇంకేదీ ముఖ్యం కాదని కూడా అందులో పేర్కొన్నారు. 24న జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఇటువంటి నేరాలకు సంబంధించి చట్టానికి మరింత పదును పెడుతూ తీర్మానించారు. సీజేపీ ప్రతినిధులు పెట్టిన గడువు లోపల 25 మధ్యాహ్నం మంత్రి రాజీనామా నిర్ణయం వెలువడింది. ఈ మూడు రోజులుగా కేంద్రమంత్రులు సీజేపీ ప్రతి నిధులతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. సీజేపీ పెట్టిన డిమాండ్లలో మంత్రి రాజీనామా ముఖ్యమైనది. ప్రశ్నాపత్రాల లీకేజీ కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు నష్ట పరిహారం ఇవ్వడం, ఆందోళనలో పాల్గొన్న వారిపై కేసులు ఎత్తివేయడం మిగిలిన రెండు డిమాండ్లు. వీటిని కూడా కేంద్రం అంగీకరించినట్టు సమాచారం.

విద్యార్థులపై జరిగిన పాశవిక లాఠీచార్జికి బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని తాజాగా సీజేపీ డిమాండ్‌ చేసింది. మంత్రి రాజీనామాతో యువజనోద్యమం ముగిసిపోలేదనీ, విద్యావ్యవస్థ ప్రక్షాళన జరిగేవరకూ కొనసాగు తుందనీ కాక్రోచ్‌ ప్రతినిధులు విజయోత్సవం సందర్భంగా ప్రకటించారు. అయితే ప్రస్తుతం జంతర్‌ మంతర్‌ దగ్గర జరుగుతున్న ధర్నా, దీక్షా కార్యక్రమాల విరమణపై నిర్ణయం వెలువడాల్సి ఉన్నది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం కంటే ఎక్కువగా అప్రదిష్ట మూటకట్టుకున్నది గోదీ (పెంపుడు) మీడియా.

ఏన్డీఏ కూటమిలో అప్రకటిత భాగస్వాములుగా పెంపుడు మీడియా, యెల్లో మీడియా వగైరాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జూలై 20న జరిగిన కాక్రోచ్‌ల పార్లమెంట్‌ ముట్టడి కార్యక్రమం పెంపుడు మీడియాను దిగ్భ్రాంతికి గురిచేసింది. దేశం నలుమూలల నుంచి లక్షలాది యువజనం తరలి వస్తారని అది ఊహించలేకపోయింది. పోలీసు దమనకాండకు ఎదురొడ్డి నిలబడతారని కూడా అంచనా వేయలేకపోయింది. ఈ ఉలికి పాటు నుంచి తెప్పరిల్లిన తర్వాత సన్నాయి నొక్కులు ప్రారంభించింది. తరలివచ్చిన ఝంఝూమారుత యువ కెరటాలను ‘నీట్‌ పరీక్ష’ పరిధిల్లోనే బంధించడానికి తాపత్రయపడింది. 

ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తున్నప్పటికీ ఆందోళన కొనసాగించడంలో అర్థం లేదని ధర్మపన్నాగాలను వల్లె వేసింది. జవాబుదారీతనం ఒక కనీస ప్రజాస్వామిక ధర్మమనే విషయాన్ని విస్మరించి మంత్రి రాజీనామా డిమాండ్‌ను తప్పుపట్టింది. తాడూ బొంగరం లేని పార్టీ పిలుపునిస్తే ఇంత జనసందోహం పోగవడం వెనుకనున్న ‘అదృశ్య శక్తుల’ కోసం ఆరా తీయడం మొదలుపెట్టింది. మీడియా పక్షపాతాన్ని నిలదీసిన యువకులను అరాచక శక్తులుగా చిత్రించారు. నవతరం యువతుల ధైర్యసాహసాలకూ, మొహమాటమెరుగని ముక్కుసూటి తనానికీ వాట్సాప్‌ యూనివర్సిటీ పెడార్థాలు తీసింది.

ఆన్‌లైన్‌లో మొదలైన కాక్రోచ్‌ పార్టీ పిలుపునిస్తే లక్షలాది మంది స్పందించడం పట్ల ప్రభుత్వం, పెంపుడు మీడియాలే కాదు, ప్రతిపక్షం కూడా అవాక్కయింది. పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకోవడానికి సహజంగానే కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నించింది. అయితే పాలక కూటమి అందుకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడింది. యాభయ్యేళ్ల కింద దేశంలో సంపూర్ణ క్రాంతి ఉద్యమంనాటి పరిస్థితులే నేటి యువజనో ద్యమం పరిస్థితులు కూడా. బంగ్లాదేశ్‌ విమోచన యుద్ధం తర్వాత ఇందిరాగాంధీ ప్రతిష్ఠ పెరిగింది కానీ దేశ ఆర్థిక పరిస్థితి దిగజారింది. సరకుల ధరలు పెరిగాయి. నిరుద్యోగం ప్రబలింది. రాజకీయ నేతలు, అధికార యంత్రాంగంలో గతంతో పోలిస్తే అవినీతి ప్రబలింది. దీనికి తోడు ఎదురులేదన్న ధీమాతో అధికార పార్టీలో, అధినాయకత్వంలో నియంతృత్వ ధోరణులు ప్రబలాయి. ఈ ధోరణులకు వ్యతిరేకంగా గుజరాత్‌ విద్యార్థులు ప్రారంభించిన ఆందోళనను బిహార్‌ అందిపుచ్చుకున్నది.

అనంతరం జయప్రకాశ్‌ నారాయణ్‌ నాయకత్వంలో అది సంపూర్ణ క్రాంతి ఉద్యమంగా పరిణామం చెంది ఎమర్జెన్సీ విధింపునకు, తదనంతరం ఇందిరాగాంధీ ఓటమికి దారితీసింది. 1974 నాటి పరిస్థితులు మరింత దారుణంగా ఇప్పుడు పరిణమించాయి. విద్యారంగంలో విచ్చలవిడిగా ప్రైవేటీకరణ ప్రబలింది. ఈ ప్రైవేటీకరణ భూతంలేని ఆ రోజుల్లోనే సంపూర్ణ క్రాంతి డిమాండ్లలో అందరికీ విద్య అందుబాటులో ఉండాలనే అంశం ప్రముఖంగా చోటుచేసుకున్నది. ఇప్పుడు దేశంలో మెజా రిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులో లేని పరి స్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ స్కూళ్లను దిగజార్చుతున్నాయి. 2014 నుంచి నేటివరకు దేశంలోని ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య ఒక కోటి పద్దెనిమిది లక్షలు తగ్గింది. అదే సమయంలో ప్రైవేట్‌ స్కూళ్లలో 88 లక్షల మంది పెరిగారు. 

ఇటువంటి పరిస్థితుల్లోనే నాణ్యమైన విద్యను అందరికీ అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసింది. ఫలితంగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. కొన్ని స్కూళ్లలో నో వేకెన్సీ బోర్డులు పెట్టడం జాతీయ వార్తగా మారింది. వాస్తవాలు ఇలా వుంటే... ఇప్పుడు కొత్తగా లోకేశ్‌ సారథ్యంలో ప్రభుత్వ స్కూళ్లు నో వేకెన్సీ బోర్డులు పెడుతున్నట్టు రంప చోడవరం సభలో చంద్రబాబు కళ్లార్పకుండా చెప్పేశారు. తల్లికి వందనం ఐడియా కూడా లోకేశ్‌దే నన్నట్టుగా ఆయన మాట్లా డారు. పెద్ద నాయకుడు కాబట్టి సరిపోయింది. ఇంకెవరైనా అలా మాట్లాడితే ‘అతన్నెవరికైనా చూపించండర్రా’ అంటారు. జగన్‌ మోహన్‌రెడ్డి నిర్మించిన ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్‌కు కట్టబెట్టడం కోసం అనుమతులు తీసుకోకుండా 1,800 మెడికల్‌ సీట్లను ఏపీ విద్యార్థులకు దూరం చేసి వారి కలలను భగ్నం చేశారు. ఇలాంటి పరిస్థితులే కదా కాక్రోచ్‌ల పుట్టుకకు దారితీసేది!

