‘నీట్‌’ అయిపోయింది.. సీజేపీ నెక్ట్స్‌ ఏం చేస్తుందంటే? | After Dharmendra Pradhans resignation what next CJP | Sakshi
Sakshi News home page

‘నీట్‌’ అయిపోయింది.. సీజేపీ నెక్ట్స్‌ ఏం చేస్తుందంటే?

Jul 25 2026 9:01 PM | Updated on Jul 25 2026 9:41 PM

 After Dharmendra Pradhans resignation what next CJP

న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నిరసనలకు తలొగ్గడం చాలా అరుదు. సాధారణంగా ప్రభుత్వాలు చర్చలు జరుపుతాయి, నిరసనలను కాలక్రమంలో చల్లారేలా చూస్తాయి. కానీ, కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేఐ) ఆందోళనల విషయంలో మాత్రం ఆ పరిస్థితి మారింది.

నీట్-యూజీ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై వారాల తరబడి పెరిగిన ఒత్తిడి నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. జూన్ 6 నుంచి జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, ఇతర యువత నిరసనలు కొనసాగించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వార్త వెలువడగానే అక్కడ సంబరాలు జరిగాయి.

నీట్ సంక్షోభం కారణంగా ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపిస్తున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని, నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని, జూలై 20న జరిగిన పోలీసు చర్యపై రాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఢిల్లీ పోలీసులు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని సీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు డిమాండ్ చేశారు.

ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే..?
సీజేపీ ఇకపై నీట్, పరీక్షల సంస్కరణలకే పరిమితమవుతుందా? లేక ఉద్యోగాలు, నియామకాలు, యువత భవిష్యత్తు వంటి అంశాలపై దేశవ్యాప్త ఉద్యమంగా చేస్తుందా? ఈ నిర్ణయమే సీజేపీ చరిత్రను నిర్ణయించనుంది.

సీజేపీ.. కేవలం నీట్ ప్రశ్నపత్రం లీక్ కారణంగా పుట్టిందని భావించడం సరికాదు. నీట్ వివాదానికి ముందే, ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ చేసిన వ్యాఖ్య దేశ యువతలో తీవ్ర చర్చకు దారి తీసింది. నిరుద్యోగ యువతను "కాక్రోచ్‌లు" అని అన్నారనే అభిప్రాయం సామాజిక మాధ్యమాల్లో విస్తరించింది. అనంతరం ఆయన నకిలీ డిగ్రీలతో ఉద్యోగాల్లోకి వచ్చే వారినే ఉద్దేశించి మాట్లాడినట్లు వివరణ ఇచ్చినా, అప్పటికే ఆ పదాన్ని యువత తమ ఉద్యమానికి ప్రతీకగా మార్చుకుంది. అలా "కాక్రోచ్" అనే పదం అవమానం నుంచి ప్రతిఘటనకు చిహ్నంగా మారింది.

సామాజిక మాధ్యమాల నుంచే పుట్టిన ఉద్యమం
గతంలో విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఉద్యమాలు జరిగేవి. కానీ, సీజేపీ పూర్తిగా డిజిటల్ వేదికలపై రూపుదిద్దుకుంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, టెలిగ్రామ్ గ్రూపులు, వాట్సాప్ బ్రాడ్‌కాస్ట్‌లు, ప్రత్యక్ష ప్రసారాల‍్లో ఉద్యమం వ్యాప్తి చెందింది. వీటి ద్వారానే వేలాది మంది యువత ఒక్కటయ్యారు. మీమ్స్ ఉద్యమానికి ఊపునిచ్చాయి. ఆ తర్వాత నీట్ ప్రశ్నపత్రం లీక్ ఈ ఉద్యమానికి స్పష్టమైన లక్ష్యాన్ని ఇచ్చింది.

ప్రతి సంవత్సరం సుమారు 25 లక్షల మంది నీట్ పరీక్ష రాస్తున్నారు. అయితే జంతర్ మంతర్ వద్ద కేవలం వైద్య విద్యార్థులే కాదు... యూపీఎస్సీ అభ్యర్థులు, ఎస్‌ఎస్‌సీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత, ఇంజినీరింగ్ పట్టభద్రులు, నిరుద్యోగులు అందరూ ఈ ఉద్యమంలో భాగమయ్యారు. ఎందుకంటే పరీక్ష రద్దు కావడం అంటే వారికి మరో ఏడాది కోచింగ్ ఖర్చు, మరో ఏడాది ఉద్యోగం లేకపోవడం, కుటుంబంపై మరింత భారం పడటమే.

తదుపరి అజెండా ఉద్యోగాలేనా?
భారత్‌లో ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా ఉంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఉద్యోగ మార్కెట్‌లోకి వస్తున్నారు. అయితే స్థిరమైన ఉద్యోగాలు దొరకడం కష్టమవుతోంది. ప్రభుత్వ నియామకాల్లో... ఖాళీలు భర్తీ కాకపోవడం, కోర్టు కేసులు, ప్రశ్నపత్రాల లీకులు, నియామకాల ఆలస్యం వంటి సమస్యలు తరచుగా కనిపిస్తున్నాయి. యువతకు నిరుద్యోగం అనేది నిత్యజీవిత సమస్య.

సీజేపీ ముందున్న కీలక అంశాలు
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఒక ప్రధాన డిమాండ్ నెరవేరింది. ఇప్పుడు సీజేపీ ముందు పలు మార్గాలు ఉన్నాయి. పరీక్షల సంస్కరణలు, పారదర్శకత కోసం ఉద్యమాన్ని కొనసాగించడం. ఉద్యోగాలు, నియామకాలు, ప్రభుత్వ ఖాళీల భర్తీ వంటి అంశాలను ప్రధాన అజెండాగా తీసుకోవడం. లేదా భవిష్యత్తులో రాజకీయ ప్రత్యామ్నాయంగా మారాలా అనే విషయంపై ఆలోచించడం.

చరిత్ర ఏమి చెబుతోంది?
భారత రాజకీయాల్లో ఇలాంటి ఉద్యమాలు భిన్న ఫలితాలు ఇచ్చాయి. జేపీ ఉద్యమం దేశ రాజకీయాలను మార్చింది. అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం తర్వాత ఒక వర్గం రాజకీయాల్లోకి ప్రవేశించింది. రైతుల ఉద్యమం ఒకే చట్ట లక్ష్యంతో విజయాన్ని సాధించింది. అయితే విద్యార్థి ఉద్యమాలు మాత్రం ప్రధాన సమస్య పరిష్కారమైన తర్వాత బలహీనపడిన సందర్భాలు ఎక్కువ.

శనివారం జరిగిన పరిణామం మరో విషయాన్ని కూడా నిరూపించింది. రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాల మద్దతు లేకుండానే డిజిటల్ వేదికల ద్వారా దేశవ్యాప్తంగా ఒక తరం యువతను ఏకం చేయవచ్చని సీజేపీ చూపించింది. ఈ ఉద్యమం ఇంటర్నెట్ సంస్కృతి నుంచి పుట్టుకొచ్చినా దాని డిమాండ్లు మాత్రం ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రాథమికమైనవి.. అవే జవాబుదారీతనం, సమాన అవకాశాలు, న్యాయం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సీజేపీ ఉద్యమానికి ముగింపు కాకపోవచ్చు. ఉద్యోగాలు, నియామక సంస్కరణలు, యువత భవిష్యత్తు వంటి పెద్ద అంశాలపై కొత్త దశకు ఇది ఆరంభం కావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement