న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. శనివారం మీడియా సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ... ఇది విద్యార్థుల విజయమని తెలిపారు. దేశ భవిష్యత్తును విద్యార్దులు నిర్ణయిస్తారని చెప్పారు.
‘‘ఇది భారత విద్యార్థుల నుంచి, ప్రతిపక్షం నుంచి వస్తున్న వార్నింగ్. ఇప్పటి వరకు మీరు దేశాన్ని నడిపిన తీరులోనే ఇకపై నడపలేరు. ఇది మీ వ్యక్తిగత అంశం కాదు. ఇది మీ సొంత ఆస్తి కాదు. ఈ దేశం భారత ప్రజలది. భారత రాజ్యాంగానిది. ఈ సంస్థలన్నీ మీ సొంతం కాదు. ఇదే దారిలో మీరు ముందుకు సాగితే, ఇప్పుడు జరిగిన దానికంటే పది రెట్లు పెద్ద స్థాయిలో ఇదే పరిస్థితి ఎదురవుతుంది. ఇదే మా ప్రధాన సందేశం.
మన విద్యా వ్యవస్థ ఎంతో గొప్పది. భారత విద్యా వ్యవస్థను ఆర్ఎస్ఎస్ నాశనం చేసింది. విద్యార్ధులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. భారత విద్యార్ధులకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలి. విద్యార్థులపై దాడికి అమిత్ షా బాధ్యత వహించాలి. దేశ భవిష్యత్తు అయిన విద్యార్థులపై కాల్పులను అనుమతించము. ప్రజలు ఏం అనుకుంటున్నారో ప్రభుత్వం వినాలి. ప్రభుత్వానికి ఇది ఒక హెచ్చరిక. పేపర్ లీకులపై తీసుకొచ్చే బిల్లులపై విపక్షాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.
విద్యార్థులకు హృదయపూర్వక అభినందనలు. నా తరఫున మద్దతు ఎప్పుడూ ఉంటుంది. విద్యార్థులకు రక్షణగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. దేశ భవిష్యత్తు కచ్చితంగా గతాన్ని ఓడిస్తుంది. విద్యారంగంలో మంచి సంస్కరణలు తీసుకురావాలి. విద్యావ్యవస్థను బీజేపీ భ్రష్ఠు పట్టించింది. విద్యార్థులకు మోదీ క్షమాపణలు చెప్పాల్సిందే. విద్యా రంగాన్ని క్రమంగా ప్రైవేటీకరణ చేస్తున్నారు. విద్యార్థులపై దాడులకు అమిత్ షా బాధ్యత వహించాలి’’ అని రాహుల్ గాంధీ చెప్పారు.