దేశవ్యాప్తంగా ఉన్నత విద్యారంగం పరిస్థితి కూడా నిరాశా జనకంగానే ఉన్నది. యూజీసీ గ్రాంట్లకు భారీగా కత్తెర వేసి విశ్వవిద్యాలయాల నాణ్యతా ప్రమాణాలను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తున్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్‌ వర్సిటీలకు అనుమతులు పెరిగాయి. అవి కాసుల కోసం పని చేస్తాయి తప్ప పరిశోధనల కోసం పాకులాడవు కదా! ఉన్నత విద్యారంగంలో కూడా ప్రమాణాలు గణనీయంగా పడిపోతు న్నాయి. లక్షల సంఖ్యలో ఉత్పత్తి అవుతున్న నాణ్యతలేని పట్టభద్రులకు ఉద్యోగాలు దొరకడం లేదు. పట్టభద్రుల నిరు ద్యోగితా శాతం దేశంలో ముప్పయి శాతం దాటింది. నాణ్యమైన విద్యను ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో దూరం చేశారు. ప్రైవేట్‌ సంస్థల్లో కొనలేని పేద, మధ్యతరగతి విద్యార్థులు నిరుద్యో గులుగా మిగిలిపోతున్నారు. విద్యారంగం పూర్తి సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ సంక్షోభంలో కోట్లాది మంది చిక్కుకొని పోయారు.

సంక్షోభానికి మరోకోణం అవినీతి. రాష్ట్రాల వారీగా నిక్షేపంగా జరుగుతున్న మెడికల్‌ అడ్మిషన్ల విధానాన్ని ఉద్దరిస్తామని చెప్పి కేంద్రీకరించారు. వ్యవస్థాగత బలంలేని టెస్టింగ్‌ ఏజెన్సీకి ప్రతిష్ఠాత్మక సంస్థల అడ్మిషన్ల బాధ్యతను అప్పగించారు. ప్రైవేట్‌ సంస్థలకు కీలకమైన పనులను ఔట్‌ సోర్సింగ్‌ చేసే పద్ధతి వల్ల అవకతవకలకు రాచబాట ఏర్పడింది. ఫలితంగా లక్షలాది విద్యా ర్థుల కలలు కల్లలవుతున్నాయి. ఈ పూర్వరంగంలో ప్రధాన్‌ రాజీనామాతోనే ఈ సంక్షోభం తొలగిపోదు. సంపూర్ణ క్షాళన కోసం యువతరం ఉద్యమించడం అనివార్యం. ఇవాళ కాక పోయినా రేపైనా ఈ సంపూర్ణ క్రాంతిరథం కదలక తప్పదు.

ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ అవకతవకలపై ప్రతిపక్ష నేత అందజేసిన సాక్ష్యాలను యువతరం అందిపుచ్చుకోవలసి ఉన్నది. మెడికల్‌ సీట్లను రాష్ట్ర విద్యార్థులకు అందకుండా చేసిన నిర్వాకంపై ఎలు గెత్తవలసి ఉన్నది. డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ రాజ్యాంగం తోడుగా ఉన్నంతవరకు ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఏ శక్తీ ఏమార్చ లేదని ఈ పరిణామం రుజువు చేసింది. జెన్‌జీగా పిలుచుకుంటున్న నవతరం మొబైల్‌ ఫోన్లలో మునిగిపోయి స్తబ్ధుగా మారిపోయిందనే అభిప్రాయం శుద్ధ తప్పని తేలి పోయింది. అవసరం వస్తే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎలాంటి సవాలైనా ఎదుర్కొనేందుకు వారు సిద్ధపడతారని రుజువైంది. 

కాక్రోచ్‌ ఆందోళనకు దేశవ్యాప్త గుర్తింపు రావడానికి దోహద పడిన సోనమ్‌ వాంగ్‌చుక్, ఒక సెటైర్‌ను వైల్డ్‌ ఫైర్‌గా మార్చగలిగిన అభిజిత్‌ దీప్కే, 23 రోజుల నిరాహార దీక్ష అనంతరం కూడా సివంగిలా రణగర్జనలు చేసిన నేహా బోరా, అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా పోలీస్‌ వ్యాన్‌ ఎదురుగా నిలబడి అమరత్వానికి సిద్ధపడిన రియా అహిర్, వాటర్‌ కెనాన్‌లను గేలిచేస్తూ వాటికింద డ్యాన్సులు చేసిన బిహారీ విద్యార్థులు, తోడేళ్ల మంద ఎదుట తొడగొట్టినట్టు లాఠీచార్జీలను సవాల్‌ చేసిన యువతీ యువకులందరూ ఈ ఉద్యమంలో హీరోలే! రాబోయే సంపూర్ణ విప్లవానికి వేగుచుక్కలు వారే!


వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement