గత కొంతకాలంగా పరారీలో ఉన్న మహారాష్ట్ర టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితుడు బిజేంద్ర గుప్తా ఎట్టకేలకు మహారాష్ట్ర పోలీసులకు చిక్కాడు. బీహార్‌లో అదుపులో తీసుకున్నారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. అతడు బీహార్‌లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడకు వెళ్లి పట్టుకున్నారు. ఈ కేసులో మరో నిందితుడైన అతడి అనుచరుడ్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గుప్తా భార్యతో పాటు మరికొందరిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గుప్తా మాత్రం పోలీసులకు చిక్కకుండా కొంతకాలం పరారీలో ఉండటంతో మహారాష్ట్ర పోలీసులు విస్తృతంగా గాలించారు. పేపర్ లీక్ రాకెట్‌తో బిజేంద్ర గుప్తా భార్యకు కూడా సంబంధం ఉందని.. సిండికేట్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఈమె సమక్షంలోనే జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఢిల్లీ, పాట్నాలలో ఆస్తుల కొనుగోలుపై దర్యాప్తు చేస్తున్నారు.
బిజేంద్ర గుప్తా భార్యతో సహా 12 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు దేశవ్యాప్తంగా అనేక పరీక్షల ప్రశ్నపత్రాల లీక్ కేసులతో బిజేంద్ర గుప్తాకు సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
జూన్ 28న జరగాల్సిన మహారాష్ట్ర టెట్ పరీక్షకు ముందు థానేలోని కొంగావ్ ప్రాంతంలో లీకైన ప్రశ్నపత్రాలను విక్రయించడానికి ప్రయత్నిస్తున్న ఆకాష్ కుమార్, రాజీవ్ కుమార్, ధీరజ్ సింగ్ అనే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీంతో మహారాష్ట్ర స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈ పరీక్షను వాయిదా వేసింది. ఆరు లక్షల మంది అభ్యర్థులపై ప్రభావం పడింది. ప్రస్తుతం మహారాష్ట్ర పోలీసులు బిజేంద్ర గుప్తాను ట్రాన్సిట్ రిమాండ్‌పై రాష్ట్రానికి తీసుకువచ్చారు.


